తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా ఆంధ్ర ప్రాంత నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులదే ఆధిపత్యం.
వివక్షను ఎదుర్కొంటూ తెలంగాణ కళాకారులు ఎవరైనా రాణిస్తే.. వారిని తొక్కేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. సమైక్య రాష్ట్రంలో తెలుగు సినిమాలో తెలంగాణ భాషకు తీవ్రమైన వివక్ష ఎదురైంది. స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లపాటు తెలంగాణ మట్టి పరిమళం వెండితెరపై గుబాళించింది. నేడు తెలంగాణలో తమకు అనుకూల పరిస్థితులు నెలకొనడాన్ని ఆసరాగా చేసుకొని ఓర్వలేని జనాలు ఉడుక్కుంటున్నారు.
మూడ్శింతల కింద పంచాతి జరుగుతుండే. పెద్దమన్సులను షెరో దిక్కు కోర్కునేది. అటు ఆడపిల్లోల్లు, ఇటు మొగపిలగానోళ్లు. ఓ తీరొక్క శాత్రాలతో ఇడిపోవాల్ననుకునే కాపురం కల్పడానికి గా పెద్దమన్సులు నానా యాతన పడేది. పెండ్లాం మొగల్ల పంచాతీ ఉప్పు నిప్పులెక్క.. అని ఒగలంటే, గుర్రాన్ని ఔంజు (నీళ్ల తొట్టి) దాకా తీస్కపోతంగానీ నీళ్లు తాపిచ్చుడు మన నుంచైతదా.. అని ఇంకొల్లు అనేటోళ్లు.. పెండ్లామొత్తే ఇన్నుంటయని జేసుకున్నప్పుడు తెల్వదా.. అని మరోకైనే.. ఏదో తెల్సే జేసుకున్నడు, పైండ్లెనంక మార్సుకుంటా అనుకున్నడు.. ఎంతకూ మారకపోతే పోరడుమాత్రం ఏం జేత్తడుజెప్పుంన్రి.. అని ఇంకోఅయినే… ఇట్ల ఎవ్వలకు తోసినట్టు వాళ్లు ఆలుమొగల ముచ్చట్లపై నెరివడేతీరు మాట్లాడి, ఆఖరుకు ‘బిడ్డా.. పెండ్లంటే ఒక్కనాటి బాగోతం గాదు, ఒడ్సే బాగోతం అస్సలే గాదు… మంచో చెడో కట్టుకున్నందుకు నువ్వింత భరించుకోవాలె, పోరడింత భరించుకుంటడు.. కల్సిపోతేనే కాపురం’ అనే ధోరణ్లో జెప్పి ఒప్పించజూసేది.
ఆలుమగల పంచాతిలో ఎంతకూ పోరిపోరడు ఒక్క కట్టుమీద్కి రాకవోతే వాదన మల్లో వారానికి వాయిదేసేది. ఆ వారం మళ్లా పెద్దమన్సులంతా కల్సి ఏమన్న ఆలోచించిండ్రా.. అని ఇద్దరి మన్సుల ఏమున్నదో ఇసారించేది.. ఏమన్న నానినట్టు అనిపిస్తే కొంచెం మెత్తబడ్డరని మల్లోపారి ఇద్దర్ని ఏరేరుగా కూసోబెట్టి ఒప్పిచ్చేది.
ఎంతజెప్పినా ఇనకుండా మొండిపట్టుకువోయి.. కల్సుండం అంటే జేసేదేంలేక ఇటు పిల్లోళ్లను, ఇటు పిలగానోళ్లను కల్పిగూసోవెట్టి ఉన్నముచ్చటజెప్పి ఇడ్పుకాయితం జేసుకోండ్రి అని తీర్మానించేది. అంతా పెట్టువోతలు, ఇచ్చిపుచ్చుకున్న ఖర్సులన్నీ లెక్కలు తేల్సుకున్నంక ఇద్దరిదిక్కు పెద్దమన్సులు ఓ కాయితం తెచ్చి ఇడ్పుకాయితం అంగీకారంతోనే జేసుకుంటున్నట్టు రాసి ఇడిపోయేటోళ్ల సంతకాలు, వాళ్ల అవ్వయ్య సంతకాలు, అన్నదమ్ములుంటే వాళ్ల సంతకాలు పెట్టిచ్చి సాక్షులుగా పెద్దమన్సులు కూడా సంతకాలు పెట్టి ఎవ్వల దార్న వాళ్లు పోంన్రి అని పంపేటోళ్లు.
‘వచ్చిండన్నా.. వచ్చాడన్నా.. వరాల తెలుగు ఒకటేనన్న.. తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగు జాతి మనది.. అని తల్లా పెళ్లామా..? సినిమా కోసం డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాస్తే మీరేమో (ఆంధ్రా) తెలుగుకు తల్లిగా ఫోజులు కొడ్తిరి. మమ్ముల (తెలంగాణను) పెండ్లాం లెక్క జూస్తిరి. ఎన్ని దశాబ్దాల తెలుగునాడు చరిత్రలో ప్రతి సందర్భలోనూ తెలంగాణ యాసను, మాటను, శైలిని, నడవడికను హాస్యమాడడమే తప్ప ఏనాడూ ఆంధ్రా, రాయలసీమను పల్లెత్తు మాటనని, ఎక్కడా మాటవరుసకైనా నవ్వులాటగా చూడని ఉత్తమ సంప్రదాయం తెలంగాణ వ్యావహారికం అని ఏ చరిత్ర చూసినా తెలుస్తుంది, ఎక్కడ గమనించినా అర్థమవుతుంది.
