Coconut Oil For Hair | ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. జుట్టు రాలిపోవడం, బలహీనంగా మారి చిట్లడం, తలలో దురద అధికంగా ఉండడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలు అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జుట్టు సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల చాలా మందికి జుట్టు సమస్యలు వస్తుంటాయి. అయితే కొబ్బరినూనె వీటికి చక్కని పరిష్కారం చూపిస్తుంది. కానీ కొబ్బరినూనెను జుట్టు సమస్యలకు ఎలా ఉపయోగించాలో చాలా మందికి సరిగ్గా అవగాహన లేదు. చాలా మంది కొబ్బరినూనెను కేవలం జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేస్తారు. అయితే కొబ్బరినూనెను ఇలా వాడకూడదు. భిన్న రకాల జుట్టు సమస్యలకు కొబ్బరినూనెను పలు విధాలుగా వాడాల్సి ఉంటుంది. అందుకు గాను పలు ఇంటి చిట్కాలను పాటించాలి. ఇవి జుట్టుకు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు సమస్యలను తగ్గిస్తాయి.
కొబ్బరినూనెను 1 లేదా 2 టేబుల్ స్పూన్లను తీసుకుని కాస్త వేడి చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. 30 నిమిషాలపాటు ఆగిన తరువాత తలస్నానం చేయాలి. సమయం ఉందని అనుకుంటే 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా వేచి ఉండవచ్చు. లేదా రాత్రి పూట రాసి ఉదయం తలస్నానం చేయవచ్చు. ఇలా కొబ్బరినూనెను రాస్తుంటే శిరోజాలకు ప్రోటీన్లు లభిస్తాయి. పోషణ అంది జుట్టు దృఢంగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. జుట్టు బలహీనంగా మారడం తగ్గుతుంది. జుట్టు చిట్లిపోదు. జుట్టుకు తేమ లభించి పొడిగా మారడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. ఇక చుండ్రు ఉన్నవారు కొబ్బరినూనెను కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉన్న తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే చుండ్రు తొలగిపోతుంది. తలలో ఉండే దురద నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని జుట్టుకు రాసి 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉండాలి. తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను పాటిస్తుంటే శిరోజాలకు తేమ లభిస్తుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కుదుళ్ల వద్ద ఉండే దురద తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని కాస్త వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. ఈ చిట్కాను పాటిస్తుంటే శిరోజాలు దృఢంగా మారుతాయి. జుట్టు చిట్లిపోవడం తగ్గుతుంది. శిరోజాలకు పోషణ లభించి ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ విధంగా కొబ్బరినూనెతో పలు చిట్కాలను పాటించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. శిరోజాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు రక్షణ లభిస్తుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. చుండ్రు, తలలో దురద వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే కొబ్బరినూనె సహజసిద్ధంగా తయారు చేసింది అయితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. వర్జిన్ లేదా ఎక్స్ట్రా వర్జిన్ కొబ్బరినూనె అని మార్కెట్లో లభిస్తుంది. దీన్ని వాడితే చక్కని ఫలితం లభిస్తుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అవి జుట్టుకు పోషణను అందించి దృఢంగా ఉండేలా చేస్తాయి. కొబ్బరినూనెను ఇలా ఉపయోగిస్తే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.