Health Tips | వారం రోజుల క్రితం మాకు పాప పుట్టింది. చాలా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. బరువుకూడా బాగానే ఉంది. పాలు తాగుతుంది. ప్రసవ సమయంలోనూ ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈ మధ్యనే పరీక్షించిన పిల్లల నేత్ర వైద్య నిపుణుడు మాత్రం.. బిడ్డ కంట్లో శుక్లం ఉందని చెబుతున్నారు. శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. అసలు, రోజుల బిడ్డకు శుక్లాలు వస్తాయా? మాకు ఆందోళనగా ఉంది. మీరే పరిష్కారం చెప్పాలి.
– ఓ పాఠకురాలు
అవును. నవజాత శిశువులకు కూడా శుక్లాలు రావచ్చు. దీన్ని ‘కంజెనిటల్ కాటరాక్ట్’ అంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు.. బిడ్డ ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురైతే పుట్టుకతోనే శుక్లాలు రావచ్చు. ఇన్ఫెక్షన్తో సంబంధం లేకుండా సాధారణంగానూ రావచ్చు. కొన్నిసార్లు వంశపారంపర్యమూ కావచ్చు. మీ పాప విషయంలో మిగతా అంతా బావుందని అంటున్నారు కాబట్టి, జన్యులోపం కాకపోవచ్చు.
పసిబిడ్డలో ఈ లోపాన్ని గుర్తించిన వైద్యుడిని అభినందించాల్సిందే. లేకపోతే, మీ బిడ్డ జీవితకాలం ఇబ్బందిపడాల్సి వచ్చేది. మొదటి రెండు నెలల్లో వైద్యం అందకపోతే బతుకంతా చీకటే. కంగారు పడకుండా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసుకోండి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్