మధ్య యుగచరిత్ర ప్రారంభంలో వచ్చిన బాదామి చాళుక్య వంశం దక్కనులో, తెలంగాణలో ఒక ముఖ్యమైన కాలం. క్రీ.శ. 6, 7 శతాబ్దాల్లో కృష్ణా-తుంగభద్ర ప్రాంతంలో బాదామి చాళుక్యుల ఆధారాలు శాసనాలు, నిర్మాణాల రూపంలో కనిపిస్తున్నాయి.
తెలంగాణ చరిత్ర పూర్వయుగం నుంచి ప్రధానంగా పశుపాలక సమాజమని, అందుకే పాలకులు ఆంధ్రలోని వేంగి వంటి సారవంతమైన, ఆర్థికంగా ధనికమైన ప్రాంతాల వైపు వెళ్లారని, చాళుక్య, రాష్ట్ర కూట వంశాలు ఏలుతున్న కాలంలో తెలంగాణ మారుమూల ప్రాంతమని తప్పుగా రాశారు. బాదామి, రాష్ట్రకూట రాజధానులు తెలంగాణలో లేవనే కారణంగా ఈ వాదనలు చేశారు. మరి చాళుక్యుల బాదామి, రాష్ట్రకూటుల మాన్యఖేట (కర్ణాటకలోని ఇప్పటి మాల్ఖేడ్, ఎల్లిచ్‌పూర్ (మహారాష్ట్ర) దక్కనులో తెలంగాణను పోలిన నేలపైనే ఉన్నాయి కదా. రెండవ పులకేశి విస్తృత బాదామి చాళుక్య సామ్రాజ్యాన్ని నిర్మించి, దాని తూర్పుభాగాన్ని తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడికి ఇచ్చినందుకే వేంగీ ఏర్పడింది తప్ప సారవంతమైనందున కాదు.
ఆంధ్రలో ఇక్ష్వాకుల తర్వాత వచ్చిన రాజ వంశాలు కొన్ని దశాబ్దాలు మాత్రం పాలిస్తే (ఒక్క శాలంకాయనులు 140 ఏండ్లు పాలించారు), వేంగీ చాళుక్యులు మాత్రం దాదాపు 600 ఏండ్లు పాలించారు. అంటే ఇక్ష్వాకుల తర్వాత మళ్లీ కాకతీయులు వచ్చేవరకు తెలంగాణ, నేటి ఆంధ్రప్రదేశ్ వేర్వేరు రాజకీయ అస్తిత్వాల కింద ఎదిగాయి.
బాదామి చాళుక్య ముఖ్య ఆధారాలు తెలంగాణలోని కృష్ణా-తుంగభద్ర ప్రాంతంలో తప్ప మిగతా తెలంగాణలో దొరకకపోవడానికి కారణం తెలుసుకోవాలంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలను దక్కనులో భాగంగా చూడాలి. మహారాష్ట్ర పక్కనే ఉన్న గోదావరి, మంజీరా పరీవాహక ప్రాంతాల్లో బాదామి చాళుక్య సామంతులు లేదా అధికారులైన రాష్ట్రకూటుల అధికారం లేదా పాలన ఉండి ఉండాలి. అందుకే బాదామి చాళుక్య ఆధారాలు నేరుగా దొరకడం లేదు. శాతవాహనుల తర్వాత మహారాష్ట్ర కేంద్రంగా విస్తరించిన వాకాటక కాలంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ రాజధాని లేనప్పటికీ, దక్కనులో వచ్చిన రాజ్యాలలో తెలంగాణ ముఖ్య భాగమే. సరిహద్దు ప్రాంతమో లేక అప్రధాన భూభాగమో కాదు. పాండురంగపల్లి తామ్ర శాసనం, మానాంక వంటి రాష్ట్రకూట వంశ తొలిరాజుల పేర్ల ప్రస్తావనలు ఉన్నాయి. బాదామి చాళుక్య కాలంలోనే మాన్యఖేట పట్టణం ఎదిగింది. ఇటువంటి కొన్ని ఆధారాల వల్ల రాష్ట్రకూట వంశానికి చెందిన సామంతులు లేక చిన్నరాజుల కింద తెలంగాణ ఉన్నట్టు చూచాయగా అర్థం అవుతున్నది. బాదామి చాళుక్యులు ఓడించిన తర్వాత రాష్ట్రకూటుల రాజధానులలో ఒకటి మాన్యఖేట. ఇది తెలంగాణ సరిహద్దు పట్టణం జహీరాబాద్‌కు 100 కి.మీ. దూరంలో ఉన్నది. రాష్ట్రకూట ఇంకో ముఖ్య పట్టణం నాందేడ్ బాసరకు 100 కి.మీ. లోపే. అంటే సామంతులుగా ఉన్న రాష్ట్రకూటుల ఏలుబడిలో తెలంగాణ ఉండి ఉంటుంది. అందుకే రాష్ట్రకూటులు స్వతంత్రులు కాగానే వారి శాసనాలు కోకొల్లలుగా తెలంగాణలో దొరుకుతున్నాయి. తెలంగాణ చరిత్రలో ఉన్న ఖాళీలను పూరించే విస్తృత పరిశోధన జరగకపోవటమే ఈ అస్పష్టతకు కారణం.
