‘సమ్మిట్’ నిష్ఫలం.. ఎందుకంటే!
దేశానికి ప్రపంచం దృష్టిలో ఉండిన గౌరవ ప్రతిష్టలు తగ్గటం కూడా అప్పటి నుంచే మొదలైంది. అదే క్రమం, మోదీ పాలన మొదలైనప్పటి నుంచి మతతత్వ అవలక్షణాన్ని చేర్చుకుని వేగాన్ని పుంజుకున్నది. మరొకవైపు ప్రపంచంలోనూ ఇందుకు సమాంతరమైన మార్పులు కొన్ని చోటుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ నిష్ఫలమనేందుకు నిర్దిష్టమైన కారణాలున్నాయి. ఈ తరహాలో పలు దేశాల ప్రజాస్వామ్య, వామపక్ష మేధావుల సమావేశాలకు నెహ్రూ వంటి నాయకుల కాలంలో ఉండిన విలువ, ప్రభావం, అప్పటి విధానాలనూ, విలువలనూ వదిలేసిన ప్రస్తుత కాంగ్రెస్ కాలంలో ఉండగల అవకాశం ఎంతమాత్రం లేదు. స్వాతంత్య్రోద్యమం, అలీనోద్యమాలు, ప్రగతిశీల విధానాల కారణంగా ప్రపంచం అప్పుడు భారతదేశం వైపు చూసి, ఈ దేశాన్ని తిరోగమన శక్తుల నుంచి కాపాడాలనుకున్నది.
కానీ ఇప్పుడు మోదీ నాయకత్వపు ఇండియాకే కాదు, కాంగ్రెస్‌కు సైతం అటువంటి ప్రతిష్ట లేకుండా పోయింది.పలు దేశాల నుంచి వందమంది వచ్చినంత మాత్రాన సమ్మిట్‌కు విలువ, ప్రభావం ఉంటాయని భావించడం ఆత్మవంచన అవుతుంది. మోదీ ప్రభుత్వ విధానాలు, సంఘ్ పరివార్ సిద్ధాంతాల వలన భారతదేశపు గౌరవం పతనం కావటం సరే. ఇపుడు ఇండియా విలువ ఆర్థిక ప్రయోజనాల కోసం వనరుల కేంద్రంగా, పెద్ద మార్కెట్‌గా, సైనిక వ్యూహాల్లో భాగంగా మాత్రమే. అయితే ఈ పరిణామక్రమం బీజేపీ పాలనకన్నా ముందు కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది.
దేశానికి ప్రపంచం దృష్టిలో ఉండిన గౌరవ ప్రతిష్టలు తగ్గటం కూడా అప్పటి నుంచే మొదలైంది. అదే క్రమం, మోదీ పాలన మొదలైనప్పటి నుంచి మతతత్వ అవలక్షణాన్ని చేర్చుకుని వేగాన్ని పుంజుకున్నది. మరొకవైపు ప్రపంచంలోనూ ఇందుకు సమాంతరమైన మార్పులు కొన్ని చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పటి ప్రగతిశీల సిద్ధాంతాలు, భావజాలాలు, శక్తులు, దేశాలు అంతర్ధానం కావటమో, బలహీనపడటమో కొంతకాలంగా జరుగుతూ వస్తున్నది. అందుకు అనేక కారణాలున్నాయి. అనేక కారణాలున్నాయి. వాటిని చర్చించేందుకు ఇది సందర్భం కాదు. కానీ ఈ ప్రస్తావనలు ఎందుకంటే, ఈ నేపథ్యస్థితి, లేదా విస్తృత చిత్రం అర్థమైతే తప్ప ప్రస్తుతపు భారతదేశం ఏమిటో, వర్తమాన కాంగ్రెస్ పార్టీ ఏమిటో, దాని నాయకత్వం ఏమిటో, దానికి గల విలువేమిటో గ్రహించలేము. దానిని బట్టే సమ్మిట్ విలువ కూడా ఉంటుంది.
ప్రపంచం దృష్టిలో కాంగ్రెస్ అంటే ఒకప్పుడు ఏమిటో పైన చూశాము. అందుకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది ఎమర్జెన్సీ విధింపుతో కాగా, అంతకుమించిన తిరోగమన క్రమం ఆర్థిక సంస్కరణలతో మొదలైంది. యథాతథంగా ఆర్థిక సంస్కరణలు అప్పటి పరిస్థితుల్లో అనివార్యంగా మారటం నిజమే. దేశ ఆర్థిక పరిస్థితులు అనివార్య స్థితిని సృష్టించడంలో కాంగ్రెస్ పాత్ర చాలానే ఉండినప్పటికీ, అప్పటి ప్రపంచ పరిణామాలు మరింత అనివార్యతను కలిగించాయన్నది నిజం. సమస్య అది కాదు. కానీ, జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక శక్తుల ప్రోద్బలంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ధనిక వర్గాల అనుకూల విధానాలను అడ్డూఅదుపు లేకుండా అమలు పరిచాయి. అభివృద్ధి పేరిట వనరులను కొల్లగొట్టేందుకు వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. రైతులను, కార్మికులను నష్టపరిచాయి. ధనిక-పేద తారతమ్యాలు ఎన్నడూ లేనంతగా పెరుగసాగాయి. వెనుకబడిన ప్రాంతాలు మరింతగా అంతర్గత వలసలయ్యాయి. అసంతృప్తిని, ఉద్యమాలను చట్టాలతో, పోలీసు బలగాలతో అణచివేయడం సాగించారు. మానవ హక్కుల వ్యతిరేక చట్టాలూ తెచ్చారు. విశేషమేమంటే, నెహ్రూ విధానాలకు కాలం చెల్లిందని కూడా తామే ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ సమ్మిట్‌లో నెహ్రూ బొమ్మను పెద్దగా చూపడం నవ్వు తెప్పించింది.
