Raw Milk | పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాలను తాగితే అనేక పోషకాలు లభిస్తాయి. దీంతో శరీరానికి పోషణ అందుతుంది. పాలలో ఉండే క్యాల్షియం మన శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ఎముకలు బలంగా మారుతాయి. పాలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే కొందరు పాలను మరిగించకుండానే పచ్చి పాలనే తాగుతుంటారు. వాటిని అలాగే ఉపయోగిస్తారు. ఇలా పాలను మరిగించకుండా తాగడం ప్రమాదం అని, దీంతో డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాలను మరిగించి తాగాలని వారు సూచిస్తున్నారు.
పాలను మరిగించే ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు. సాధారణంగా ఆవు పాలు లేదా గేదె పాలు ఏవైనా సరే పచ్చి పాలలో హానికర బాక్టీరియా ఉంటుంది. కానీ పాలను మరిగిస్తే ఈ బాక్టీరియా నశిస్తుంది. దీంతో అలాంటి పాలు తాగేందుకు సురక్షితమైనవి. కనుక పాలను మరిగించిన తరువాతే తాగాలని సూచిస్తున్నారు. పాలను పచ్చిగా తాగితే పలు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు.
పచ్చి పాలలో హానికర బాక్టీరియా ఉంటుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా, ఇ-.కొలి, కాంపైలోబాక్టర్ అనే బాక్టీరియాలు పచ్చి పాలలో ఉంటాయి. కనుక పచ్చిపాలను తాగితే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయ. ఈ బాక్టీరియా మన శరీరంలోకి చేరితే వికారం, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి. ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నవారిలో, పెద్దల్లో తీవ్రమైన సమస్యలు వస్తాయి. సీడీసీ చెబుతున్న ప్రకారం పచ్చి పాలను తాగడం వల్ల పలు ఆహార సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అంటున్నారు.
పచ్చి పాలలో లిస్టిరియా అనే మరో ప్రమాదకరమైన బాక్టీరియా కూడా ఉంటుంది. ఇది గర్భిణీలపై ప్రభావం చూపిస్తుంది. లిస్టిరియా ఇన్ఫెక్షన్ వల్ల లిస్టిరయోసిస్ అనే వ్యాధి వస్తుంది. దీంతో గర్భిణీలకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లేదంటే ముందుగానే ప్రసవించే అవకాశం కూడా ఉంటుందట. ఇక గర్భిణీలు ఎట్టి పరిస్థితిలోనూ పచ్చి పాలను తాగవద్దని లేదంటో పిండానికి తీవ్ర ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, హెచ్ఐవీ ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు పచ్చిపాలను తాగితే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. వీరిలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కనుక వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక పాలను మరిగించకుండా తాగితే తీవ్రమైన రోగాల బారిన పడి హాస్పిటల్ పాలవుతారని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పచ్చి పాలను తాగడం అంటే అనవసరమైన రిస్క్ తీసుకున్నట్లే అని, చిన్న మొత్తాల్లో కూడా ఈ పాలను తాగకూడదని, లేదంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.