Acid Reflux | యాసిడ్ రిఫ్లక్స్ ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సాధారణ జీర్ణ సంబంధిత సమస్య. కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి పైకి రావడం వల్ల ఛాతీలో మంట, గొంతు వరకు మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ప్రాణాపాయం కలిగించే వ్యాధి కాకపోయినా, తరచూ వస్తే రోజువారీ జీవన నాణ్యతపై ప్రభావం చూపుతుంది. మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో కూడా ఈ సమస్యను చాలావరకు నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడేవారు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా పడుకోవడం వల్ల కడుపులోని ఆమ్లం త్వరగా కిందకు వెళ్లేందుకు సహాయపడటమే కాకుండా, అన్నవాహికలో ఆమ్లం ఉండే సమయం కూడా తగ్గుతుంది. దీంతో రాత్రివేళల్లో మంట సమస్య కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం యాసిడ్ రిఫ్లక్స్‌ను మరింత పెంచుతుంది. అందుకే నిద్రపోయే సమయానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సమయం లభిస్తుంది. దీంతో రాత్రివేళల్లో కడుపులోని ఆమ్లం పైకి వచ్చే అవకాశం తగ్గుతుంది. పడుకునేటప్పుడు తల భాగాన్ని ఆరు నుంచి ఎనిమిది అంగుళాల ఎత్తులో ఉండేలా మంచాన్ని ఏర్పాటు చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కేవలం దిండును ఎత్తుగా పెట్టడం కంటే మంచం తల భాగాన్ని కొద్దిగా పైకి ఎత్తితే గురుత్వాకర్షణ ప్రభావంతో ఆమ్లం పైకి రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల్లో దీనివల్ల రాత్రివేళ యాసిడ్ రిఫ్లక్స్ సమస్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు.
యాసిడ్ రిఫ్లక్స్‌కు కేవలం కారంగా ఉండే ఆహారాలే కారణమనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అధిక చక్కెర కలిగిన ఆహారాలే ఈ సమస్యను ఎక్కువగా పెంచే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అలాంటి ఆహారాల వినియోగాన్ని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత కనీసం పది నిమిషాల పాటు నడవడం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రాత్రి భోజనం అనంతరం కొద్దిసేపు నడవడం వల్ల కడుపులోని ఆహారం సులభంగా జీర్ణమై, యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. భోజనం అనంతరం పుదీనా రుచి లేని షుగర్-ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తరచూ మింగడం ద్వారా అన్నవాహికలోకి వచ్చిన ఆమ్లం త్వరగా కడుపులోకి వెళ్లేందుకు సహాయపడుతుంది. అయితే పుదీనా రుచి ఉన్న గమ్‌లను మాత్రం ఉపయోగించవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే అవి కడుపు ఆమ్లం పైకి రాకుండా అడ్డుకునే కండరాన్ని సడలించే అవకాశం ఉండటంతో సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.