హైదరాబాద్: సాధారణంగా చద్దన్నం అంటే ఎక్కుమమంది ఇష్టపడరు. కొందరైతే చద్దన్నం అనే మాట వింటేనే వాక్.. అంటారు. అమ్మో..! చద్దన్నం తినడం నా వల్ల కాదు అని చెబుతారు. కానీ ఒక్కసారి ఆ చద్దన్నం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారంటే ఇకపై చద్దన్నం వద్దు అనే మాట మీ నోట రానే రాదట. రాత్రి మిగిలితే పొద్దున తినడమే కాదు, రాత్రి మిగలేలా వండుకుని మరీ చద్దన్నం చేసుకుని తింటారు.
ఎందుకంటే ఇటీవల అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంతో ఎన్ని రకాల లాభాలుంటాయో అధ్యయనం చేసి మరీ వెల్లడించింది. మరి ఆ లాభాలేంటో మనం కూడా తెలుసుకుందామా..? సాధారణంగా అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చద్దన్నంలో ఆ పోషకాల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుందట. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయట.
అందుకే చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్గా ఉంటుంది. శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది. వేడి కారణంగా శరీరంలో ఉండే దుష్ఫలితాలు తగ్గుతాయి. పీచుదనం పెరిగి మల బద్దకం, నీరసం తగ్గిపోతాయి. రక్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉంటుంది. అలసిపోదు. అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం.
ఈ చద్దన్నం సన్నవాళ్లు లావయ్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు కూడా తోడ్పడుతుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే స్థూలకాయులు క్రమంగా లావు తగ్గుతారు. అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారిసరికే తోడన్నం తయారవుతుంది. సన్నగా ఉన్నవాళ్లు ఈ తోడన్నం తింటే క్రమంగా ఒళ్లు చేస్తారు.
ఈ తోడన్నాన్నిగానీ, చల్లలో నానబెట్టిన అన్నాన్నిగానీ నేరుగా తినబుద్దికాకపోతే వాటికి ఉల్లిముక్కలు, టమాటా, క్యారెట్ లాంటివి కలుపుకుని తాలింపు పెట్టుకుని లాగించొచ్చు. అయితే ఈ చద్దాన్ని ఉదయాన్నే తినాలి. మరింత ఆలస్యం చేస్తే ఎక్కువగా పులిసి అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.