నెహ్రూను స్వదేశంలో ఒక పాపాల భైరవునిగా చూపుతూ విదేశాల్లో మాత్రం ఆకాశానికెత్తే ప్రధాని మోదీ వలెనే నెహ్రూ విధానాలకు కాలం చెల్లిందని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రపంచ అభ్యుదయ మేధావుల వద్ద ఆయన పేరును క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయక తప్పకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించిన విషయం. విషాదమేమంటే, ఇప్పటి కాంగ్రెస్ నెహ్రూ కాంగ్రెస్ కాదని వారికి తెలియదనుకోలేము.
కాంగ్రెస్ పరివర్తనా క్రమంపై వ్యాఖ్యానాలు ఎప్పటికప్పుడు వెలువడుతూనే ఉన్నాయి.సమ్మిట్‌లో పాల్గొన్న ఇక్కడి వారిని అట్లుంచితే, బయటి నుంచి వచ్చిన వారు రాజకీయంగా సామ్రాజ్యవాదానికి, ఆధిపత్యవాదానికి వ్యతిరేకులు. ఆర్థికంగా విచ్చలవిడి పెట్టుబడిదారీ వ్యతిరేకులు. సామాజికంగా పౌరస్వేచ్ఛల అణచివేతకు, ఆ విధమైన చట్టాలకు వ్యతిరేకులు. కార్మికుల హక్కుల నియంత్రణకు వ్యతిరేకులు. నెహ్రూ అనంతర కాంగ్రెస్ గానీ, వర్తమానపు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ గానీ ఈ విషయాల్లో ఇంతకాలంగా ఏ వైఖరిని తీసుకున్నట్టు? రాహుల్ ఇంకా స్వయంగా అధికారానికి రాలేదు గానీ, తను 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడు అయినప్పటి నుంచి తమ పార్టీ పదేండ్లపాటు 2014 వరకు అధికారంలో ఉండినప్పుడు అనుసరించిన నెహ్రూ విధానాలేమిటి? 2014లో అధికారం కోల్పోయిన తర్వాత రాహుల్ తమ పార్టీకి మకుటం లేని మహారాజు అయినప్పటి నుంచి ఈ 2026 వరకు 12 ఏండ్లకాలంలో రూపొందించి దేశానికి ప్రకటించిన నిర్దిష్టమైన ప్రగతిశీల నెహ్రూ మార్గపు విధానాలేమిటి? ఇదంతా భారతదేశపు ప్రజలు గానీ, ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులు గానీ గమనించడంలేదా? భారత్ సమ్మిట్ పేరిట ఒక అట్టహాసపు తిరునాళ్లు జరిపితే అన్నీ మరుగున పడిపోతాయా?
ఇటువంటి లోపాలు, పరిపాలనా వైఫల్యాలు, స్వార్థపూరిత విధానాల వల్లనే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతూ దారుణమైన స్థాయికి పతనమైందని, అందువల్ల ఏర్పడిన శూన్యంలోకే బీజేపీ వంటి మితవాద శక్తి తేలికగా ప్రవేశించగలిగిందని తెలియనిది ఎవరికి? సమ్మిట్‌కు హాజరైన భారతీయ మేధావులకు తెలియదా, విదేశాల మేధావులకు తెలియదా? స్వయంగా కాంగ్రెస్ నేతలకు తెలియదా? కాంగ్రెస్‌కు అధికారభంగం ఓట్ చోరీ కన్నాముందే మొదలైంది. మతతత్వం కన్నాముందే మొదలైంది. అందుకు అంకురార్పణ బీజేపీ కన్నా కూడా ముందు వివిధ ఫ్రంట్ల ఆవిర్భావంతో మొదలైంది. పూర్తిగా స్వయంకృతంగా మొదలై నేటికీ కొనసాగుతున్నది. ఆ స్థితి నుంచి బయటపడేందుకు రాహుల్‌గాంధీ చేసింది, చేస్తున్నది శూన్యం. అధికార సాధనకు నినాదాలు, ఎత్తుగడలు తప్ప సరైన వ్యూహాలు అయినా లేవు. తమ వైఫల్యాలకు ఇప్పుడు ఓట్ చోరీ పన్నాగం పులి మీద పుట్ర వలె వచ్చి పడింది. ఆయన తనవైపు నుంచి చేసినవి రెండున్నాయి. ఒకటి, ఇండి కూటమిని తన అసమర్థత, అహంకారం, కుటుంబ ఆధిపత్య ధోరణులతో గందరగోళంగా మార్చడం. రెండు, అధికారం కోసం ఓటర్లకు అబద్ధపు హామీలు వీలైనన్ని ఇవ్వడం. ఇప్పుడు సమ్మిట్‌లో గిగ్ వర్కర్లకు వలె. తానే విడుదల చేసిన డిక్లరేషన్ ప్రకారం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనదీ ఆయన మాట్లాడరు. అదే యువతీ యువకులు విధిలేని పరిస్థితిలో చేసే గిగ్ పనులకు మాత్రం మరొక విడత అబద్ధపు హామీలిస్తారు. తమ మ్యానిఫెస్టోలో నిరుద్యోగుల కోసం ఏమేమి ఉన్నాయో, మూడేండ్ల తర్వాత వాటి పరిస్థితి ఏమిటో ఆయన హైదరాబాద్ రావడానికి ముందు సమీక్షించుకుని ఉండరు. లేదా ఆ పని చేసేందుకు జంకి ఉంటారు. అదే విధంగా ఆరు గ్యారెంటీలు, తక్కిన మ్యానిఫెస్టోమాట. తెలంగాణ రాజధానిలో సమ్మిట్ జరుపుతున్న కాంగ్రెస్‌కు, తనకు ముప్పుగా భావిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రజల తోడ్పాటు అవసరమవుతుంది. ప్రపంచ మేధావుల మద్దతు ఒక్కటే చాలదు. అట్లా చాలుతుందని భావిస్తే పునాదులు లేకుండా భవనం కట్టబూనడం అవుతుంది. ఇటువంటి లోపభూయిష్టమైన ఆలోచనల వల్లనే కాంగ్రెస్‌కు నెహ్రూ కాలం నాటి ప్రజాబలం క్రమంగా లేకుండా పోయింది.
రాహుల్‌గాంధీకి ఆ వంశ నామం తప్ప ఆలోచనా శక్తి, సమర్థత చాలా తక్కువ. అందువల్లనే ఇన్నేండ్లుగా గానీ, ఇప్పుడు గానీ పార్టీని నిర్మాణాత్మకంగా శక్తిమంతం చేయడానికి బదులు ఈ తరహా శుష్కమైన నాటకీయతలపై నమ్మకం పెట్టుకుంటున్నారు. దానికి వందిమాగధులు తోడవుతున్నారు. ఆయన ఒక మూర్తీభవించిన కపటత్వం, అసమర్థత.
అనేక దేశాల నుంచి ప్రగతిశీలురను, వామపక్ష ధోరణులు గల వారిని ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకత్వానికి తమవైపు నుంచి గల ఒక పెద్ద లోటు తట్టినట్టు లేదు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో గల సమస్యల గురించి మాట్లాడి వాదించే ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కాలం నుంచి ఉన్నది. అందుకు భిన్నంగా వర్తమానంలో ఆ పార్టీ ఇరాన్ యుద్ధం, పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్, వెనెజువెలాపై దుర్మార్గం, క్యూబా దిగ్బంధం, సిరియాపై, జోర్డాన్‌పై దాడుల వంటి అంశాలు ప్రపంచాన్ని కుదిపివేస్తున్నా అసలేమైనా మాట్లాడుతున్నదో లేదో కూడా తెలియకుండా ఉన్నది. కాంగ్రెస్ ఒకప్పటి ప్రతిష్ట మసకబారడానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు ఆ ప్రపంచ మేధావులంతా సమావేశమైన చోట కూడా కాంగ్రెస్ అధినాయకుడు తన బాధలను ప్రపంచం బాధ చేయబూనారు తప్ప, ప్రపంచం బాధల గురించి ఏమీ మాట్లాడకపోవడం గమనించదగ్గది. వారంతా ఇంతదూరం రావడానికేమి? ఇటువంటి మేళతాళాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిర్వాహకులు అన్ని ఖర్చులూ పెడుతారు గనుక వీలైనవారు వస్తూనే ఉంటారు. తమ పార్టీని శక్తిమంతం చేసుకోవడం ఎట్లాగో, ప్రత్యర్థిని ఎదుర్కోవడం ఏ విధంగానో రాహుల్ గాంధీకి ఈ సమ్మిట్ తర్వాత కూడా అదనంగా ఏమీ బోధపడి ఉండదు.
ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో గల సమస్యల గురించి మాట్లాడి వాదించే ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కాలం నుంచి ఉన్నది. అందుకు భిన్నంగా వర్తమానంలో ఆ పార్టీ ఇరాన్ యుద్ధం, పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్, వెనిజులాపై దుర్మార్గం, క్యూబా దిగ్బంధం, సిరియాపై, జోర్డాన్‌పై దాడుల వంటి అంశాలు ప్రపంచాన్ని కుదిపివేస్తున్నా అసలేమైనా మాట్లాడుతున్నదో లేదో కూడా తెలియకుండా ఉన్నది. కాంగ్రెస్ ఒకప్పటి ప్రతిష్ట మసకబారడానికి ఇది కూడా ఒక కారణం.
టంకశాల అశోక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

