Lakshman Phal | ఈ సీజన్లో వచ్చే సీతాఫలాల గురించి అందరికీ తెలిసిందే. ఈ పండ్లను తింటే ఎన్నో లాభాలు పొందవచ్చన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈ పండ్లు ఎంతో తియ్యగా ఉంటాయి. కనుక చాలా మంది వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మీకు తెలుసా..? లక్ష్మణ ఫలం కూడా ఉంటుందని. అవును, దీన్నే సోర్సోప్ లేదా గువానాబనా అని కూడా పిలుస్తారు. లక్ష్మణ ఫలం కూడా తియ్యని రుచిని కలిగి ఉంటుంది. కానీ కాస్త దోరగా ఉన్న పండ్లను తింటే పులుపుగా అనిపిస్తాయి. లక్ష్మణ ఫలం ఎంతో రుచిగా ఉండడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని రోగాల నుంచి రక్షిస్తాయి. లక్ష్మణ ఫలాన్ని ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.
లక్ష్మణ ఫలంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. లక్ష్మణ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది.
లక్ష్మణ ఫలంలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి హృదయ సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గుండె కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. లక్ష్మణ ఫలంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల కారణంగా ఈ పండ్లను తింటే శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల సమస్య నుంచి బయట పడవచ్చు.
లక్ష్మణ ఫలాల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. ఈ పండ్లలో ఉండే పలు సమ్మేళనాలు మన శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయని వారు గుర్తించారు. దీనిపై సైంటిస్టులు ప్రయోగాలు కూడా నిర్వహిస్తున్నారు. అందువల్ల క్యాన్సర్‌కు ఈ పండ్లలోని సమ్మేళనాలను చికిత్సగా కూడా ఉపయోగించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలా లక్ష్మణ ఫలాన్ని తింటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే లక్ష్మణ ఫలాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఔషధంగానే ఉపయోగిస్తారు. దీన్ని తింటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని, వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని, నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ప్రశాంతత లభించి నిద్ర చక్కగా పడుతుందని చాలా మంది ఈ పండ్లను తరచూ తింటుంటారు.