మన భోజనంలో ఉప్పులేని కూరలను ఊహించుకోవడమే కష్టం. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అసలుకే మోసం. అయితే, చాలామంది చిప్స్, వేఫర్స్, క్రాకర్స్, పిజ్జా, పాస్తా, సాస్, నాచోడిప్స్ లాంటి పదార్థాలను ఇష్టంగా తింటుంటారు. ఇందులో అధిక మోతాదులో ఉప్పు, అధిక మోతాదులో సోడియం ఉంటుంది. ఇలాంటి పదార్థాలను రెగ్యులర్‌గా తింటే శరీరంలో నీరు చేరడంతో బరువు పెరుగుతారు. కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులతోపాటు హైబీపీ బారినపడే ప్రమాదం అధికశాతం ఉంటుంది.
రోజులో ఎంత మోతాదులో సోడియం తీసుకోవాలి?
సోడియం అనేది మన శరీరానికి హానికరమేమీ కాదు..మన శరీరానికి కావాల్సిన అత్యవసర ఖనిజం కూడా. ఇది కోడిగుడ్లు, కొన్నిరకాల కూరగాయల్లో ఉంటుంది. సోడియంను పరిమిత మోతాదులో తీసుకున్నప్పుడు కొన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలుకూడా ఉంటాయి. రోజులో రెండు గ్రాంల సోడియం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరంపైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో నీరు, ఖనిజాలను బ్యాలెన్స్ చేస్తుంది. కండరాల పనితీరును, నరాల ప్రేరణలను నిర్వహిస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది.
అధిక మోతాదులో సోడియం తీసుకుంటే?
మెడికల్ న్యూస్ టేడే కథనం ప్రకారం..ఎక్కువ మోతాదులో సోడియం తీసుకుంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ఇది రక్తంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. రక్తప్రవాహంలో నీటిశాతాన్ని పెంచుతుంది. ఫలితంగా రక్త పరిమాణం పెరుగుతుంది. ఇది హైపర్‌టెన్షన్‌కు దారితీయవచ్చు. దీనివల్ల గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, అంధత్వం, స్ట్రోక్‌కు కారణమవుతుంది.
తక్కువ సోడియం తీసుకుంటే కలిగే లాభాలివే?
సోడియం ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యంపాలవుతాం. అదే తక్కువ మోతాదులో తీసుకుంటే అనేక ఆరోగ్యప్రయోజనాలుంటాయి. దీన్నే లో సోడియం డైట్ అంటారు. అందుకే బీపీ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్యులు లో సోడియం డైట్‌ను సూచిస్తారు. ఈ డైట్ పాటించడం వల్ల
రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. దృష్టిని కాపాడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది. కాలేయం దెబ్బతినదు. సిర్రోసిస్ ప్రమాదం తక్కవ. శరీరంలో నీరు చేరకుండా చేస్తుంది.
తక్కువ సోడియం ఉండే పదార్థాలు..
గుడ్లు, కూరగాయల్లో తక్కువ పరిమాణంలో సోడియం ఉంటుంది. అయితే, వీటిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యం ప్రయోజనాలు చేకూరతాయి. లో సోడియం డైట్ పాటించేవారు కొవ్వులేని లేదా తక్కువ కొవ్వు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినాలి. తక్కువ సోడియం ఉండే బ్రెడ్‌ను ఎంచుకోవాలి. తృణధాన్యాలు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, బీన్స్ తీసుకోవాలి.