Beetroot Juice | వృద్ధాప్యంలో అధిక రక్తపోటు అత్యంత సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఇది గుండె జబ్బులు, పక్షవాతం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా మందులు, జీవనశైలి మార్పులు రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, కొన్ని ఆహార పదార్థాలు కూడా అదనపు ప్రయోజనాలు అందించగలవా అనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం బీట్రూట్ జ్యూస్ వృద్ధుల్లో రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని సూచించింది. ఈ పరిశోధనలో మొత్తం 75 మంది పాల్గొన్నారు. వీరిలో కొందరు 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవారు కాగా, మరికొందరు 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఆహారంలో ఉండే నైట్రేట్లు రక్తపోటుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, వయస్సును బట్టి దాని ప్రభావంలో ఎలాంటి తేడాలు ఉంటాయో తెలుసుకోవడం ఈ అధ్యయనం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
పరిశోధనలో భాగంగా పాల్గొన్నవారికి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు నైట్రేట్లతో సమృద్ధిగా ఉండే సాంద్రీకృత బీట్రూట్ జ్యూస్ ఇచ్చారు. మరో రెండు వారాల కాలంలో నైట్రేట్లు తొలగించిన ప్లాసీబో జ్యూస్ అందించారు. ఈ రెండు దశల మధ్య విరామ కాలాన్ని కూడా పాటించారు, తద్వారా ఫలితాల కచ్చితత్వం మెరుగుపడింది. అధ్యయన ఫలితాల ప్రకారం నైట్రేట్లు అధికంగా ఉన్న బీట్రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో రక్తపోటు స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అయితే యువకుల్లో ఇదే స్థాయిలో మార్పులు కనిపించలేదు. వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోవడం దీనికి ఒక కారణమై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. బీట్రూట్లో సహజసిద్ధంగా నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సడలించి విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ మెరుగుపడి రక్తపోటు స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రాధాన్యత ఇప్పటికే శాస్త్రీయంగా నిర్దారణ అయింది.
ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర అంశం నోటి లోపల ఉండే బ్యాక్టీరియా పాత్ర. మనం తీసుకునే నైట్రేట్లను శరీరం వినియోగించగల రూపంలోకి మార్చడంలో కొన్ని ప్రయోజనకర బ్యాక్టీరియా సహాయపడతాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వృద్ధుల్లో బీట్రూట్ జ్యూస్ ప్రభావం ఎక్కువగా కనిపించి ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
పరిశోధనలో బీట్రూట్ జ్యూస్ తీసుకున్న తర్వాత నోటి మైక్రోబయోమ్‌లో మార్పులు చోటుచేసుకున్నట్లు కూడా గుర్తించారు. కొన్ని బ్యాక్టీరియా సమూహాల స్థాయిలు తగ్గగా, నైట్రేట్లను సమర్థవంతంగా మార్చడంలో సహాయపడే ప్రయోజనకర బ్యాక్టీరియా పెరిగినట్లు వెల్లడైంది. దీనివల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే బీట్రూట్ జ్యూస్‌ను రక్తపోటు మందులకు ప్రత్యామ్నాయంగా పరిగణించకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అధ్యయనం పరిమిత సంఖ్యలో వ్యక్తులపై మాత్రమే జరిగినందున, మరింత పెద్ద స్థాయి పరిశోధనలు అవసరమని పేర్కొంటున్నారు. అయినప్పటికీ నైట్రేట్లు అధికంగా ఉండే కూరగాయలను ఆహారంలో చేర్చడం ఆరోగ్యకరమైన అలవాటుగా చెబున్నారు. బీట్‌రూట్‌తోపాటు పాలకూర, అరుగులా ఆకులు, కేల్, సెలరీ, సోంపు వంటి కూరగాయల్లో కూడా నైట్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.