ఒక బిడ్డకు జన్మనిచ్చే శక్తి ఉన్న మహిళ.. నడివయసుకు వచ్చాక శక్తిచాలక అనారోగ్యంతో సావాసం చేస్తుంది. నలభైలో వచ్చే కీళ్ల నొప్పులతో అరవై దాకా బతుకీడుస్తుంది. యాభైలోనే రోగనిరోధక శక్తి ఉడిగిపోయి.. డెబ్బయ్ ఏండ్లు వచ్చేదాకా అవస్థలు పడుతుంది. ఇందుకు ప్రధాన కారణం నడి వయసులో శరీరానికి సరిపడా పోషకాలు అందకపోవడమే! విటమిన్స్, మినరల్స్‌తోపాటు జింక్ కూడా అతివ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో కొన్నిరకాల కీలకచర్యలు జరగడంలో ఈ ఖనిజం దోహదం చేస్తుంది.
మహిళలకు ప్రతిరోజూ 9 మిల్లీగ్రాముల జింక్ అవసరం. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గాయాలను నయం చేస్తుంది. జింక్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు ఇవి. మీ డైట్ చార్ట్‌లో వీటికి చోటిచ్చి… ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.
మాంసాహారం, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. మాంసాహారంతో పోలిస్తే.. శాకాహారంలో జింక్ లభ్యత తక్కువ. అయితే.. బ్రెడ్, చిక్కుళ్లు, కాయధాన్యాలు, పప్పు దినుసులు మొదలైన వాటిలో జింక్ లభిస్తుంది.
గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజల్లో జింక్ అధికంగా లభిస్తుంది. ఈ గింజలను తినడం వల్ల మహిళల జీవక్రియకు అవసరమైన జింక్ అందుతుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. హార్మోన్ స్థాయులు కూడా అదుపులో ఉంటాయి. వీటిని స్నాక్స్ రూపంలో, పెరుగు, సలాడ్స్‌లో కలిపి కూడా తినొచ్చు.
గుడ్డులో దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, విటమిన్లతోపాటు జింక్ కూడా వీటిలో దొరుకుతుంది. ఉడికించిన గుడ్డు గానీ, ఆమ్లెట్ రూపంలో అయినా తినొచ్చు.
డార్క్ చాక్లెట్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. డార్క్ చాక్లెట్ తరచుగా తీసుకుంటే శరీరానికి అవసరమైన జింక్ లభిస్తుంది. 70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకుంటే మంచిది.
జీడిపప్పు, బాదంపప్పు, వాల్నట్స్, పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్‌తోపాటు జింక్ తగిన మోతాదులో ఉంటుంది. ఇది మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పాలు, పెరుగు, జున్ను, వెన్న లాంటి పాల ఉత్పత్తుల్లో జింక్, కాల్షియం లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.