Sesame Seeds Oil | మనం నిత్య జీవితంలో భాగంగా వివిధ రకాల పనులకు అనేక రకాల నూనెలను ఉపయోగిస్తుంటాం. తలకు ఒక నూనె రాస్తే వంటలకు ఒక నూనెను, శరీరానికి మసాజ్ చేసేందుకు ఇంకో నూనెను ఉపయోగిస్తాం. అయితే అన్ని పనులకు ఉపయోగించదగిన నూనె ఒకటుంది. అదే నువ్వుల నూనె. దీన్ని తలకు, శరీరానికి మర్దనా కోసం, వంటలకు కూడా ఉపయోగించవచ్చు. నువ్వుల నూనె అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నువ్వుల నూనె సహజసిద్ధంగా తయారు చేసింది అయి ఉండాలి. అప్పుడు ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. నువ్వుల నూనెను మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు, ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
నువ్వుల నూనెను వాడడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని రక్షిస్తుంది. ఈ నూనెలో అనేక రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యలు తగ్గేలా చేస్తాయి. ఈ నూనెను వాడడం వల్ల చర్మం తేమగా మారి మృదువుగా ఉంటుంది. చర్మం పగలడం తగ్గుతుంది. పొడిబారడం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. నువ్వుల నూనె చిన్నారులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వారి ఆరోగ్యాన్ని ఈ నూనె రక్షిస్తుంది. ఈ నూనెలో ఉండే విటమిన్లు, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉండేలా మారుస్తాయి. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు చేరకుండా చూస్తాయి. దీంతో వారు చిన్న వయస్సులోనే ఊబకాయలుగా మారకుండా ఉంటారు. అధికంగా బరువు పెరగకుండా అడ్డుకోవచ్చు.
చిన్నారులకు కనీసం వారానికి ఒకసారి అయినా సరే శరీరం మొత్తం నువ్వుల నూనెతో మర్దనా చేసి అనంతరం స్నానం చేయించాలి. దీని వల్ల వారికి ఎంతగానో హాయి లభిస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దేహ పుష్టి కలుగుతుంది. వారు రాత్రి పూట చక్కగా నిద్రపోతారు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వారి మెదడు యాక్టివ్గా మారుతుంది. చురుగ్గా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. అలాగే చిన్నారుల వెన్నెముక, కండరాలు బలంగా మారుతాయి. ఇక నువ్వుల నూనెను వాడడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
నువ్వుల నూనెను వాడితే కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెలో ఉండే కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే ఈ నూనెను వాడడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. పేగుల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా నువ్వుల నూనె వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు.