బయటకెళ్లినప్పుడు చాలామంది పబ్లిక్ టాయిలెట్స్‌ను వాడేందుకు ఇష్టపడరు. మూత్రం వచ్చినా ఆపుకుంటారు. కొంతమంది నిద్రలో మూత్రం వస్తే లేచేందుకు బద్ధకిస్తారు. అలానే పడుకుంటారు. మూత్రాన్ని ఆపుకొని ఆపుకొని ఒక్కసారిగా వెళ్తుంటారు. ఇలాంటివారికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. మీరు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి అనేది వ్యక్తికి, వ్యక్తికి మారుతూ ఉంటుందని చెప్పారు. ఇది మీరు ఎంత మోతాదులో నీళ్లు తాగారు? మీ మూత్రాశయ నియంత్రణ ఎంత బలంగా ఉంది? అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు. పబ్లిక్ టాయ్‌లెట్స్‌లో మూత్రవిసర్జన చేయడం ఆరోగ్యకరమే అయినప్పటికీ మూత్రం ఆపుకోవడం మాత్రం శరీరానికి చాలా చేటు చేస్తుందని చెబుతున్నారు. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే ఐదు దుష్ప్రభావాలను వివరించారు.
1. కిడ్నీ స్టోన్స్
మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు కాల్షియం సమ్మేళనాలుగా మారడంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. రాళ్లు చాలా పెద్దవిగా మారితే శస్త్రచికిత్స అవసరపడుతుంది. కిడ్నీ స్టోన్స్వల్ల ఇన్ఫెక్షన్తోపాటు మూత్రంలో రక్తంపడుతుంది. తక్కువ నీళ్లు తాగడం, మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి.
2. యూరిన్ ఇన్ఫెక్షన్
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బాక్టీరియా సహజంగా మూత్ర నాళంలో ఉంటుంది. మూత్రంతో విసర్జించబడుతుంది. మూత్రాన్ని ఆపుకున్నప్పుడు మూత్రాశయంలోనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. మూత్ర నాళంలో ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. యూటీఐలు చాలా బాధాకరమైనవి. ఈ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశముంది.
3. బ్లాడర్ పగిలిపోవచ్చు..
బ్లాడర్ పగిలిపోవడం అనేది చాలా అరుదు. కానీ మూత్రాన్ని ఎక్కువ కాలంపాటు ఆపుకుంటే మూత్రాశయం పగిలిపోవచ్చు. మూత్రాశయం పగిలితే ఉదరం నిండా మూత్రం చేరిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ సమయంపాటు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో సాగుదలతోపాటు మూత్రాశయం బలహీనపడుతుంది.
4. నొప్పి కలుగుతుంది..
మూత్ర విసర్జన చేయాలనే కోరిక ఒక సాధారణ అనుభూతి. కానీ మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం నొప్పికి కారణమవుతుంది. ఎందుకంటే కండరాలు ఓవర్‌టైమ్‌లో పనిచేయాలి. మూత్రాన్నిఆపాలంటే కండరాలు బిగుతుగా మారిపోవాలి. మూత్రాశయం నిండినప్పుడు అది దానిని సాగదీస్తుంది. మూత్ర విసర్జన చేసినప్పుడు దాని అసలు ఆకృతికి తిరిగి వస్తుంది. మూత్రాన్ని ఆపుకుంటూ నిరంతరం మూత్రాశయాన్ని సాగదీయడం వల్ల చివరికి అది యధాస్థానానికి రాదు. దీంతో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
5. మూత్రం ఆపుకోలేని స్థితి..
ఎక్కువ సమయం పాటు మూత్రాన్ని ఆపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి. ఇది మూత్రం ఆపుకోలేని స్థితికి దారితీస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీయొచ్చు.