Brain Foods For Kids | ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఎంతటి తీవ్రమైన పోటీ నెలకొందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా విద్య, ఉద్యోగ రంగాల్లో కొన్ని కోట్ల మంది ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ప్రతి ఒక్కరికి అద్భుతమైన నైపుణ్యాలు ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. స్కిల్స్ ఉంటే కానీ ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకు రాలేకపోతున్నారు. అయితే ఒక మనిషికి స్కిల్స్ ఉండాలంటే అప్పటికప్పుడు అభివృద్ది చెందడం కష్టం. వాటిని చిన్నప్పటి నుంచే వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ విషయంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి స్కిల్‌ను అయినా సులభంగా నేర్చుకోవాలన్నా, అందరిలోనూ సులభంగా నెగ్గాలన్నా వారికి తెలివితేటలు వృద్ధి చెందేలా చూడాలి. అందుకు గాను పలు ఆహారాలు ఎంతో దోహదం చేస్తాయి. పిల్లలకు తల్లిదండ్రులు ఆ వయస్సు నుంచే రోజూ పలు ఆహారాలను పెడుతుండాలి. దీని వల్ల వారిలో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చెంది తెలివితేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. పెద్దయ్యాక కూడా అన్నింట్లోనూ, అందరికన్నా ముందే ఉంటారు.
పిల్లల మెదడు అభివృద్ధి చెందేలా చూడడంలో చేపలు ఎంతో దోహదం చేస్తాయి. చేపలను వారికి తరచూ పెట్టడం వల్ల వారి మెదడు వికసిస్తుంది. తెలివితేటలు వృద్ధి చెందుతాయి. పిల్లల మెదడుకు పదును పెట్టేందుకు చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా మంచినీటి లేదా సముద్రపు చేపలను వారికి తినిపించాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు పనితీరును మెరుగు పరచడంలో ఎంతో సహాయం చేస్తాయి. దీని వల్ల వారి మెదడు యాక్టివ్‌గా మారి ఉత్సాహంగా ఉంటారు. అన్నింట్లోనూ తెలివితేటలను కనబరుస్తారు. అలాగే పెద్దయ్యాక కూడా మిక్కిలి ప్రతిభావంతులుగా మారుతారు. ఇక పిల్లల తెలివితేటలు పెరగాలంటే వారికి రోజూ ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి తినిపించినా ఎంతో మేలు జరుగుతుంది. కోడిగుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కోలిన్, లుటీన్, జింక్ వంటి పోషకాలు గుడ్లలో ఉంటాయి. ఇవి పిల్లల్లో యాక్టివ్‌నెస్‌ను పెంచుతాయి. బద్దకం పోయేలా చేస్తాయి. దీంతో వారి మెదడు వికసిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుతోపాటు ఇతర అంశాల్లోనూ రాణిస్తారు. పెద్దయ్యాక ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
పిల్లల మెదడు అభివృద్ధికి పెరుగు సైతం దోహదం చేస్తుంది. పెరుగును రోజూ వారికి తినిపించాలి. ఇది మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల మెదడుకు అలర్ట్‌నెస్ పెరుగుతుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి చిన్నారులు ఏ విషయాన్నయినా ఇట్టే నేర్చుకుంటారు. అలాగే చిన్నారులకు పాలకూర, అరటికాయలు, బ్రోకలీ, ఆకుకూరలు వంటి వాటిని కూడా పెడుతుండాలి. ముఖ్యంగా టమాటాలు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీల వంటి వాటిని వారికి తినిపిస్తుండాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా మారి వారు చదువుల్లో రాణిస్తారు. ఇక పిల్లల ఆరోగ్యం కోసం తృణ ధాన్యాలను కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా వంటి ఆహారాలను పెడుతుంటే వారికి నిరంతరం శక్తి లభిస్తుంది. దీని కారణంగా వారు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. నీరసం, అలసట రావు. బద్దకం పోతుంది. వారు అన్నింట్లోనూ చురుగ్గా ఉంటారు. ప్రతిభ కనబరుస్తారు.
పిల్లల మెదడు ఆరోగ్యానికి విటమిన్ ఇ కూడా దోహదం చేస్తుంది. ఇది ఎక్కువగా బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి వాటిల్లో లభిస్తుంది. కనుక వీటిని పిల్లలకు పెడుతుంటే ఉపయోగం ఉంటుంది. అయితే వీటిని నేరుగా తినిపించకూడదు. నీటిలో నానబెట్టి తినిపించాలి. లేదంటే ఇవి పిల్లల్లో వికారం, వాంతులను కలగజేసే అవకాశం ఉంటుంది. అయితే న్యూట్రిషనిస్టు లేదా డాక్టర్‌ను కలిసి వీటిని పిల్లలకు తినిపిస్తే మంచిది. ఎందుకంటే కొందరికి పలు ఆహారాల వల్ల అలర్జీలు సంభవించే ప్రమాదం ఉంటుంది. కనుక మీ పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పడతాయి అనే విషయాన్ని తెలుసుకుని ఆ ప్రకారం వారికి ఆహారాలను పెడితే దీంతో వారి మెదడు యాక్టివ్‌గా మారి వారి తెలివితేటలు పెరుగుతాయి. దీని వల్ల వారు అన్నింట్లోనూ రాణిస్తారు.