సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కాదని అన్నారు మోహన్‌బాబు. కొన్ని వేల మంది ఆశలు, కుటుంబాలు, జీవితాలతో ముడిపడినదని తెలిపారు. సినిమా టికెట్ల రేట్ల వివాదంపై ఆదివారం మోహన్‌బాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదలచేశారు. ‘మనకెందుకు అని మౌనంగా ఉండాలా..నా మౌనం చేతకానితనం కాదు. చేవలేనితనం కాదు. అందరి జీవితాలతో ముడిపడిన సినిమా ఇండస్ట్రీ గురించి, మనకున్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు, పరిష్కారాలతో పాటు ఏది చేస్తే సినీ పరిశ్రమకు మనుగడ ఉంటుందో చర్చించుకోవాలి. సినీ పరిశ్రమలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. అందరూ సమానమే. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకొని ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్లి సమస్యల్ని వివరిస్తే మనకు ఇన్ని కష్టాలు వచ్చుండేవికాదు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ ఆడాలి. వాటికి సరైన ధరలు ఉండాలి. సినిమా పరిశ్రమలో ఇరవై నాలుగు క్రాఫ్టులున్నాయి. అందరికి దేవుళ్లు నిర్మాతలే. కానీ ఈ రోజు నిర్మాతలు ఏమయ్యారు? ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎందుకు మౌనం వహిస్తుందో అర్థంకావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది. రండి అందరం కలిసి సినిమాను బతికిద్దాం’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.