IBS | ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) తో జీవించడం చాలా మందికి అసౌకర్యంగా, అంచనా వేయలేని పరిస్థితిలా అనిపిస్తుంది. ఇది పెద్ద పేగును ప్రభావితం చేసే సాధారణ జీర్ణ సమస్య. సాధారణంగా పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. ఐబీఎస్‌కు కచ్చితమైన కారణం ఇంకా పూర్తిగా తెలియకపోయినా ఒత్తిడి, గట్ (జీర్ణాశయం) సెన్సిటివిటీ, కొన్ని ఆహారాలు ఈ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యను నియంత్రించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను శాంతింపజేయడంతోపాటు వాపులను తగ్గించవచ్చు. ఐబీఎస్‌తో బాధపడేవారు తమ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి కూడా నిపుణులు సూచిస్తున్నారు.
ఐబీఎస్ అనేది కేవలం కొన్ని ఆహారాలను దూరం పెట్టడం మాత్రమే కాదు. సరైన ఫైబర్, పోషకాలు ఉన్న ఆహారాలు జీర్ణక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. కొన్ని ఆహారాలు మల నిర్మాణాన్ని మెరుగుపరచడం, గట్ మజిల్స్‌ను శాంతింపజేయడం, మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం వంటి విధంగా పనిచేస్తాయి. ఐబీఎస్ తో బాధపడే వారు తమ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐబీఎస్ నియంత్రణకు గ్రీన్ కివీ పండు మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండు కివీ పండ్లు తినడం వల్ల మల విసర్జన మెరుగుపడటం, మలం మృదువుగా మారడం, పొట్టలో అసౌకర్యం తగ్గడం జరుగుతుంది. ఇందులో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ జీర్ణక్రియను సాఫీగా కొనసాగించడంలో సహాయపడుతుంది.
పెప్పర్మింట్ ఆయిల్ కూడా ఐబీఎస్ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది యాంటీ స్పాస్‌మోడిక్‌గా పనిచేసి కడుపు నొప్పి, బ్లోటింగ్‌ను తగ్గిస్తుంది. గట్‌లోని మజిల్స్‌ను రిలాక్స్ చేసి క్రమంగా జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పార్టియల్లీ హైడ్రోలైజ్డ్ గ్వార్ గమ్ (PHGG) అనే సహజ ఫైబర్ సప్లిమెంట్ కూడా జీర్ణక్రియను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రీబయోటిక్‌గా పనిచేసి గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇతర ఫైబర్లతో పోలిస్తే గ్యాస్ సమస్య తక్కువగా ఉండేలా ఇది సహాయపడుతుంది. ఓట్స్ కూడా సులభంగా జీర్ణమయ్యే సాల్యుబుల్ ఫైబర్ మూలంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఐబీఎస్ లక్షణాలు కొంతవరకు నియంత్రణలో ఉంటాయి.
గ్రీన్ బనానా ఫ్లోర్ (పచ్చ అరటి పిండి)లో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. ఇది గట్‌లో మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తూ పొట్ట లోపలి పొర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొంతమంది దీన్ని గోధుమ పిండి స్థానంలో కూడా ఉపయోగిస్తుంటారు. గట్ ఆరోగ్యం కోసం ఆహారాలను పూర్తిగా తొలగించడం కాకుండా, సరైన ఆహారాలను సరైన మోతాదులో చేర్చుకోవడం ముఖ్యం. ఒక్కొక్కరి శరీర స్పందన ఒక్కోలా ఉంటుంది కనుక ఐబీఎస్ ఉన్నవారు కొత్త ఫైబర్ ఆహారాలను మెల్లగా, ఒక్కోటి చొప్పున ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.