Chia Seeds | ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం చాలా మంది విస్మరిస్తున్నారు. అలాంటి వాటిల్లో చియా విత్తనాలు కూడా ఒకటి. ఇవి చూసేందుకు అచ్చం సబ్జా గింజల్లాగే ఉంటాయి. కానీ కాస్త తేడా ఉంటుంది. చియా విత్తనాలు అద్భుతమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటిని సూపర్ ఫుడ్‌గా కూడా చెబుతుంటారు. చియా విత్తనాలను తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మినరల్స్ వీటిల్లో అదికంగా ఉంటాయి. చియా విత్తనాల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ విత్తనాలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కనుక అధికంగా బరువు ఉన్నవారు రోజూ చియా విత్తనాలను తింటుంటే ఫలితం ఉంటుంది.
చియా విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి వృక్ష సంబంధమైనవి. అలాగే ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ (ALA) కూడా ఉంటుంది. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. కనుక శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా గుండె కండరాలు, రక్త నాళాలు వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. చియా విత్తనాల్లో 14 శాతం మేర ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. దీని వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి.
చియా విత్తనాల్లో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటిల్లో ఉండే మెగ్నిషియం నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. చియా విత్తనాల్లోని ఫాస్ఫరస్ సైతం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర మెటబాలిజం మెరుగు పడేలా చేస్తుంది. ఈ విత్తనాల్లోని ఐరన్ వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా క్వర్సెటిన్, కెఫియిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్లు అధిక మొత్తాల్లో ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
చియా విత్తనాలను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా తేలిక అని చెప్పవచ్చు. మీరు రోజూ తాగే పానీయాలు లేదా తినే ఆహారాల్లో వీటిని కలిపి తినవచ్చు. చియా విత్తనాలను రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తినాలి. ఈ విత్తనాలను తినడం ప్రారంభించే వారు ముందుగా కొన్ని సీడ్స్‌తో మొదలు పెట్టాలి. తరువాత నెమ్మదిగా పరిమాణాన్ని పెంచుతూ పోవాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఈ విత్తనాలను సులభంగా జీర్ణం చేస్తుంది. ఈ విత్తనాల్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల వీటిని కొద్ది కొద్దిగా తింటుంటే నెమ్మదిగా వీటికి శరీరం అలవాటు పడుతుంది. దీంతో రోజూ ఈ విత్తనాలను చాలా తేలిగ్గా తినవచ్చు. చియా విత్తనాలను కచ్చితంగా నానబెట్టి తినాలి. దీని వల్ల జెల్లాగా మారుతాయి. నానబెట్టకుండా తింటే కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చియా విత్తనాలను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.