Artificial Food Colours | రంగు రంగుల చిరుతిళ్లు చిన్నపిల్లల్ని బాగా ఎట్రాక్ట్ అవుతాయి. వాటిని కొనిచ్చే వరకూ వదిలిపెట్టరు. అంతెందుకు మనం కూడా ఏదైనా ఫుడ్ రంగురంగుల్లో కనిపించగానే తినాలని చూస్తుంటాం. అంతగా ఆ రంగురంగుల ఆహారాలు మనల్ని ఊరిస్తుంటాయి. రోడ్లపై విక్రయించే ఫాస్ట్ ఫుడ్స్ స్టాల్స్ మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీల వరకు తమ ఆహారాలను మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు, రుచిగా అనిపించేందుకు కృత్రిమ రంగులను వాడుతుంటారు. పైకి ఎంతో ఆకట్టుకునేలా ఉన్నా.. వీటిని తినగానే ఎన్నో రసాయనాలు మన పొట్టలోకి పోతుంటాయి. ఆర్టిఫీషియల్ ఫుడ్ కలర్స్ వల్ల ఎలాంటి హాని జరుగుతుందో అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
ఫుడ్ కలర్స్ అనేవి మనిషి తయారుచేసేవి. ఇవి పలు రసాయనాల సమ్మేళనంతో తయారవుతాయి. తొలుత బొగ్గు తారు నుంచి తీసేవారు కాగా ప్రస్తుతం పెట్రోలియం నుంచి సంగ్రహిస్తున్నారు. కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్లు ఆహారం సహజ రంగును చెరిపేస్తాయి. కృత్రిమ రంగులను వాడి తయారుచేసిన ఆహారాలను తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. క్లోరోఫిల్ అన్నాట్టో, కారామిల్ అనేవి ప్రకృతి రంగులు. రసాయనాలతో తయారుచేసేవి కృత్రిమ రంగులు. పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ వాడిన ఆహారాలు కొంత వరకు బెటర్.
మన వద్ద అనుమతి ఉన్న రంగులు..
పసుపు రంగు కోసం టార్ర్టజైన్, సన్ సెట్ ఎల్లో
ఎరుపు రంగు కొరకు కార్మొసైన్, పొన్ క్యూ-4ఆర్, ఎరిత్రాసిన్
నీలి రంగు కొరకు బ్రిలియంట్ బ్లూ, ఇండియా క్యారఫైన్
ఆకుపచ్చ రంగు కోసం ఫాస్ట్ గ్రీన్
ఐస్క్రీములు, బిస్కెట్లు, జెల్లీల తయారీలో పై రంగులు వాడుతారు.
వీటిలో ఏ రంగైనా ఆమోదించిన ప్రమాణం దాటితో ఆ ఆహారాలు విషప్రభావాన్ని కలిగి ఉంటాయి.
బిర్యానీ, లడ్డూ తయారీలో కలిపే మెటనిల్ పసుపు నీరసాన్ని, తల తిప్పడాన్ని, వాంతులను కలుగజేస్తుంది.
ఫుడ్ కలర్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు..
వెనిల్లా ఐస్ క్రీమ్
బార్సిమిక్ వెనిగర్
తెల్ల రొట్టె
పాప్ కార్న్
బయట విక్రయించే ఊరగాయలు
సలాడ్ డ్రెస్సింగ్
చూయింగ్ గమ్
బయటి పెరుగు
ఎనర్జీ బార్ చాక్లెట్లు
చిప్స్
చాక్లెట్లు, క్యాండీలు
రంగుల స్వీట్లు
కూల్డ్రింక్స్
ఫుడ్ కలర్స్ పడలేదని తెలిపే లక్షణాలు..
తలనొప్పి వస్తుంది
శరీరంపై దద్దుర్లు తేలుతాయి
చర్మం ఎరుపెక్కి దురదగా ఉంటుంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఛాతీలో బిగుతుగా మారుతుంది
మైకం, వికారం వస్తుంటుంది
రక్తపోటు తగ్గిపోతుంది
వేడి ఆవిర్లు వచ్చిన ఆనుభూతి
ముఖం, పెదవులు, నుదురుపై వాపులు కనిపిస్తాయి
ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి..
ఫుడ్ అలెర్జీలు కనిపిస్తాయి
రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది
శరీరంపై దద్దుర్లు వస్తాయి
ఉబ్బసం వచ్చే అవకాశాలున్నాయి
పిల్లల్లో హైపర్ యాక్టివిటీతోపాటు ఆటిజం రావొచ్చు
క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం ఉంటుంది
చిరాకు, డిప్రెషన్, మానసిక ఆందోళనలు పెరుగుతాయి.
వీటితో రీప్లేస్ చేసుకోవచ్చు..
ఆహారాల తయారీలో ఒకవేళ రంగులు వాడాల్సి వస్తే కృత్రిమ రంగులకు బదులుగా సహజ రంగులను వాడటం అలవాటు చేసుకోవాలి. బచ్చలికూర నుంచి సహజమైన ఆకుపచ్చ రంగు, బీట్రూట్ నుంచి ఎరుపు రంగు, ఊదా క్యారెట్ నుంచి పర్పుల్ రంగులను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా, వివిధ పండ్లు, కూరగాయలతో కూడా రకరకాల సహజ రంగులను తయారు చేసుకోవచ్చు. వీటితో సిద్ధం చేసుకున్న ఆహారాలు రుచికరంగానూ, ఆరోగ్యానికి మేలు చేసేవిగానూ ఉంటాయి. ఆహారంలో కల్తీని విస్మరించడం వలన అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుందని మరిచిపోవద్దు. ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. బయట ఆహారాలు తినకుండా జాగ్రత్త పడాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐయస్) ధృవీకరించిన రంగుల ఉత్పత్తులను కొనడం క్షేమం.