Congress | అటకెక్కుతున్న కాంగ్రెస్ హామీలు
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను యథావిధిగా అమలుచేసేందుకే నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం సరిగా అమలు చేయలేక చతికిలపడుతున్నది.
రితేష్ దేశ్‌ముఖ్ బాలీవుడ్ ప్రముఖ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన భార్య జెనీలియా కూడా మంచి నటి. భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా రీల్స్ కూడా చేస్తుంటారు. ఒక రీల్లో ‘పెళ్లికి ముందు డార్లింగ్ అంటూ రోజూ పొగిడేవాడివి, బహుమతులు, పువ్వులు ఇచ్చేవాడివి. పెళ్లయ్యాక ఏమైంది? అలా ప్రేమించడం లేద’ని జెనీలియా అడుగుతుంది. ‘ప్రచారం ముగిసింది, పోలింగ్ ముగిసింది’ అని రితేష్ దేశ్‌ముఖ్ బదులిస్తాడు. నిజమే కదా? పోలింగ్‌కు ముందు రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రేమ వర్షంలో ముంచెత్తుతారు కానీ, డబ్బాలో ఓట్లు పడి చేతిలోకి అధికారం వచ్చాక ఇక ప్రజలను వారెందుకు ప్రేమిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా చేసిన రీల్ గుర్తుకువస్తున్నది.
Congress | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను యథావిధిగా అమలుచేసేందుకే నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం సరిగా అమలు చేయలేక చతికిలపడుతున్నది. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థలు కొన్ని వందలున్నాయి. వేలమంది నిరుద్యోగులు కోటి ఆశలతో అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. నగర కేంద్ర గ్రంథాలయంలోకి వెళ్లి స్వయంగా చూస్తే తప్ప నమ్మలేనంత మంది చదువుకుంటుంటారు. వరండాలో, ఓపెన్‌ప్లేస్‌లో, చెట్ల కింద, వాహనాల స్టాండ్ వద్ద ఎక్కడ చూసినా విద్యార్థి గుంపులే. గతంలో ఎన్నడూ లేనివిధంగా నగర కేంద్ర గ్రంథాలయం తలుపులు మూసి నిరుద్యోగులను బయటకు రాకుండా పోలీసులు కాపలా ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ అక్కడికి వచ్చి నిరుద్యోగులతో చాలాసేపు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎలా జారీ చేయనున్నామో తేదీలతో సహా పత్రికల మొదటిపేజీల్లో ప్రకటనల ద్వారా హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయి, కాంగ్రెస్ పార్టీకి అధికార పీఠం దక్కింది. నాడు వార్తాపత్రిక జీవితం ఒకరోజే కదా అనుకున్నారేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రకటనలను గాలికివదిలేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు డీఎస్సీ పరీక్ష తేదీ మార్చడంతో పాటు గ్రూప్ 2, 3 పరీక్షల నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. గ్రంథాలయంలో నిర్బంధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి ప్రక్రియ అంతా పూర్తయ్యాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడం తప్ప కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. లక్షలాది ఖాళీలున్నాయి, ఎప్పుడు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తుంటే, తిన్నదరగక దీక్షలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటం శోచనీయం.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నె శిరీష (బర్రెలక్క) అనే ఓ యువతి ‘నాకు ఉద్యోగం లేక నేను బర్రెలు కాసుకుంటున్న ఫ్రెండ్స్’ అంటూ ఓ వీడియో చేసి బాగా పాపులరైంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంచలనం సృష్టించింది. ఏకంగా కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ, రేవంత్ ప్రభు త్వం ఉద్యోగ నియామకాలు చేయడం లేదంటూ ఆమె ఆందోళన చేస్తే కాంగ్రెస్ సర్కార్ ఆమెను అరెస్టు చేసింది. కేసీఆర్ హయామే బాగుండేదని ఇప్పుడు బర్రెలక్క కూడా అంటున్నది. ఒక్క ఆమెనే కాదు, మహబూబ్‌నగర్ జిల్లాలో అప్పుడు చెరువులు, కుంటలు నిండి పచ్చని పొలాలు కనిపించేవని, ఇప్పుడు అంతా ఎండిపోయిందని, ఇటు ఉద్యోగాలు లేవు, అటు వ్యవసాయం లేదని ఆ జిల్లా వాసులు వాపోతుండటం గమనార్హం.
ఒక్క ఉద్యోగాల విషయంలోనే కాదు, అన్ని హామీల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఇలానే ఉన్నది. గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలు యథావిధిగా అమలు చేయాలంటేనే ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు, ఇంకా ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇతర పథకాలకు నిధులెక్కడివి? సాధారణంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ పథకాలు అమలుచేయాలని, గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వమే ఉత్తమం అని నిరూపించుకోవాలని చూస్తుంది. అదనం మాట దేవుడెరుగు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సైతం అమలుచేసే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సచివాలయంలో లంకె బిందెలుంటాయనుకున్నాను, అలా ఏమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన ప్రజలను ఆలోచింపజేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి నాలుగైదు సార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచాలనేది అందులో వచ్చిన ఒక ఆలోచన. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. హైదరాబాద్ ప్రధాన నగరంపై ప్రభావం తక్కువే కానీ ఇతర ప్రాం తాల్లో కోట్ల రూపాయలు పలికిన వ్యవసాయ భూముల ధరలు పడిపోయాయి. అమ్మకాలు, కొనుగోళ్లు లేవు. క్రయవిక్రయాలు తగ్గిపోయినప్పుడు ఆదాయం ఎలా పెరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్‌ను నాలుగు వేలకు పెంచుతామని నాడు హామీ ఇచ్చారు, ఏడు నెలలు గడిచిపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆ హామీని అమలుచేయలేదు. వ్యవసాయ రుణమాఫీకి రేషన్‌కార్డు లంకె పెట్టి రైతుబంధు కొందరికే పరిమితం చేసి ఈ భారాన్ని సగం తగ్గించుకోవాలనే ప్రయత్నాలు జరుపుతున్నారు.
– బుద్దా మురళి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

