కోడిగుడ్డును తినేటప్పుడు చాలా మంది అందులో ఉండే పచ్చ సొనను పక్కన పెట్టి కేవలం తెల్ల సొన మాత్రమే తింటుంటారు. కానీ వాస్తవానికి కోడిగుడ్డు పచ్చ సొనలో అనేక పోషకాలు ఉంటాయి. తెల్ల సొనలో ఉండని అనేక పోషకాలు మనకు పచ్చ సొన ద్వారా లభిస్తాయి. కోడిగుడ్డు పచ్చ సొన తినని వారు అనేక పోషకాలను కోల్పోయినట్లే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డు పచ్చ సొన తింటే కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చాలా మంది పచ్చ సొన తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ వాస్తవానికి ఒక గుడ్డు పచ్చ సొనలో మన శరీరానికి రోజుకు కావల్సిన కొలెస్ట్రాల్ కన్నా తక్కువగానే కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక రోజుకు ఒక గుడ్డు పచ్చ సొనను ఎలాంటి భయం లేకుండా తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.
కోడిగుడ్డు పచ్చ సొనలో విటమిన్లు ఎ, డి, ఇ, కె అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వులో కరిగే విటమిన్లు. అందువల్ల కోడిగుడ్డు పచ్చ సొనను తింటే మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో ఆ సొనలో ఉండే ఆయా విటమిన్లు మనకు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్డు పచ్చ సొనలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరచడంతోపాటు చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. అలాగే విటమిన్ డి వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. గుడ్డు పచ్చ సొనలో ఉండే విటమిన్ ఇ పురుషుల్లో ఉండే నపుంసకత్వ సమస్యను పోగొడుతుంది. చర్మాన్ని సంరక్షించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గుడ్డు పచ్చ సొనలో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు తీవ్ర రక్త స్రావం జరగకుండా అరికడుతుంది. రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. అలాగే ఎముకలను సైతం బలంగా ఉంచుతుంది. ఇన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి కనుక గుడ్డు పచ్చ సొనను కచ్చితంగా తినాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ సొనను తింటే విటమిన్ బి12 లభిస్తుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాక, రక్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. గుడ్డు పచ్చ సొనలో విటమిన్లు బి2, బి5, బి6 సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని, పోషణను అందివ్వడమే కాదు, రోగాలను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. గుడ్డు పచ్చ సొనలో అధికంగా ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది.
కోడిగుడ్డు పచ్చ సొనలో ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సొనలో ఉండే సెలీనియం షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అలాగే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో వీర్యం ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. ఈ సొనలో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. కాపర్, అయోడిన్ కూడా ఇందులో అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. గుడ్డు పచ్చ సొనలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంచుతుంది. గర్భిణీల గర్భంలో ఉండే శిశువుల ఎదుగుదలకు సహాయం చేస్తుంది. గుడ్డు పచ్చ సొనలో ఉండే లుటీన్, జియాజాంతిన్లు కంటి చూపును మెరుగు పరిచి కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి. ఇలా కోడిగుడ్డులో ఉండే పసుపు పచ్చ సొనను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అయితే ఈ సొనను రోజుకు కేవలం ఒకటి మాత్రమే తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.