‘హెపటో’ లేదా ‘హెపాటిక్’ అనేది గ్రీకు పదం. దీనికి వైద్య పరిభాషలో ‘కాలేయం’ అని అర్థం. సుమారు 1.5 కిలోల వరకూ బరువు ఉండే కాలేయం.. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం కూడా ఇదే. జీవప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తూ, దాదాపు 500రకాలకు పైగా జీవక్రియలను నిర్వర్తిస్తుంది.
కాలేయం వాపే.. హెపటైటిస్ :
విషతుల్యమైన పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం ప్రభావంతో కాలేయం వాపునకు గురవుతుంది. ఈ విధంగా కాలేయం వాపునకు గురవడాన్నే ‘హెపటైటిస్’ అంటారు. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్లు.. కాలేయాన్ని హెపటైటిస్‌కు గురిచేస్తాయి.
ఆ వైరస్లు ప్రమాదకరం :
హెపటైటిస్‌కు గురిచేసే ఐదు వైరస్లలో బి, సి వైరస్లు చాలా ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి, అరక్షిత శృంగారం ద్వారా తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు ఈ వైరస్లు సోకే ప్రమాదం ఉంటుంది. హెపటైటిస్-బి సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కానీ, హెపటైటిస్-బి పాజిటివ్ ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. పరీక్షలు చేయించుకుని నెగిటివ్ ఉంటే, ఏ వయసులోనైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం ఈ వ్యాక్సిన్ వేయించడం మంచిది. ఇక హెపటైటిస్-సి కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
ఈ లక్షణాలు.. ప్రమాదానికి సంకేతాలు :
ఆకలి మందగించడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. నాటువైద్యం జోలికి వెళ్తే మొదటికే మోసం. లివర్ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్, లివర్ అబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా.. వీటిలో హెపటైటిస్-బి, సి వైరస్లు కలగచేసే ఇన్ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తరువాత కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. కాలేయాన్ని గట్టిగా మార్చడం(సిరోసిస్) తరువాత కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు.
కాలేయ క్యాన్సర్లు.. రెండు రకాలు :
కాలేయ క్యాన్సర్లను ప్రధానంగా రెండు రకాలుగా పరిగణిస్తారు. ఒకటి హెపటుసెల్యులార్ కార్సినోమా. ఇది కాలేయంలో నుంచి వస్తుంది. రెండోది మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్. శరీరంలోని ఇతర భాగాలలో మొదలైన క్యాన్సర్.. కాలేయానికి వ్యాప్తి చెందుతుంది. జీర్ణవ్యవస్థలోని చాలారకాల క్యాన్సర్లు కాలేయానికి వ్యాపిస్తాయి. వీటితోపాటు బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్లుకూడా కాలేయానికి వ్యాపిస్తాయి. ఆలస్యంగా బయటపడే కాలేయ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది.
ప్రధాన కారణం.. హెపటైటిస్-బి :
భారత్, చైనా, హాంకాంగ్, తైవాన్, కొరియా, దక్షిణాఫ్రికాలలో హెపటైటిస్-బి, ఇన్ఫెక్షన్ల వల్లే కాలేయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. పుట్టుకతో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ 30 లేదా 40 సంవత్సరాలలో లక్షణాలు బయటపడటం, క్యాన్సర్‌కు గురవడం చూస్తున్నాం.
పురుషులలో ఎక్కువ :
కాలేయ క్యాన్సర్ మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగం త్వరగా ముదిరి, చికిత్సకు లొంగదు.
లక్షణాలు :
ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు :
హెపటైటిస్-బి లేదా హెపటైటిస్-సి ఉన్నవారు రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్యను, షుగర్ స్థాయులు, క్యాల్షియం, కొలెస్ట్రాల్ స్థాయులు, ఆల్ఫాఫీటా ప్రొటీన్(ఏఎఫ్‌పీ) తదితర వివరాలు తెలిపే రక్తపరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ పరీక్షలు, వైద్యుల సలహా మేరకు సీటీ, ఎంఆర్ఐ, పెట్-స్కాన్, లివర్ బయాప్సీ తదితర పరీక్షలతో కాలేయ క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో తెలుసుకోవచ్చు.
చికిత్సా పద్ధతులు :
కాలేయంలో కణితి పరిమాణం, ఏర్పడిన ప్రదేశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఈ క్యాన్సర్ ఒక్కొక్కరిలో ఒక్కోలా పెరుగుతుంది. కొందరిలో నెలలోపే కణితి రెట్టింపు అయితే, మరికొందరిలో ఏడాదికిపైగా పట్టొచ్చు. కణితి చిన్నగా ఉన్నప్పుడే గుర్తించినా.. అది లివర్ సిరోసిస్‌కు గురవడం వల్ల సర్జరీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టిరియల్ కీమో ఎంబోలైజేషన్, రేడియో అబ్లేషన్, ప్రోటాన్ బీమ్ థెరపీ, బయో థెరపీ, కీమో అబ్లేషన్, స్టీరియో ట్రాక్టర్ రేడియో సర్జరీ వంటి పద్ధతులతో కణితిని తొలగించడం లేదా పరిమాణాన్ని తగ్గించవచ్చు. కణితి చిన్నగా ఉండి, కాలేయం ఇతర భాగం బాగానే ఉంటే శస్త్రచికిత్సే ఉత్తమం. కణితి పెద్దగా ఉన్నా లేక ఎక్కువ సంఖ్యలో కణుతులు ఉన్నా, కాలేయం విఫలమయ్యే దశలో ఉన్నా.. కాలేయ మార్పిడి చేయాల్సి ఉంటుంది.