Cycling | ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ శారీరక శ్రమ అసలు చేయని వారు కచ్చితంగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. వ్యాయామం విషయానికి వస్తే మనకు అనేక రకాల ఎక్సర్సైజ్ లు అందుబాటులో ఉన్నాయి. కొందరు వాకింగ్ చేస్తే, కొందరు రన్నింగ్ చేస్తారు. ఇంకొందరు స్విమ్మింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. కొందరు ఎరోబిక్ వ్యాయామాలు చేస్తే, కొందరు యోగా, జిమ్ వంటివి చేస్తారు. అయితే ఈ వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఒకటి. ఇప్పుడంటే చాలా మంది చిన్న పనికి కూడా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు సైకిళ్లను అధికంగా వాడేవారు. కనుకనే వారికి చక్కని వ్యాయామం జరిగి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కనుక మనం కూడా రోజూ కాసేపు సైకిల్ తొక్కడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సైక్లింగ్ చేయడం వల్ల గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. చక్కని కార్డియో ఫిట్ నెస్ సొంతమవుతుంది. గుండె కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో బీపీ తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. సైకిల్‌ను తొక్కడం వల్ల క్యాలరీలను చాలా సులభంగా ఖర్చు చేయవచ్చు. రన్నింగ్ లేదా వాకింగ్ చేయలేని వారు చాలా సులభంగా సైకిల్‌ను తొక్కవచ్చు. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు లేదా బరువు నియంత్రణలో ఉండాలని కోరుకునే వారు రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
రన్నింగ్ లాంటి వ్యాయామాలను హై ఇంపాక్ట్ వ్యాయామం అంటారు. దీని వల్ల శరీరంపై భారం అధికంగా పడుతుంది. కానీ సైకిల్ తొక్కడం అన్నది శరీరంపై చాలా తక్కువ భారం పడేలా చేస్తుంది. మోకాళ్లు, మడమలపై కాస్త ఒత్తిడి మాత్రమే పడుతుంది. కనుక దీన్ని ఎవరైనా సరే సులభంగా చేయవచ్చు. జిమ్ సైకిల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కనుక సాధారణ సైకిల్ తొక్కలేని వారు జిమ్ సైకిల్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటే దాన్ని రోజూ తొక్కుతూ చక్కని వ్యాయామాన్ని పొందవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. గాయాల నుంచి కోలుకుంటున్న వారికి ప్రశాంతత కలుగుతుంది.
సైక్లింగ్ వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా తొడ కండరాల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే పిక్కలు సైతం బలంగా మారుతాయి. శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. నొప్పులు తగ్గిపోతాయి. సైక్లింగ్ వల్ల మానసిక ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మన మూడ్‌ను మారుస్తాయి. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. దీంతో మానసిక ప్రశాంతత లభించి మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సైక్లింగ్ చేయడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ సైతం పటిష్టంగా మారుతుంది. తరచూ రోగాల బారిన పడేవారు సైక్లింగ్ చేస్తే రోగాల నుంచి సురక్షితంగా ఉంటారు. ఇన్ఫెక్షన్లు సైతం తగ్గిపోతాయి. సైక్లింగ్‌ను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయవచ్చు. కానీ ఆరంభంలో కష్టంగా ఉంటుంది కనుక 5 నిమిషాలతో మొదలు పెట్టాలి. క్రమంగా సమయాన్ని పెంచుతూ పోవాలి. దీంతో రోజుకు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కే సామర్థ్యం లభిస్తుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో లాభాలను పొందవచ్చు.