Stomach Pain | కడుపు నొప్పి అనేది సాధారణ సమస్యే. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని సార్లు పొట్టలో అసౌకర్యం ఏర్పడి నొప్పికి దారి తీస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటివి కడుపు నొప్పిని కలగజేస్తాయి. కొన్ని సార్లు అజీర్తి వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోతే పొట్టలో గ్యాస్ తయారై కడుపు నొప్పిని సృష్టిస్తుంది. ఇక కొన్ని సార్లు ఫుడ్ పాయిజనింగ్ అవడం, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, కొన్ని రకాల మందులను వాడడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. ఇది సాధారణ సమస్యే. కనుక దీనికి ఇంగ్లిష్ మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. పలు ఇంటి చిట్కాలను పాటిస్తూ పలు ఆహారాలను తీసుకుంటుంటే ఈ సమస్య సులభంగా తగ్గిపోతుంది. అలాగే జీర్ణ సమస్యల నుంచి సైతం బయట పడవచ్చు.
కడుపు నొప్పిని తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి. అనంతరం నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. రుచి కోసం అందులో కాస్త తేనెను కలుపుకోవచ్చు. అలాగే పూటకు ఒకసారి ఒక టీస్పూన్ చొప్పున అల్లం రసాన్ని భోజనానికి ముందు రోజుకు మూడు పూటలా తాగాలి. ఇలా చేస్తున్నా కూడా కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కడుపు నొప్పిని తగ్గించి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పుదీనా ఆకులు కూడా ఈ సమస్య నుంచి బయట పడేలా చేస్తాయి. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నేరుగా అలాగే తినేయాలి. లేదా ఆ ఆకులను నీటిలో వేసి మరిగించి అనంతరం ఆ నీళ్లను అయినా తాగవచ్చు. లేదా పుదీనా ఆకుల నుంచి రసం తీసి కూడా తాగవచ్చు. ఇలా చేస్తున్నా కూడా ఎంతగానో ఉపశమనం లభిస్తుంది.
కడుపు నొప్పి సమస్య ఉన్నవారు నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమాన్ని ప్రయత్నించాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో అర టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి తాగాలి. దీని వల్ల పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క పొడి కూడా ఈ సమస్యకు బాగానే పనిచేస్తుంది. ఇందుకు గాను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తాగాలి. లేదా దాల్చిన చెక్కను వేసి మరిగించిన నీళ్లను అయినా తాగవచ్చు. దీంతో ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి అన్ని రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.
భోజనం చేసిన అనంతరం ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. లవంగాల నుంచి వచ్చే రసాన్ని మింగాల్సి ఉంటుంది. దీని వల్ల కూడా సమస్య తగ్గుతుంది. అలాగే జీలకర్రను నీటిలో వేసి మరిగించి అనంతరం ఆ నీళ్లను వడకట్టి తాగుతుండాలి. ఈ చిట్కా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల గ్యాస్, అజీర్తి తగ్గుతాయి. వాటి కారణంగా వచ్చిన కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా అంజీర్ పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కడుపు నొప్పిని తగ్గించేందుకు సహాయం చేస్తుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కలబంద గుజ్జును తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తుంటే కడుపు నొప్పి నుంచి సులభంగా బయట పడవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.