Gas Trouble Pain Vs Heart Attack Pain | చాలా మందికి తరచూ గ్యాస్ సమస్య వస్తుంటుందన్న విషయం విదితమే. గ్యాస్ ట్రబుల్ ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఆహారాన్ని వేళకు తీసుకోకపోవడం, అతిగా భోజనం చేయడం, శీతల పానీయాలను లేదా మద్యాన్ని అధికంగా సేవించడం, కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తినడం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల చాలా మందికి గ్యాస్ సమస్య వస్తుంటుంది. అయితే గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కొన్ని సార్లు ఛాతిలో అక్కడక్కడా కొన్ని చోట్ల నొప్పిగా ఉంటుంది. దీంతో చాలా మంది తమకు గుండె నొప్పి వచ్చిందేమోనని భయపడతారు. తీవ్ర ఆందోళనకు గురవుతారు. అయితే వాస్తవానికి ఛాతిలో నొప్పికి, గుండె నొప్పికి సంబంధం ఉన్నప్పటికీ అన్ని సార్లు వచ్చే ఛాతినొప్పి గుండె నొప్పికి కారణం కాదు. కొన్ని సార్లు గ్యాస్ వల్ల కూడా ఛాతిలో అక్కడక్కడా నొప్పి వస్తుంది. దీన్ని గుండె నొప్పిగా చాలా మంది భావిస్తారు. అయితే అసలు ఈ రెండింటికీ మధ్య తేడాను ఎలా గుర్తించాలి..? ఏ నొప్పి అయింది మనకు ఎలా తెలుస్తుంది..? అన్న వివరాలను వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
గ్యాస్ నొప్పి అయితే ఛాతిలో దాదాపుగా అన్ని చోట్ల నొప్పిగా ఉంటుంది. కొన్ని సార్లు ఈ నొప్పి పొట్ట మీద, ఛాతిలో కుడి వైపు కూడా ఉంటుంది. ఎల్లప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. గ్యాస్ బయటకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడూ లేదా ఆహారం తిన్నప్పుడు సరిగ్గా జీర్ణం అవక త్రేన్పులు వస్తాయి. అలాగే కొందరికి కడుపులో మంటగా కూడా ఉంటుంది. కొందరికి గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఇక గుండె నొప్పి వస్తే లక్షణాలు వేరేగా ఉంటాయి. గుండె నొప్పి అయితే ఛాతిపై బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. ఛాతిలో పొడిచినట్లుగా ఉంటుంది. విపరీతమైన చెమటలు పడుతుంటాయి. ఎడమ చేయి, భుజం వైపు లాగుతూ విపరీతమైన నొప్పి వస్తుంది. ఎడమ దవడ, మెడ వైపు కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. గుండె నొప్పి వచ్చిన వారిలో కొందరికి విరేచనాలు అవుతాయి. తలతిరగడం, వాంతికి వచ్చినట్లు ఉండడం అనిపిస్తుంది. కొందరికి వాంతులు కూడా అవుతాయి. ఎడమ వైపు శరీరం అంతా పట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అసలు ఏ భాగాన్ని సరిగ్గా కదిలించలేకపోతారు. ఛాతిలో మధ్య భాగం నుంచి నిలువుగా కిందకు మీదకు నొప్పిగా ఉంటుంది. కొందరు స్పృహ తప్పి పడిపోతారు కూడా. ఇలా రెండు రకాల నొప్పులకు పలు తేడాలు ఉంటాయి.
అయితే గుండె నొప్పి లక్షణాలు అన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. ఇది చాప కింద నీరులా ఉంటుంది. ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఆయా లక్షణాలను బట్టి మనకు ముప్పు పొంచి ఉంటుందో లేదో నిర్దారించవచ్చు. కనుక ఎవరికైనా ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. గుండెకు ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీని వల్ల గుండె పోటు రాకుండా ముందే అడ్డుకోవచ్చు. ప్రాణాలను నిలుపుకోవచ్చు. అయితే సాధారణ గ్యాస్ సమస్య ఒకటి లేదా రెండు రోజులకు మించి ఉండదు. కానీ రోజుల తరబడి అలాగే ఉందంటే అప్పుడు కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే కొన్ని సార్లు గ్యాస్ నొప్పి లక్షణాలతో గుండె నొప్పి వస్తుంది. కనుక రోజుల తరబడి గ్యాస్ నొప్పి లక్షణాలు ఉన్నవారు కూడా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను కలవాల్సి ఉంటుంది.
సాధారణ గ్యాస్ నొప్పి అయితే ఇంటి చిట్కాలను పాటించాలి. దీని వల్ల ఒకటి లేదా రెండు రోజుల్లో చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా లక్షణాలు తీవ్రతరమవుతున్నా కూడా అనుమానించాల్సిందే. అది గుండె పోటుకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. కనుక లక్షణాలు ఎలా ఉన్నాయి, తీవ్రత ఎలా ఉంది, నొప్పి ఎలా వస్తుంది, ఎటు నుంచి నొప్పి ఎటు వెళ్తుంది అన్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దీని వల్ల గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.