Ajwain Water | వాము గింజలను మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇవి ఉంటాయి. ఇవి ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. కానీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాము గింజలను నేరుగా తినలేరు. కానీ వీటితో నీళ్లను తయారు చేసి తాగవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని కొన్ని వాము గింజలను అందులో వేసి మరిగించి అనంతరం వచ్చే నీళ్లను వడకట్టి తాగవచ్చు. లేదా రాత్రి పూట వాము గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను పరగడుపునే తాగవచ్చు. అతిగా భోజనం చేసినప్పుడు ఈ నీళ్లను తాగితే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. వాము నీళ్లలో బ్లాక్ సాల్ట్ లేదా నిమ్మరసం, తేనె వంటివి కలిపి తాగితే ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. వాము నీళ్లను రోజుకు ఒక గ్లాస్ మోతాదులో తాగితే చాలు, అనేక లాభాలను పొందవచ్చు.
వాము నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. వాము సహజసిద్ధమైన డీ కంజెస్టెంట్గా పనిచేస్తుంది. అందువల్ల ఈ నీళ్లను తాగితే ఈ గింజల్లో ఉండే థైమోల్ అనే సమ్మేళనం గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫాన్ని బయటకు పంపిస్తుంది. దీంతో దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆస్తమా ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
వాము గింజల నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరం క్యాలరీలను త్వరగా ఖర్చు చేస్తుంది. దీని వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. వాము గింజల్లో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను సేవిస్తుంటే కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే స్త్రీలు రుతు సమయంలో ఈ నీళ్లను తాగితే అధిక రక్తస్రావం జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము నీళ్లలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు సైతం ఉంటాయి. ఇవి నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
వాము గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను వెడల్పుగా చేసి వాటిల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. వాము గింజలను తింటున్నా, వాటి నీళ్లను తాగుతున్నా ఇలా అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఈ నీళ్లు అందరికీ పడవు. పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఈ నీళ్లను తాగకూడదు. అలాగే గర్భీణీలు ఈ నీళ్లకు దూరంగా ఉండాలి. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడే వారు కూడా ఈ నీళ్లను తాగకూడదు.