Garlic Tea | వెల్లుల్లిపాయలను మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. వీటి వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లి వంటకాలకు రుచిని అందించడమే కాదు, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అందుకనే రోజూ ఉదయం 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినాలని చెబుతుంటారు. అయితే వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కనుక దాన్ని తినడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి మరిగించి డికాషన్‌లా తయారు చేసి తాగవచ్చు. ఇందులోనే అవసరం అనుకుంటే రుచి కోసం కాస్త తేనె కలిపి తాగవచ్చు. ఈ వెల్లుల్లి రెబ్బల టీని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగాలి. దీన్ని తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. మనకు కలిగే పలు వ్యాధులను నయం చేయడంలో వెల్లుల్లి ఎంతగానో పనిచేస్తుంది.
వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనంతోపాటు సల్ఫర్ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక వెల్లుల్లి టీని తాగితే ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. వెల్లుల్లి టీని తాగడం వల్ల రక్త నాళాలపై పడే ఒత్తిడి తగ్గుతుంది. రక్త నాళాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ టీని సేవిస్తే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. వెల్లుల్లి టీని తాగితే జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో సహజసిద్ధమైన ఎక్స్పెక్టోరెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి టీని సేవిస్తే ఛాతి, గొంతు, ముక్కులో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి టీని రోజూ సేవిస్తుంటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వెల్లుల్లి టీని తాగడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం మెరుగ్గా గ్రహిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. వెల్లుల్లి టీని తాగుతుంటే కిడ్నీలు, ఇతర అవయవాలు శుభ్రమవుతాయి. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. అయితే వెల్లుల్లి ఆరోగ్యకరమే అయినప్పటికీ కొందరికి దీన్ని తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే అలర్జీలు ఉన్నవారు కూడా వెల్లుల్లికి దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా వెల్లుల్లి టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.