వయసు పెరిగేకొద్దీ అనుభవం ఇనుమడిస్తుంది. కానీ, శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కండ్ల కింద క్యారీ బ్యాగులు వస్తాయని కొందరికి భయం. బుగ్గలు జారిపోతాయని ఇంకొందరిలో అనుమానం! జుట్టు నెరిసిపోతుందని కంగారు పడుతుంటారు మరికొందరు. పెరిగిన వయసు కనిపించకుండా మేకప్‌ను నమ్ముకుంటుంటారు. అయితే, సరైన డైట్ ఫాలో అయితే… వయసుతో వచ్చే శారీరక మార్పులను కొంతవరకు నియంత్రించవచ్చు. యవ్వనాన్ని మరికొంత కాలం కాపాడుకోవచ్చు.
బ్లూబెర్రీలు యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం నిగారించేలా చేస్తాయి. శారీక మార్పులను అధిగమించేందుకు దోహదపడతాయి.
చిలగడదుంప, క్యారెట్, గుమ్మడికాయల్లో బీటా- కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి వయసు కారణంగా శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. చర్మాన్ని పట్టులా ఉంచుతాయి. కండ్లలో కాంతి తగ్గకుండా చూస్తాయి.
ఆకుకూరలు రెగ్యులర్‌గా తినడం వల్ల ముఖవర్చస్సు తగ్గకుండా ఉంటుంది.
కీరదోస కూడా యాంటీ ఏజింగ్ ఫుడ్. ఇందులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.
ప్రతిరోజూ పాలలో గుప్పెడు బాదం నానబెట్టుకొని తింటే… యవ్వనం నిత్య నూతనంగా మారుతుంది.
విటమిన్ -సి అధికంగా ఉండే బ్రకోలీ తింటే చర్మంపై ముడతలు మాయమవుతాయి. చర్మం పొడిబారే సమస్య దరిచేరదు.
యాంటీ-ఏజింగ్‌కు సాల్మన్ చేపలు బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.