మా పట్ల ఎంత వివక్ష జరిగిందో కూడా యావత్తు ప్రపంచం జూసిందే. ఆ మాటలన్నీ ఇప్పుడు మళ్లీ వల్లెవేసుకుంటే వచ్చేదేమీ లేదుగానీ ప్రస్తుతం గురించే ఈ ఆవేదనంతా. ‘ఇడుపు కాయితం’ అంటే మీకేమైందో అర్థంగానీ ముచ్చట. అవును.. ఇడుపు కాయితం అంటే మీకర్థం గాకపోవచ్చుకానీ కాస్తంత తెలుసుకోవాలనే సోయి ఉన్నా పెద్ద కష్టమేమీ కాదు. ఇన్నాళ్లు రుద్దింది చాలదా.. ఇప్పుడు కూడానా.. అని విసుగుపుట్టేలా వ్యవహరించడమే ప్రస్తుత ఆవేదనకు అసలు కారణం. మేమెప్పుడన్న ‘మీరు గుడ్కా, కోస్రం, తీయ్గుంది, మేస్టారు, అనపకాయ, చక్రాలు (సకినాలు), బిళ్లలు (గారెలు) వంటి పదాలను ఎక్కిరిచ్చినమా? మీకు మాకు పరస్పర విరుద్ధమైన అర్థాలుంటే కూడా మమ్ముల్నే తప్పుబట్టి ఏడ్పించిన రోజులుండే. మోస్తరు అంటే తెలంగాణలో మామూలుగా అని, అదే నెల్లూరు, ప్రకారం వంటి జిల్లాల్లో అతిగా అనే అర్థంలో వాడబట్టే. అక్కడా మీ మోస్తరే నిఖార్సన్నట్టు, మాదేదో అరువు తెచ్చి వాడుకున్నట్టుగా ట్రీట్ చేస్తిరి.
ఇప్పటికీ గదే తీరాయె. రాసిరంపానవెట్టిన ఆరు దశాబ్దాలు సాలవన్నట్టు గిప్పుడుగూడా గదే తరీఖాయె. ఇగ మీరే తోపులా, మాకు అతీగతి లేదా? మారాల్సింది మీరా.. మేమా? ఇంత జర్గుతున్నా బిరుసు తగ్గేటట్టు అన్పిస్తలేదుగా. అంత కంట్ల కానకుంటున్నమా, గంత కక్కొత్తాన్నమా? ఎందుకీ నాటకాలు, ఎన్నేండ్లీ కథలు.. సాలు. చేసినకాడికి సాలు. ఇప్పుడున్న జర మనుషుల్లెక్క మాట్లాడుండ్రి. రాజకీయాల కోసం పూటకో మాట మాట్లాడి లొల్లులు పుట్టించకుండ్రి. విలన్ భాష, గుండాల యాస.. అంటూ సీన్మాల్లో అంటరానోళ్లలెక్క జూసింది జగమంతా ఎరికేనాయె. ‘ఏంది బై, అట్నా, సాలోస్తలే, సప్పుడ్జేక ఉండున్రి, గదేంద్రాబై, జర నువ్వన్న జెప్పరాదే, సూడు తమ్మీ, ఏమిరా బై, అటేనా, సూస్కో పో’ అంటూ తియ్యని పదాల్ని మీకు అనరాకపోవడం వల్ల, మాకు ఇనబుద్ధి కానట్టు పలికితిరి.
మీతోని గీ పంచాతి ఎప్పుడో తెంపుకున్నం. మీకు ఇడుపు కాయితం ఇచ్చినం. కాళ్లు పట్టుకొని లాగితే సూరు పట్టుకొని వేలాడినట్టు ఇంకా ఏంది మీ రపరప! చిత్రసీమ ఎక్కణ్నుంచి ఎక్కడికి వచ్చి ఎట్లా బతుకుతున్నదో తెల్సిందే. ఎవ్వల జీవన విధానం వాళ్లది. మీ చరిత్ర జూసినం సాలదా.. మీరు పాతరవెట్టిన తెలంగాణ టాలెంట్‌ను బైటికి తీస్తే అంత ఉడుక్కోవడ్తిరి. మీ లెక్క ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టుగనో, తిన్నింటి వాసాలు లెక్కవెట్టినట్టో అనే బాపతు కాదు. ఇప్పటికే డీజే టిల్లులు, బలగాలు వచ్చినయ్, మున్ముందు తెలంగాణ భాషకు, ఇక్కడి కథలకు పట్టం కట్టేలా మస్తు సీన్మాలు కూడా వస్తాయ్. ఆటగోలుతనానికి పొయ్యి నవ్వులపాలు గావొద్దు.
– రాజేంద్ర ప్రసాద్ చేలిక