Ayurveda Tea | ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల్లో ఏర్పడే హెచ్చు తగ్గుల మూలంగానే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. శరీరంలో ఆయా దోషాలు పెరిగితే భిన్న రకాల వ్యాధులు వస్తాయి. ఈ క్రమంలో పిత్త దోషం ఉంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ఇలాంటి వారికి జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అవకపోవడమో లేదంటే విపరీతంగా జీర్ణ రసాలు ఉత్పత్తి కావడమో జరుగుతుంది. దీంతో పిత్త దోషం ఏర్పడి జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అజీర్తి ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇది బరువు పెరిగేలా చేస్తుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు కూడా ఉంటాయి. కనుక ఈ సమస్యలు ఉన్నవారు ఈ దోషాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేదిక్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆయుర్వేద టీని ఆయుర్వేద చాయ్ లేదా అగ్ని టీ అని కూడా పిలుస్తారు. దీన్ని తాగితే మన జీర్ణాశయంలో జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో పిత్త దోషంలో ఉండే హెచ్చు తగ్గులు సవరించబడతాయి. దీని వల్ల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ ఆయుర్వేద టీ జఠరాగ్నిని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా అజీర్తి ఉన్నవారు ఈ ఆయుర్వేద టీని తాగుతుంటే ఎంతో ఫలితం ఉంటుంది. ఈ టీ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్నవారికి కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది.
ఆయుర్వేద టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కాస్త ఓపిక ఉంటే చాలు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ టీని తయారు చేసుకోవచ్చు. ఈ టీ సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసింది కనుక చాలా సురక్షితమైంది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీన్ని రోజూ తాగవచ్చు. ముఖ్యంగా కాఫీ, టీ అధికంగా తాగేవారు ఒక పూట వాటిని మానేసి అందుకు బదులుగా ఈ టీని సేవిస్తుండాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఈ టీని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో కొన్ని నీళ్లను పోసి బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో కాస్త అల్లం, మిరియాల పొడి వేయాలి. అందులోనే కాస్త రాక్ సాల్ట్‌ను కూడా కలపాలి. బాగా మరిగిన తరువాత వడకట్టి గోరు వెచ్చగా అయ్యాక అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా ఈ టీని తయారు చేసి రోజుకు ఒక్కసారి తాగినా చాలు, ఎంతో మేలు జరుగుతుంది.
ఆయుర్వేద టీని సేవించడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, ఇంకా అనేక వ్యాధులకు ఈ టీ ఔషధంగా పనిచేస్తుంది. రోజూ ఏదో ఒక సమయంలో ఈ టీని సేవిస్తుండాలి. ఇందులో అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తాయి. రోగాల నుంచి రక్షణను అందిస్తాయి. అయితే అలర్జీల వంటి సమస్య ఉన్నవారు ఈ టీని సేవించకూడదు. ఇది వారిలో చర్మంపై దురదలను కలిగించే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు ఈ టీని సేవిస్తే మంచిది.