Fiber Foods | ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వినియోగం పెరుగుతున్న వేళ శరీరానికి అవసరమైన ఫైబర్ లోపం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో ఇప్పుడు ఫైబర్ కలిపిన స్నాక్స్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫైబర్ నిజంగా ఆరోగ్యానికి ఉపయోగకరమా? లేక కేవలం మార్కెటింగ్ కోసమేనా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు ఫైబర్ ఫోర్టిఫైడ్ స్నాక్స్‌పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ బ్లూబెర్రీ వంటి సహజ ఆహారం నుంచి వచ్చినా, ఫైబర్ కలిపిన స్నాక్స్ నుంచి వచ్చినా పేగుల్లోని మంచి బ్యాక్టీరియా దాన్ని దాదాపు ఒకే విధంగా గుర్తిస్తాయి. ఈ ఫైబర్ పేగుల్లో ఫెర్మెంటేషన్‌కు గురై షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజుకు అవసరమైన 30 గ్రాముల ఫైబర్‌ను తీసుకోలేని వారికి ఈ ఫైబర్ కలిగిన స్నాక్స్ కొంత మేర ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే సహజ ఆహారాల్లో లభించే ఫైబర్‌కు, ఫోర్టిఫైడ్ స్నాక్స్‌లో కలిపే ఫైబర్‌కు కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు పండ్లు లేదా బెర్రీలు తింటే కేవలం ఒక రకం ఫైబర్ మాత్రమే కాదు, పెక్టిన్, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, రెసిస్టెంట్ స్టార్చ్ వంటి అనేక రకాల ఫైబర్లు శరీరానికి అందుతాయి. వీటిలో ప్రతి ఒక్కటి వేర్వేరు విధుల్లో పనిచేస్తుంది. అంతేకాదు సహజ ఆహారాల్లో ఫైబర్‌తో పాటు పాలీఫినాల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి. ఇవన్నీ కలిసి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమిష్టిగా పనిచేస్తాయి. కానీ ఫైబర్ కలిపిన స్నాక్స్ ఈ సహజ సమ్మేళనాన్ని పూర్తిగా అందించలేవని నిపుణులు చెబుతున్నారు. స్నాక్స్ తయారీదారులు ఖర్చు, రుచి, నిల్వ సామర్థ్యం, వేడి తట్టుకునే గుణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పరిమిత రకాల ఫైబర్లనే ఉపయోగిస్తారని వివరించారు. అందుకే మార్కెట్లో లభించే చాలా ఫైబర్ స్నాక్స్‌లో ఇన్యూలిన్ అనే ఫైబర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చికోరి వేర్ల నుంచి తీసుకునే ఫైబర్. ఇది తక్కువ ఖర్చుతో లభించడం, రుచి లేకపోవడం, వేడి తట్టుకోవడం వంటి కారణాలతో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ఇన్యూలిన్ అత్యుత్తమ ఫైబర్ కాకపోయినా కొంతమేర ప్రయోజనం అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఫైబర్ లోపాన్ని తగ్గించడంలో ఈ స్నాక్స్ ఉపయోగపడవచ్చని, కానీ ఇవి సహజ ఆహారాలకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కావని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పండ్లు, కూరగాయలు, గింజలు, సంపూర్ణ ధాన్యాలు వంటి సహజ ఫైబర్ వనరులను ఆహారంలో తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అయితే ఫైబర్ లోపాన్ని కొంతవరకు భర్తీ చేయడంలో ఫైబర్ ఫోర్టిఫైడ్ స్నాక్స్ కూడా సహాయకరంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.