బాదామి చాళుక్యులు: బాదామి చాళుక్య రాజ్యాన్ని సామ్రాజ్యంగా చేసినది రెండవ పులకేశి. ఉత్తరభారతంలోని గంగా తీర మైదానాలు గెలుచుకొని దక్షిణానికి విస్తరించాలన్న హర్ష వర్ధనుడిని వింధ్య సానువుల్లోనే నిలువరించి దక్కనును స్వతంత్రంగా నిలిపిన ఘనత రెండవ పులకేశిది. ఐహోళేలో మంత్రి రవికీర్తి వేయించిన శాసనం రెండవ పులకేశిని దక్షిణాధిపతిగా కీర్తిస్తుంది. అలంపూర్‌లో బాదామిరాజు విజయాదిత్య వేయించిన శాసనం తన తాత, పులకేశి కొడుకైన మొదటి విక్రమాదిత్యుడి యుద్ధ విజయాలను వర్ణిస్తుంది. మొదటి విక్రమాదిత్య గెలిచిన రాజ్యాల్లో సింహళ, కేరళ, చోళ, పల్లవ, పాండ్య రాజ్యాలున్నాయి. చాళుక్య విక్రమాదిత్యుడే కాదు ఇంకా ముందు దక్షిణభారతంలో వచ్చిన రాజ్యాలు, ఆ తర్వాతి రాష్ట్రకూటులు కూడా సింహళంపై దండెత్తారు.
ఇదేకాలంలో భారత ఉప ఖండాన్ని పర్యటించి, హర్షుడి రాజ్యంలో కొన్నేళ్లు గడిపి, వాతాపిలో కూడా పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ కూడా రెండవ పులకేశి గురించి వర్ణించాడు . రెండవ పులకేశికి పర్షియా (ఇప్పటి ఇరాన్) చక్రవర్తి రెండవ ఖుస్రోతో దౌత్య సంబంధాలుండేవని అల్-తబరి అనే పర్షియన్ చరిత్రకారుడు రాశాడు.
కూడలి సంగమేశ్వరం: కృష్ణా-తుంగభద్ర సంగమ స్థలమైన కూడవెల్లి గ్రామంలో దాదాపు రెండవ పులకేశి కాలంలో నిర్మించిన ఈ గుడి అలంపూర్ ఆలయాల కంటే కొంచెం ముందు కట్టిందని భావిస్తున్నారు. శ్రీశైలం హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ప్రమాదం వల్ల ఈ ఆలయాన్ని అక్కడి నుంచి 1979-86 మధ్య తరలించి అలంపూర్‌కు దగ్గరగా పునర్నిర్మాణం చేశారు. 68X41 అడుగుల వైశాల్యంతో ఇసుక రాతితో కట్టిన ఈ సంధర శైలి ఆలయం (చతురస్రాకార ఆలయం) వాస్తు రీత్యా, గంధర్వ, విద్యాధర, దిక్పాల, గణశిల్పాల వల్ల విశిష్టమైంది.
రూపుదిద్దుకుంటున్న తెలుగు లిపి
బ్రాహ్మీ లిపితో మొదలైన మన రాత ఈ కాలం నాటికి రూపు మార్చుకుంటూ ఇప్పుడు మనం రాసుకుంటున్న తెలుగు లిపి దశకు చేరుకుంది. అయితే ఇప్పటి లిపికి మార్పు చెందుతున్న దశ బాదామి చాళుక్యకాలంలో మొదలైంది. ఇదే కాలంలో తెలుగు, కన్నడ భాషలు ఒకే లిపిగా రావటంతో ఈ లిపిని సంతరించుకొని కొనసాగినయి. తెలుగు-కన్నడ లిపి అని అంటారు భాషా శాస్త్రవేత్తలు, శాసన శాస్త్ర నిపుణులు. తెలుగు వచ్చినవాళ్లు కన్నడ, కన్నడ చదవగలిగిన వాళ్లు తెలుగును కొన్ని పదాలు అర్థం కాకున్నా చదవగలగటానికి కారణం ఇదే. ఈ రకంగా తెలుగు-కన్నడ లిపి 13, 14 శతాబ్దాల వరకు కొనసాగి ఆ తర్వాత ప్రత్యేక తెలుగు లిపి రూపుదిద్దుకున్నది. తెలుగు అక్షరాలు గుండ్రంగా మారడం, తలకట్లు రావడం ఇప్పుడే మొదలైంది. అందుకే బాదామి చాళుక్య కాలం నుంచి, ఆ తర్వాత వచ్చిన రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య, కల్యాణి చాళుక్య, కాకతీయ శాసనాలు వేల సంఖ్యలో తెలంగాణ గ్రామాల్లో కనిపిస్తున్నాయి.
– డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000