ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ‘రామజ్యోతి’ వెలిగించి దీపావళిని జరుపనున్నారు. సాయంత్రం 10 లక్షల దీపాలతో అయోధ్య వెలిగిపోతుంది. ఇళ్లు, దుకాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ‘రామజ్యోతి’ వెలుగనున్నది. సరయూ నది ఒడ్డున దీపాలతో కాంతులీననున్నది.
ఎన్నో శతాబ్దాల కల సాకారం కాబోతున్నది. జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరంలో స్వామివారి సాక్షాత్కరం కాబోతున్నది. మరికొద్ది గంటల్లో జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరుగనున్నది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి ‘మంగళ ధ్వని’తో మొదలవుతుంది. దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు.
ప్రాణ ప్రతిష్ఠకు దేశ విదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. రాత్రి 10.30 గంటలకు రామజన్మభూమి కాంప్లెక్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం జారీ చేసే అడ్మిట్ కార్డు ద్వారానే ఎంట్రీ ఉంటుంది.
సోమవారం మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజీత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు.
కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు. అభిజిత్ ముహూర్తం, ఇంద్రయోగం, మృగశిర నక్షత్రం, మేష లగ్నం, వృశ్చిక నవాంశలలో పౌషమాస ద్వాదశి తిథి (22 జనవరి 2024)న జరుగుతుంది.
శుభ ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 32 సెకన్ల వరకు ఉంటుంది. అంటే ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం 84 సెకన్లు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ్‌లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన చేయనున్నారు.
కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు. 150కిపైగా సంప్రదాయాలు, 50కిపైగా గిరిజన, తీర, ద్వీపం, తదితర సంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖులు హాజరుకానున్నారు.
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తవుతుందని వెల్లడించారు.