Jeera Ajwain Water | జీలకర్ర, వాము.. మన వంటింట్లో ఉండే మసాలా దినుసులు. వీటిని మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. పోపు దినుసులుగానే కాక మసాలా కూరల్లో వేసేందుకు కూడా వీటిని వాడుతుంటాం. అలాగే తినుబండారాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. ఇవి ఘాటుగా ఉంటాయి కనుక వీటిని నేరుగా తినేందుకు అంతగా ఇష్టపడరు. అయితే ఈ రెండింటితో నీటిని తయారు చేసి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. జీలకర్ర, వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కనుక ఈ రెండింటినీ నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ ఉదయాన్నే పరగడుపునే ఈ నీళ్లను తాగితే అనేక లాభాలను పొందవచ్చు.
జీలకర్ర, వాము నీళ్లను సేవించడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా సురక్షితంగా ఉంటారు. ఈ నీళ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను తాగితే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వాపులు కూడా తగ్గిపోతాయి. మహిళలు కొందరికి పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంటుంది. అయితే అలాంటి వారు జీలకర్ర, వాము వేసి తయారు చేసిన నీళ్లను సేవించాలి. ఈ నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ స్పాస్మోడిక్ గుణాలు కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ నీళ్లను తాగితే మెటబాలిజం మెరుగు పడుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లను తాగితే జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర, వాము నీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా అనేక మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చుండ్రును నిర్మూలిస్తాయి. అలాగే మొటిమలు, ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు.
గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారు ఈ నీళ్లను తాగుతుంటే తప్పక ఉపశమనం లభిస్తుంది. పొట్టలోని అసౌకర్యం కూడా తొలగిపోతుంది. ఈ నీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉంటుంది. జీలకర్ర, వాము నీటిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో దగ్గు. జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా జీలకర్ర, వామును నీటిలో కలిపి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.