నేటి సమాజ కల్లోల పరిస్థితికి ప్రధాన కారణం.. వాగ్భూషణం వాచాలతగా మారడమే. సౌమ్యంగా మాట్లాడితే అనేక సమస్యలు సులభ పరిష్కారాలకు నోచుకునేవి. సమాజంలో ఒక స్థాయి కలిగి ఉండే కొందరు వ్యక్తులకే అవకాశం దొరికే సంభాషణం, చర్చల్లో పాల్గొనడం నేడు సాంఘిక మాధ్యమాల్లో వివిధ ప్రచార (ప్రింట్, ఎలక్ట్రానిక్) సాధనాల్లో విస్తృతంగా ప్రచారమై అన్నివర్గాల వారిని నొప్పించి అనేక దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి.
గతంలో వ్యతిరేక ప్రచారాల్లో దూషణ తీవ్రత, దుర్భాష పద ప్రయోగాలు ఉన్మాద, ఉద్రేక ప్రదర్శనలు అతి తక్కువగా ఉండి సమాజ జనుల్లో తక్కువ ప్రభావాన్ని చూపించేవి. నేడు ఈ దుర్భాష వాగ్బాణాలు శృతిమించి ప్రశాంత సమాజాన్ని నిలువునా చీల్చి వైషమ్యాలకు, విపరీత పోకడలకు దారి తీస్తున్నాయి. అన్ని హద్దులను అతిక్రమించి మనుష్యుల మనోదౌర్భల్యాలకు బలై సంస్కారహీన బూతు పదాలు అలవోకగా స్థాయీభేదం లేకుండా పేట్రేగిపోతున్నాయి.
ఏ స్థాయిలో దుర్భాషల పద ప్రయోగం ఉపయోగిస్తే ప్రేక్షకుల్లో, వీక్షకుల్లో స్పందన బలంగా వస్తుందో, అలాంటి పదజాలాన్ని నిర్హేతుకంగా ప్రయోగిస్తూ సమాజంలో కల్లోల పరిస్థితులకు దారితీస్తున్నది. దానికి తగ్గట్టు సమాజ శ్రేయస్సే ప్రాథమిక లక్ష్యమైన పత్రికలు, వివిధ టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాలు, పిచ్చి ఉద్వేగాల పాలైన ప్రజా నాయకుల(వినాయకుల) ప్రేలాపనలను వాడి వివిధ వర్గాల మధ్య కోపాగ్ని రగిలించే ప్రయత్నం చాలా పకడ్బందీగా చేయడం పరమ దుర్మార్గం. తటస్థంగా భావిస్తున్న కొన్ని చానళ్లలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ పేరిట తమ ర్యాంకులను వేగవంతంగా పెంచే ప్రయత్నంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం మరీ దారుణం.
ఆధునిక స్వేచ్ఛా విశృంఖలత విస్తృతమై వైరుధ్యాలను సమాజంలో అన్నివర్గాల మధ్య సృష్టించబూనడం సంస్కారయుత సమాజ వాతావరణంలో సర్వత్రా ఖండనీయం. ఇలాంటి దుష్ట సంస్కృతిని ఎవరు సంస్కరించాలి? ప్రభుత్వాలా? చట్టాలా? సమాజహితైషులా? న్యాయస్థానాలా? ఉన్నత స్థాయిలోని వ్యక్తుల భాషా దౌర్బల్యం అరికట్టేదెవరు? జన సామాన్యానికి వీరిచ్చే సందేశమేమిటి? పరమ సత్యాలను పరమ అబద్ధాలుగా చిత్రీకరించి మాట్లాడుతూ, ప్రకోపంలో ఊగిపోతూ ప్రశాంత జనజీవనాన్ని భగ్నం చేస్తున్నాయి. ఒకనాటి ప్రజా నాయకుల సాత్విక సంభాషణ నేడు పూర్తిగా కనుమరుగైపోయింది. ఒకానొక ఆదర్శవంతమైన సభ్య సంస్కృతి సమాజంలో ప్రతిష్టించే ప్రయత్నంలో విజ్ఞులు, మేధావులు, సమాజ హితైషులు ఈ అనాగరిక సంస్కృతికి చరమగీతం పాడే దిశలో ఒక ఉద్యమానికి తెర తీసి పరిస్థితిని నివారించే ప్రయత్నం జరగాలి. ఏదీ ఎప్పుడూ ఆలస్యం కాదు. ఉత్కృష్ట మానవులు ఆరంభించాలి ‘ఆరంభించరు నీచ మానవులు’ అనే అపప్రథను తొలగించాలి.
– కె.లక్ష్మణ్ గౌడ్ 97949 39509