ఆ అరుణకాంతి.. మనసుకు శాంతి!
అమ్మా! భూమ్యాకాశాలు సహా సమస్త సృష్టీ ఉదయ, అస్తమయాల్లో అరుణ వర్ణం ధరిస్తుంది. అయితే ఆ అరుణిమ అంతా ఎర్రని నీ మేని రంగుగా భావిస్తూ ఎవరైతే సాధన చేస్తారో వారికి వనహరిణేక్షణులైన ఊర్వశి మొదలుగా దేవకాంతలు అందరూ వశమవుతారు
తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీసరణిభిః
దివం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః
భవంత్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణ గణికాః (సౌందర్యలహరి-18)
‘అమ్మా! భూమ్యాకాశాలు సహా సమస్త సృష్టీ ఉదయ, అస్తమయాల్లో అరుణ వర్ణం ధరిస్తుంది. అయితే ఆ అరుణిమ అంతా ఎర్రని నీ మేని రంగుగా భావిస్తూ ఎవరైతే సాధన చేస్తారో వారికి వనహరిణేక్షణులైన ఊర్వశి మొదలుగా దేవకాంతలు అందరూ వశమవుతారు’ అని అమ్మవారిని స్తుతించారు ఆదిశంకరులు.
‘తరుణ తరణి శ్రీసరణిభిః’- తరుణ.. లేత వయస్కుడైన అంటే అప్పుడే ఉదయిస్తున్న.. తరణి- సూర్యుడిని, శ్రీసరణిభిః- సౌభాగ్యవంతమైన, అరుణిమను- ఎరుపుకాంతిని, అమ్మ శరీరకాంతులుగా ధ్యానించడం వల్ల సకల సృష్టీ అతని వశమవుతుంది. అమ్మ ధ్యానంలో సమస్త భూమ్యాకాశాలు అరుణిమ కాంతులలో మునిగి పోతున్నట్లుగా భావించాలి. అమ్మ సముద్రవసని అంటే సముద్రంలో ఉండేది. ఆమె మేని కాంతి అరుణవర్ణం. కాబట్టి సముద్రం అంతటా అరుణవర్ణం వ్యాపించి ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఈ చరాచర సృష్టి మొత్తం ఆ లలితాపరమేశ్వరి మయం అనుకోవాలి.
శ్లోకంలో వనహరిణ అని సంబోధించారు శంకరులు. అడవిలో ఉండే జింకలకు ప్రాణభయం ఎక్కువ. దానివల్ల అవి ఎప్పుడూ బెదురు చూపులతో చుట్టూ పరికిస్తుంటాయి. అదే పెంపుడు జింకలలో ప్రాణభయం ఉండదు కాబట్టి బెదురు చూపులు ఉండవు. అందుకే చిన్న శబ్దానికీ బెదిరిపోయే హరిణాల కన్నులతో పోలుస్తూ అప్సరసలందరూ ఊర్వశి సహా (సహోర్వశ్యా), సాధకుని వశమవుతారని చెప్పారు. అప్సరసలందరూ అన్నప్పుడు.. ఊర్వశిని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? అంటే.. ఒకసారి బదరికావనంలో నరనారాయణుల తపస్సును భగ్నం చేయడానికి అప్సరసలంతా వచ్చి వారి విన్యాసాలను ప్రదర్శించారు. దానికి చలించని నారాయణుడు తన ఊరువును (తొడను) రాసుకున్నాడట. వెంటనే ఆయన ఊరువు నుంచి అతిలోక సౌందర్యరాశి జనించింది. తనే ఊర్వశి. ఆమె అందాన్ని చూసిన అప్సరసలంతా సిగ్గుతో తలలు వంచుకొని వెళ్లిపోయారు. అంతటి అందగత్తె అయిన ఊర్వశి సహా అందరూ ఆ సాధకుని ఇష్టపడి మోహించి వశమవుతారు. అంటే, సమస్త లోకాల్లోని సుఖాలు సాధకుని వశమవుతాయి.
ఈ శ్లోకాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకోవలసిందేమిటి? సుఖాలు వశమైతే ఆ ప్రలోభాల మత్తులో మునిగిపోతే లక్ష్యానికి దూరమవుతాం. పిరికితనమూ, ఏమరుపాటూ, వికారత్వమూ, విచక్షణ లేని జ్ఞానమూ లక్ష్యానికి దూరం చేస్తాయి. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానానికి మూలం విచక్షణ. గ్రంథస్థమైన జ్ఞానానికి అనుభవ జ్ఞానం తోడుకావాలి.
విభిన్న మార్గాల్లో తెలుసుకున్న విజ్ఞానాన్ని విచక్షణతో విచారించి ఉత్తమ మార్గాన్ని అనుసరించాలి.‘నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా’ అని లలితాదేవిని కీర్తించాయి సహస్రనామాలు. అంటే తన సౌభాగ్యయుతమైన అరుణకాంతులతో సమస్త బ్రహ్మాండాన్నీ ముంచేసే చిద్రూపిణి లలితా పరమేశ్వరి. శుభమైన, శుద్ధమైన బ్రహ్మానంద జ్ఞానాన్ని అనుగ్రహించే జనని ఆమె. సూర్య మండలంలో ఆరాధింపదగిన అమ్మను భగారాధ్యా అంటారు. ఆ సూర్యకాంతిని అమ్మ మేనికాంతిగా భావించి సాధకుడు సగుణారాధనతో ఆరంభించి క్రమంగా నిర్గుణ ఆరాధనకు చేరుకోవాలి. ఆ మార్గంలో ఊర్వశిలాంటి సమ్మోహనాలు, ప్రలోభాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి పరతత్త్వ ప్రదాయిని ‘ప్రేమరూప’ అయిన అమ్మలో లయం కావడం సాధకుని లక్ష్యం. అందుకే అమ్మను ఆరాధించిన వారికి భౌతిక, ఆధ్యాత్మిక భోగాలు లభిస్తాయని చెప్తారు. ‘సావిత్రి’గా సూర్యమండలంలో తేజరిల్లే లలితాదేవి అనుగ్రహం మనపై ప్రసరించాలని ప్రార్థిద్దాం.
– పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- durga
- Goddess
- Hindu Deity
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

