ఎడమ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, కుడిచేయి చాచి చూపుడు వేలుతో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ మహా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నది. హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తయినది. నాడు తలదించి నడిచిన బడుగు, బలహీన, అణగారిన వర్గాలు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఎదుట తలెత్తి చూసే కలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేయబోతున్నారు.
అంబేద్కర్ విగ్రహంతో తెలంగాణ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరగనున్నాయి. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం.. మరోవైపు తెలంగాణ అమరుల స్మారకచిహ్నం.. అక్కడే ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహం హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారనున్నాయి. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా.. ‘125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామ’ని 2016లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం… యావత్ దేశమే అబ్బురపడే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం.
ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావు లేకుం డా ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించాలని అంబేద్కర్ పరితపించారు. అందులో భాగంగానే సామాజిక, అసమానతల నిర్మూలనకు జీవితాం తం పోరాటం చేశారు. అన్ని వర్గాలకూ సమన్యాయం జరగాలన్న దార్శనికతతో ఆయన రా జ్యాంగాన్ని రూపొందించారు. అంబేద్కర్ రూ పొందించిన రాజ్యాంగం దేశానికే కాదు, ప్రజాస్వామ్య దేశాలకూ ఆదర్శంగా నిలిచింది. రా జ్యాంగం రూపకల్పనతో అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీకగా నిలిచారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3తోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన స్వరాష్ట్రం నెరవేరిం ది. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలన్న అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం సకల జనుల సాధికారత దిశగా కృషి చేస్తున్నది.
అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పని చేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితోద్ధరణ తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చారిత్రక కృషిచేస్తున్నది. భూమిలేని ఎస్సీ మహిళలకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూములను అందించింది. దళితుల జీవనోపాధికి నీటిపారుదల సౌకర్యాలు, భూమి అభివృద్ధి, ఇతర వ్యవసాయ ఉత్పాదనలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే కొన్ని వందల ఎకరాల భూమిని 959 మంది దళితులకు కేటాయించింది. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా దళితుల కోసం ప్రత్యేకంగా ‘దళితబంధు’ పథకం అమలు చేస్తున్నది.
పార్లమెంట్ తరహాలో ఏర్పాటుచేసిన పీఠాన్ని నిర్మించేందుకు రాజస్థాన్‌లోని ధోల్పూర్కు చెందిన శాండ్ స్టోన్‌ను ఉపయోగించారు. ఇందులో మ్యూజియం, అంబేద్కర్ జీవితచరిత్రలో ముఖ్య ఘట్టాలకు సంబంధించిన ఫోటోల ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్, ఆయన అధ్యయనం చేసిన, రచించిన, ఆయన గురించి ఇతరులు రాసిన పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ధ్యానమందిరం, అంబేద్కర్ జీవిత విశేషాలతో రూపొందించిన లేజర్ షో, సమావేశ మందిరం, క్యాంటీన్, సువిశాలమైన పార్కింగ్, వాష్‌రూంలు తదితర ఏర్పాట్లున్నాయి.
గ్రామాల్లోని ఇతర వర్గాల ప్రజలు దళితుల వద్దకు అప్పు కోసం వచ్చేంతగా దళితులు ఆర్థిక సాధికారత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ‘దళితబంధు’ పథకం రాష్ట్రంతో పాటు దేశంలోని దళిత సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎంతోమంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు ప్రసరింపచేస్తున్నది ఈ పథకం. దళితులను ఆర్థిక వివక్ష నుంచే కాకుండా, సామాజిక వివక్ష నుంచి కూడా దూరం చేసి వారి ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టేందుకే ఈ పథకం ఒక మైలురాయిగా నిలుస్తున్నది. దళితులు ఆర్థికంగా పటిష్ఠమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారనే విశ్వాసాన్ని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టారు.
మహారాష్ట్ర, ధూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన స్థపతి రాంజీ సుతార్ అనే 98 ఏండ్ల వయసున్న విశ్వకర్మే చేతిలో ఈ అంబేద్కర్ విగ్రహం రూపొందించబడింది. రాంజీ సుతార్, ఆయన తనయుడు అనిల్ సుతార్ డిజైన్ చేశారు. 45 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్‌ను పోలిన పీఠం నిర్మించి, దానిపై 125 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టారు. దీంతో అంబేద్కర్ విగ్రహం మొత్తం ఎత్తు 175 అడుగులతో అత్యంత ఎత్తుగా కనిపిస్తున్నది. ఈ విగ్రహ నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. 425 మంది సిబ్బంది ఈ విగ్రహ నిర్మాణం పనుల్లో భాగస్వామ్యమయ్యారు. విగ్రహానికి పాలీయురేథీన్తో పాలిషింగ్ చేస్తున్నారు. రూ.146 కోట్ల 50 లక్షలు వెచ్చించి అవసరమైన అన్ని నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళితవర్గాన్ని అంటరానితనం పేరుతో ఊరవతల ఉంచి, ఉత్పాదకరంగానికి దూరం చేయడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘దళితబంధు’ ద్వారా ఉత్పత్తి శక్తులుగా దళితులను తీర్చిదిద్దుతున్నారు. పారిశ్రామిక, వ్యాపార, ఉపాధిరంగాల్లో దళితులకు ప్రభుత్వ సాయం అందిస్తున్నారు. అర్హులైనవారికి పవర్ టిల్లర్, హార్వెస్టర్, వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ళ పెంపకం, టెంట్‌హౌజ్, ఫర్నీచర్ షాప్ వంటి పలురకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపారరంగాలను గుర్తించి వారి వారి ఇష్టాన్ని బట్టి ‘దళితబంధు’ పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నది. ‘దళితబంధు’తో దళితులు ఉత్పాదకశక్తులుగా మారారు. వారు ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. సర్కారే స్వయంగా అండగా ఉండటంతో దళిత సమాజం పట్టుదలతో స్వీయాభివృద్ధికి అడుగులు వేస్తున్నది. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాప్‌లు, రైస్ మిల్లులు, వైన్ షాప్‌లు తదితర ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండే అన్ని రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే ఇతర రంగాలనూ గుర్తించి వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నది.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చరిత్రలోనే చిరస్థాయిగా నిలువడంతో పాటు వాటి నుంచి ప్రసరించే విజయపు వెలుగులు తెలంగాణవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందాలన్న లక్ష్యం తో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ నిర్ణయం రాష్టానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
డాక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు: 97044 05335
(వ్యాసకర్త: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ)