Ashwagandha Tea | ఆయుర్వేదంలో అశ్వగంధను ఒక శక్తివంతమైన మూలికగా చెబుతారు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. అశ్వగంధలో అడాప్టొజెనిక్ గుణాలు ఉంటాయి. అంటే ఒత్తిడిని తగ్గిస్తుందన్నమాట. అశ్వగంధ మనకు ఆయుర్వేద షాపుల్లో పొడి లేదా ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన మేరకు వాడుకోవాలి. ఇక పొడిని చాలా మంది ఉపయోగిస్తారు. దీన్ని నీటిలో వేసి మరిగించి డికాషన్లా తయారు చేసి తాగవచ్చు. అశ్వగంధ టీని రోజూ ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. రోజూ మీరు తాగే టీ, కాఫీలకు బదులుగా అశ్వగంధ టీ ని ఉదయం లేదా సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగండి. అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. అశ్వగంధ అనేక వ్యాధులకు ఔధషంగా పనిచేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. అశ్వగంధను రోజూ ఉపయోగిస్తే అనేక రోగాలు తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
అశ్వగంధ టీని తాగడం వల్ల ఇందులో ఉండే అడాప్టొజెనిక్ గుణాలు మన శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. కార్టిసాల్ అనేది ఒత్తిడిని కలగజేసే హార్మోన్. కనుక అశ్వగంధ టీని తాగితే కార్టిసాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో ఒత్తిడి మాయమవుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. అశ్వగంధ టీని రాత్రి పూట సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. అశ్వగంధ మన నాడీ మండల వ్యవస్థను ప్రశాంతగా మారుస్తుంది. దీని ఆందోళన, ఒత్తిడి సులభంగా తగ్గి నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు అశ్వగంధ టీని రోజూ రాత్రి పూట తాగుతుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.
అశ్వగంధలో ఇమ్యునో మాడ్యులేటింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. దీంతో వ్యాధులు తగ్గుతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం అశ్వగంధ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఏకాగ్రతను మెరుగు పరుస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మతిమరుపు తగ్గుతుంది. అశ్వగంధలో విథనోలైడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులను ఇవి తగ్గిస్తాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
అశ్వగంధ శారీరక శక్తిని మెరుగు పరుస్తుంది. ఈ టీని తాగుతుంటే శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ చేసేవారు ఈ టీని సేవిస్తే త్వరగా కోలుకుంటారు. నీరసం, అలసట తగ్గిపోతాయి. మళ్లీ శరీరానికి ఉత్సాహం, ఉత్తేజం లభిస్తాయి. చురుగ్గా పనిచేయగలుగుతారు. రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. అశ్వగంధ మనకు మార్కెట్లో పొడి రూపంలో అధికంగా లభిస్తుంది. అశ్వగంధ మొక్క వేర్ల నుంచి ఈ పొడిని తయారు చేస్తారు. వేర్లు లభిస్తే వాటిని తెచ్చి ఎండబెట్టి వాటితో మీరు కూడా పొడి తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని నీటిలో వేసి మరిగించి తరువాత వడకట్టి ఆ నీళ్లు గోరువెచ్చగా ఉండగానే అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. లేదా నేరుగా అయినా తాగవచ్చు. ఇలా అశ్వగంధ టీని సేవిస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు.