దేశాన్ని కాపాడుతున్నది యువతనే!
ప్రపంచంలో ముడి చమురు ధర 114.22 డాలర్లకు, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.94.93 చేరుకున్నది.
స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు ఆగడం లేదు. లక్షల కోట్ల సంపద ఆవిరి అవుతున్నది. గడిచిన రెండున్నరేండ్ల నుంచి మార్కెట్ తిరోగమన దిశలో పయనిస్తున్నది. దేశంలో అప్రజాస్వామిక విధానాల పట్ల జెన్-జీ యువత ఉద్యమిస్తున్నది. నియంతృత్వం మీద పోరాటం చేసే శక్తులు ఇంకా ఉన్నాయని నిరూపించింది.
దేశంలోని ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు చివరకు మన ఆర్థిక వ్యవస్థను బతికిస్తున్నది కూడా యువతనే. ‘విదేశాల్లో అంట్లు తోమి బతుకుతున్నారు’ అని యువతను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చులకన చేసి మాట్లాడినా, ప్రశ్నిస్తున్న యువతను ‘దిమాగీ నక్సల్స్’ అని ప్రధాని నరేంద్ర మోదీ చిన్నచూపు చూస్తున్నా దేశాన్ని ఆర్థికంగా కుంగిపోకుండా నిలబెడుతున్నది యువతనే.
ప్రపంచంలో ముడి చమురు ధర 114.22 డాలర్లకు, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.94.93 చేరుకున్నది. పులి మీద పుట్రలా ఈ రెండు దెబ్బలు సరిపోవు అని విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రెండేండ్లలోనే రూ.5.5 లక్షల కోట్ల నిధులు మన మార్కెట్ నుంచి తరలించుకు వెళ్లారు. ఈ మూడు దెబ్బలతో మన స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొన్నది. ఈ స్థితి నుంచి దేశాన్ని ఆర్థికంగా రక్షిస్తున్నది యువతనే.
ప్రపంచంలో అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ తమ సంపాదనను ఇండియాకు పంపిస్తున్న యువత వల్ల విదేశీ మారకద్రవ్యం నిలువలు అడుగంటకుండా గౌరవ ప్రదంగా నిలిచాయి. కరోనా తర్వాత మన దేశంలోని యువత ఉద్యోగ భద్రత లేకపోవడం, భవిష్యత్తు కోసం పొదుపు అనే ఆలోచన చేయడం మొదలు పెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా నెలనెలా పెద్ద మొత్తంలో యువత ఇన్వెస్ట్ చేస్తున్నారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎంత వేగంగా నిధులు తీసుకువెళ్తున్నారో అంతే వేగంగా యువత సిప్ ద్వారా ఆ లోటును భర్తీ చేస్తున్నది. దేశవిదేశాల్లోని యువత ఇప్పుడు ఆదుకోకపోయి ఉంటే దేశం మరింతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉండేది. ఇలాంటి యువతకు పాలకులు ‘దిమాగీ నక్సల్స్’ అని పేరు పెట్టినా, అంట్లు తోమడానికి విదేశాలకు వెళ్తారు అని తిట్టినా దేశాన్ని ఇప్పుడు ఆర్థికంగా ఆడుకుంటున్నది వాళ్లే. క్రూడ్ ఆయిల్ దిగుమతి బిల్లు ఏటా 137 బిలియన్ డాలర్లు, అంటే మన రూపాయల్లో రూ.11.5 లక్షల కోట్లు.
విదేశాల్లో పని చేసే భారతీయులు ఏటా పంపే నిధులు 135.46 బిలియన్ డాలర్లు అంటే రూ.11.4 లక్షల కోట్లు. క్రూడ్ ఆయిల్ బిల్లుకు మనం చెల్లించే నిధులు, విదేశాల నుంచి మన మనవాళ్లు పంపే నిధులు దాదాపు సమానంగా ఉన్నాయి. విదేశీ మారకద్రవ్యం విషయంలో విదేశాల్లో పని చేసే మన వాళ్లు దేశానికి ఈ విధంగా అండగా నిలిచారు.
ఇక సిప్ల ద్వారా మన యువత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అదే సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1.81 లక్షల కోట్లు దేశం నుంచి తరలించుకుపోయారు. నిరుడు విదేశీ పెట్టుబడిదారులు తరలించిన దాని కన్నా మన వాళ్లు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసింది దాదాపు రెట్టింపు. అయితే ఇది ఇప్పుడు చాలా వేగంగా రివర్స్ అవుతున్నది. ఈ సెప్టెంబర్‌లో సిప్ల ద్వారా రూ.32,490 కోట్ల పెట్టుబడులు వస్తే అదే నెలలో విదేశీ పెట్టుబడి దారులు రూ.44,013 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ అంతరం చాలా వేగంగా పెరిగే అవకాశం ఉన్నది. సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నది ఎక్కువగా యువతనే. సిప్‌లపై రెండున్నరేండ్ల నుంచి ఎలాంటి లాభం లేదు. పైగా దాదాపు 25 శాతం వరకు నష్టం వచ్చింది. మార్కెట్లో పరిస్థితి ఇలానే ఉంటే క్రమంగా సిప్ల మీద ఆసక్తి తగ్గుతుంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత తొమ్మిదేండ్లలో మన దేశంలో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారో, కేవలం రెండేండ్లలో అంత మొత్తం వెనక్కి తీసుకున్నారు. 2015 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ నాటికి మన మార్కెట్లో 63.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2024 అక్టోబర్ నుంచి 2026 అక్టోబర్ నాటికి 63.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల ముగింపునకు ఇంకా వారం రోజుల గడువు ఉన్నది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల తరలింపు ఆగడం లేదు.
ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పెట్టుబడి పెడతారు అని స్టాక్ మార్కెట్ నిపుణులు ఏడాది క్రితం ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవారు. నిధుల తరలింపు ప్రవాహం ఆగకపోవడంతో ఇక్కడ కాక పోతే ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనేవారి మాటల్లో ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. మన రూపాయల్లో అంటే 2026 అక్టోబర్ నాటికి రూ.5.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఏఐ సెమీ కండక్టర్ రంగాల్లోకి నిధులు తరలి వెళ్తున్నాయని మొదట నిపుణులు అంచనా వేశారు. ఆ దేశాల్లో ఏఐ బుడగ పేలిపోయినప్పటికీ మన దేశం నుంచి నిధుల ప్రవాహం తరలివెళ్లడం ఆగలేదు. అక్కడ ఏఐ ప్రతికూల పరిస్థితుల్లో మన దేశానికి పెట్టుబడులు తరలి రావాలి. కానీ రావడం కాదు. కనీసం మన దేశం నుంచి నిధులు తరలివెళ్లడం కూడా ఆగలేదు.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన దేశం నుంచి నిధులు తరలించుకువెళ్లడం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విచిత్రమైన వాదన చేశారు. మన దేశ మార్కెట్ నుంచి సులభంగా నిధులు తరలించుకు వెళ్లే అవకాశం ఉన్నది కాబట్టి విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు నిధులు తలరిస్తున్నారట.
దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ‘సంపద ఉన్నది కాబట్టి దొంగతనాలు జరుగుతున్నాయి’ అని సమర్థించుకున్నట్టుగా ఉన్నది. దేశంలోకి విదేశీ నిధులు రావడం అంటే దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగడం. నిధులు తరలివెళ్తున్నాయి అంటే ఉపాధి అవకాశాలకు గండి పడుతున్నదని అనే అర్థం. ఈ విషయం పాలకులు గ్రహించాలి. స్టాక్ మార్కెట్లో రక్తపాతాన్ని అడ్డుకోవడానికి, నిధుల తరలింపునకు సరైన కారణాలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే, సమస్య పరిష్కారానికి పూనుకోక పోతే, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడుతుంది.
-బుద్దా మురళి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

