Ramphal | సీతాఫలం.. ఇదొక్కటే తెలుసు.. ఈ రామ ఫలం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? సీతాఫలం వంటిదే రామ ఫలం. పేరుకు తగినట్లుగానే ఈ ఫలం మన ఆరోగ్యానికి శ్రీరామరక్షగా ఉంటుంది. ఈ ఫలంలో ఎన్నో ఔషధగుణాలు ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి. వీటినే ఇండియన్ చెర్రీ అని కూడా పిలుస్తుంటారు. ఈ పండ్లు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండి జామ్‌లు, జెల్లీలు, ఇతర తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు.
రామఫలంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. మలేరియా, క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నివారించే శక్తి కూడా ఈ పండులో ఉంటాయని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు. వీటి ద్వారా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్, కొవ్వులతో పాటు విటమిన్ బీ1, బీ2, బీ3, బీ5, బీ6, కాల్షియం, సోడియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు మనకు అందుతాయి. రామఫలాలను వివిధ రకాలుగా తిని ఎంజాయ్ చేయవచ్చు. వీటి ఆకులను టీ తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.