లండన్ : గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం, వర్కవుట్లు మేలు చేస్తాయనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని వ్యాయామాలు, ఆహారంతో కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారం గుండెకు మేలు చేస్తుందని ఇప్పటివరకూ పలు పరిశోధనల్లో వెల్లడి కాగా, తాజాగా వెన్న, పెరుగు, బ్లాక్ చాక్లెట్‌తో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధనలు పేర్కొంటున్నాయి.
కొవ్వు శాతం అధికంగా ఉండే డైరీ ఫుడ్స్ పరిమిత మోతాదులో తీసుకుంటే గుండెకు మేలు చేకూరుస్తుందని మెడికల్ జర్నల్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్‌లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. గుండె ఆరోగ్యానికి ఆహారానికి ఉన్న సంబంధంపై జరిగిన 100 అధ్యయనాలను సమీక్షించిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్ పరిశోధకులు ఈ వివరాలు రాబట్టారు.
పెరుగు, కొద్దిమోతాదులో వెన్న నిత్యం తీసుకుంటే దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యం మెరుగవుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక చాక్లెట్లను కూడా పరిమితంగా తీసుకుంటే గుండె జబ్బుల బారినపడకుండా జాగ్రత్తపడవచ్చని తెలిపింది. డార్క్ చాక్లెట్లో ఉండే యాంటీఆక్సిడెండ్లు, ప్లేవనాల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని పేర్కొంది.