Defection | ఫిరాయింపులపై దొందూ దొందే!
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను నేడు పాలకపక్షమైన కాంగ్రెస్ సమర్థించుకుంటున్న తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ కూటమికి నాయకత్వం వహిస్తున్న మరో జాతీయపక్షం బీజేపీ కూడా ఆయా రాష్ర్టాల రాజకీయ పరిస్థితులు,
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను నేడు పాలకపక్షమైన కాంగ్రెస్ సమర్థించుకుంటున్న తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ కూటమికి నాయకత్వం వహిస్తున్న మరో జాతీయపక్షం బీజేపీ కూడా ఆయా రాష్ర్టాల రాజకీయ పరిస్థితులు, అక్కడి శాసనసభల్లో తన బలాన్ని బట్టి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నది. ఈ విషయంలో రెండు పార్టీలదీ అవధులు లేని అవకాశవాదమే.
Defection | మహారాష్ట్రలో 2022లో ఫిరాయింపుల ద్వారా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును కూల్చివేసిన బీజేపీ.. కాంగ్రెస్‌లో చేరే తెలంగాణ ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయాలని ఇప్పుడు సలహాలిస్తున్నది. దేశంలో పార్టీ ఫిరాయింపుల ద్వారా రాజకీయ అస్థిరత సృష్టించి, ప్రయోజనం పొందడంలో రెండు జాతీయ పార్టీలూ దేనికవే సాటి. దేశంలో చట్టసభలకు ఎన్నికైన సభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేయడంలో మొదటినుంచీ ఈ జాతీయ పార్టీలది కీలకపాత్ర. దాదాపు 40 ఏండ్ల కిందట 1984, అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యకు గురికావడంతో రాజీవ్ గాంధీ అదేరోజు ప్రధాని అయ్యారు. ఇందిర మరణంతో లేచిన సానుభూతి పవనాలతో లబ్ధి పొందడానికి ఆయన రెండు నెలల్లోపే జరిపించిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 415 సీట్లను కైవసం చేసుకున్నది. అప్పుడు రాజీవ్ వయసు 40 ఏండ్లే. స్వార్థ రాజకీయాలే ఆలంబనగా నడిచే కాంగ్రెస్ పార్టీలో ఉన్న జిత్తులమారి సీనియర్లు తన రాజకీయ అనుభవరాహిత్యాన్ని ఎక్కడ ఆసరా చేసుకొని దెబ్బతీస్తారనే భయం రాజీవ్‌కు పట్టుకున్నది. దాని ఫలితమే 8వ లోక్‌సభ ఎన్నికలైన నాలుగు నెలల్లోపే భారత పార్లమెంటు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టం ఆమోదించడం, వెంటనే అది అమల్లోకి రావడం జరిగిపోయాయి.
ఫిరాయింపు నిరోధక చట్టంలోని అనేక నిబంధనలు బలహీనంగా ఉండటం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కొన్ని సెక్షన్లు పలచనచేసేలా కనిపించడంతో నాటి ప్రతిపక్షాల్లో అత్యధిక పార్టీలు రాజీవ్ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించాయి. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ కూలదోయడంతో పార్లమెంటులో ప్రధానంగా ప్రతిపక్షాల్లో టీడీపీ ఒక్కటే ఈ విషయంలో రాజీవ్‌గాంధీకి మద్దతు పలకడం విశేషం. నాటి సోషలిస్టు నేత మధు లిమయే అన్నట్టు రాజీవ్ తెచ్చిన ఈ చట్టం ఫిరాయింపులను నిరోధించకపోగా ఫిరాయింపుల తీరు ‘రిటైల్ నుంచి హోల్‌సేల్’కు మారినట్టయింది. పార్లమెంటులో ఫిరాయింపుల నిరోధక బిల్లును ప్రవేశపెట్టిన నాటి ప్రధాని రాజీవ్ మాటలు కోటలు దాటిపోయాయి. 1985 జనవరి 31న ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై 7 గంటలు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో రాజీవ్ ప్రసంగిస్తూ, ‘ఏడేండ్ల నుంచీ ఈ బిల్లు కోసం మనం ఎదురుచూస్తున్నాం. ఈలోగా చాలా నష్టం జరిగిపోయింది. కనీసం కిందటేడైనా ఈ బిల్లు తీసుకొచ్చి చట్టం చేయలేకపోయాం. జరిగిందేదో జరిగింది. మన ప్రజా జీవితాన్ని ప్రక్షాళన చేయడానికి తొలి అడుగు ఈ ఫిరాయింపు నిరోధక బిల్లు’ అని వర్ణించారు. వెంటనే రెండు సభలూ ఆమోదించాయి. కానీ, కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయపక్షాల చేతిలో పనిముట్టుగా మారిపోయింది. అంతకు ఏడేండ్ల ముందు ఫిరాయింపులతో గరిష్ఠ ప్రయోజనం పొందిన ఆయన తల్లి ఇందిరమ్మ చివరికి వాటి తో విసుగెత్తిపోయి ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకురావాలని ఆలోచించారు. ఆమె అనుకున్నదే తడవు అన్నట్టు ఆగమేఘాల మీద ఫిరాయింపులు నివారించే లక్ష్యంతో బిల్లును 1973లో నాటి కేంద్ర న్యాయశాఖా మంత్రి అశోక్ సేన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే, పాలకపక్షం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంకల్పం లేకపోవడంతో రెం డేండ్లు ఆ బిల్లు చట్టసభల ఆమోదం పొందకుండా మురిగిపోయింది. ఈలోగా 1975, జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఇందిర తూతూ మంత్రంగా చేసిన ప్రయత్నం ఫలించలేదు. 1977-79 మధ్య కేంద్రంలో మొరార్జీ దేశా యి నాయకత్వాన ఏర్పడిన తొలి కాంగ్రెసేతర జనతా సర్కా ర్ హయాంలో జరిగిన ప్రయత్నం కూడా కార్యరూపం దాల్చలేదు.
కేంద్రంలో, రాష్ర్టాల్లో చట్టసభల సభ్యుల ఫిరాయింపుల వల్ల అత్యధికంగా రాజకీయ ప్రయోజనం పొందిన పార్టీ కాంగ్రెసే. ఈ చట్టం ఊసే లేని 1967-1983 మధ్యకాలంలో 2,700 మందికి పైగా చట్టసభల సభ్యులు ఫిరాయింపులకు పాల్పడ్డారు. వారిలో 1900 మంది వరకూ కాంగ్రెస్ పార్టీలోకే ఫిరాయించారు. ఇంకా, ఈ కాలంలో పార్టీలు మారిన 15 మంది ముఖ్యమంత్రుల్లో కనీసం 10 మంది కాంగ్రెస్ నాయకులేనని రికార్డులు చెప్తున్నాయి. 1980 జనవరిలో ఇందిరాగాంధీ రెండోసారి ప్రధాని అయ్యాక 1984లో డబ్బు సంచులతో ఫిరాయింపులు ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్, సిక్కింలో ప్రాంతీయపక్షాల సర్కార్లను కూల్చివేయడానికి చేసిన ప్రయత్నాలు చివరికి విఫలం కాగా, జమ్మూకశ్మీర్‌లో ఫారూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని కుట్రలతో కూలదోసి, ఆయన బావ జీఎం షాను ఫిరాయించేలా చేసి గద్దెనెక్కించడంలో సఫలమైంది కాంగ్రెస్. దేశంలో ధనం, పదవులు ఆశచూపి అనేక రాష్ర్టాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఫిరాయింపుల ద్వారా కూలదోసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 1990ల చివరి నుంచి, 2014 నుంచి కేంద్రంలో అధికారం అనుభవించే స్థితిలో ఉన్న బీజేపీ కూడా ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్షాలను ప్రధానంగా పెద్ద ప్రాంతీయపక్షాలను దెబ్బదీయడానికి కాంగ్రెస్ మార్గాన్నే ఎంచుకుందని రెండేండ్ల నాటి మహారాష్ట్ర పరిణామాలు చెప్తున్నాయి.
ఏకంగా ముఖ్యమంత్రులనే ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకునే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. 1953, అక్టోబర్ 1న నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేశాక కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. ఫలితంగా ప్రజా పార్టీ నాయకుడైన టంగుటూరి ప్రకాశంను చేర్చుకొని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. అలాగే ఈశాన్య రాష్ట్రమైన అసోంలో బీజేపీకి బలమైన మూలాలు, నాయకుడు లేని కారణంగా కాంగ్రెస్‌లో దాదాపు ఒకటిన్నర దశాబ్దాలు గడిపిన మాజీ మంత్రి హిమంతా బిశ్వశర్మ కాషాయపక్షానికి దిక్కయ్యాడు. చివరికి ఆయనే 2021లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో బీజేపీలో చేరి ఆరేండ్లలో శర్మ సీఎం కావడం పార్టీ ఫిరాయింపులపై కాషాయపక్షం వైఖరికి నిదర్శనం. చట్టసభల సభ్యుల ఫిరాయింపుల నివారణకు 1985 నాటి ఫిరాయింపుల నిరోధక చట్టం, తర్వాత ఏబీ వాజపేయి హయాంలో నాటి ఎన్డీయే ప్రభత్వం తీసుకొచ్చిన సవరణలు సరైన ఔషధం కాదని 2022లో మహారాష్ట్రలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడీ సర్కారును బీజేపీ కూల్చిన తీరు తేల్చిచెప్పింది. ఇంకా ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ప్రలోభాలు, బెదిరింపులతో చేర్చుకుంటున్న పద్ధతి చూస్తే ఈ జాతీయపక్షాలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం ఎంతటి బలహీనమైనదో అర్థమవుతున్నది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Horoscope | 13-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
పంట చేతికొచ్చేనా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

