Arthritis Diet | పూర్వం రోజుల్లో కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే కీళ్ల నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్య చాలా మందికి వస్తోంది. దీంతో కీళ్లలో వాపులు ఏర్పడి విపరీతమైన నొప్పి వస్తుంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు డాక్టర్లు సూచించిన మేర చికిత్స తీసుకోవాలి. దీంతోపాటు జీవన విధానంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో నొప్పుల నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది. ఇక కీళ్ల నొప్పులను తగ్గించడంలో మనకు పలు ఆహారాలు అద్భుతంగా ఉపయోగపడుతాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు బలంగా మారుతాయి. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పాలకూర, కొత్తిమీర వంటి ఆకు పచ్చని ఆకుకూరలు లేదా కూరగాయల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. ఇది కీళ్ల వాపులను, నొప్పులను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కీళ్లను రక్షిస్తుంది. అలాగే ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు రక్షించబడతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
సముద్రపు చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల కీళ్లలో కదలికలు సరిగ్గా ఉంటాయి. అక్కడి దృఢత్వం తగ్గుతుంది. దీని వల్ల ఆర్థరైటిస్ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అందువల్ల చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపలను తింటే గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది.
బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీల వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లోని విటమిన్లు, మినరల్స్ వాపులను తగ్గిస్తాయి. బెర్రీ పండ్లలో యాంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి శరరీంలోని వాపులను తగ్గిస్తాయి. అందువల్ల బెర్రీలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. లేదా సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా కూడా తినవచ్చు. దీంతో కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
వాల్ నట్స్, బాదం పప్పు, అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వాల్ నట్స్‌లో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అలాగే అవిసె గింజల్లో లిగ్నన్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి. కనుక రోజూ ఏదైనా నట్స్ లేదా గింజలు, విత్తనాలను గుప్పెడు మోతాదులో తినాలి. దీంతో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. గ్రీన్ టీలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలో వాపులను, నొప్పులను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక గ్రీన్ టీని రోజూ తాగాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 2 కప్పుల గ్రీన్ టీని తాగుతుంటే ఆర్థరైటిస్ నుంచి బయట పడవచ్చు.