మా బాబు వయసు పది సంవత్సరాలు. జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. డాక్టర్ను సంప్రదిస్తే.. వైద్య పరీక్షలు చేసి చికున్ గున్యా అని చెప్పారు. జ్వరం తగ్గింది. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా లేవు. కొంత హుషారుగా ఉన్నాడు. కానీ, కొంతమంది చికున్ గున్యా వచ్చినవాళ్లు తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మాకు తెలిసిన వాళ్లు చాలా వారాలు బాధపడ్డారు. మా పిల్లవాడికి అదే పరిస్థితి వస్తుందా?
జ్వరం, ర్యాషెస్ ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లుగా వైద్యులు అనుమానిస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్లలో డెంగీ, చికన్ గున్యా ప్రధానమైనవి. ఎక్కువమంది వీటి బారినపడుతున్నారు. చికున్ గున్యా సోకితే.. జ్వరం, దద్దుర్లు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. సాధారణంగా చికున్ గున్యా జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది.
రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స అవసరం. ఈ జ్వరం బారినపడిన పెద్దవాళ్లలో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. పిల్లలకు అంతగా ఉండవు. ఉన్నా తొందరగానే తగ్గుతాయి. చికున్ గున్యా బారినపడ్డ పిల్లల్లో అతికొద్ది మంది మాత్రమే తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. మీరు చెప్పే దానిని బట్టి మీ బాబుకి తీవ్రమైన లక్షణ్రాలు లేవు. మీ బిడ్డ పూర్తిగా రికవరీ అవుతాడు. అన్ని లక్షణాలు స్థిమితపడతాయి. ఆందోళన చెందకండి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్