ప్రజల రక్షకులా? ప్రభుత్వ కవచాలా?
ప్రజాస్వామ్యంలో పోలీసుల అసలు విధి ఏమిటి? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి రక్షణ కల్పించడమా? ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలను అడ్డుకోవడమా? లేక రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ సామాన్య పౌరులకు భద్రత కల్పించడమా? ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉండాలి.
ప్రజాస్వామ్యంలో పోలీసుల అసలు విధి ఏమిటి? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి రక్షణ కల్పించడమా? ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలను అడ్డుకోవడమా? లేక రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ సామాన్య పౌరులకు భద్రత కల్పించడమా? ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉండాలి. పోలీసులు ఏ ప్రభుత్వానికీ, ఏ రాజకీయ పార్టీకీ వ్యక్తిగత రక్షకులు కాదు. వారు రాజ్యాంగం, చట్టం, ప్రజలకు సేవ చేసే సంస్థ ఉద్యోగులు. కానీ ఇటీవల తెలంగాణ, ఢిల్లీలో జరిగిన రాజకీయ నిరసనలు, ధర్నాలు, ఆందోళనల సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల అరెస్టులు, జంతర్ మంతర్ వద్ద నిరసనల అడ్డగింతలను చూస్తే, అసలు పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారనే సందేహం కలుగుతున్నది.
పోలీసులు ప్రజల పట్ల సమాన దృష్టితో విధులు నిర్వహించాలి. ఎదుటి వ్యక్తులు అధికారపక్షానికి చెందినవారా, ప్రతిపక్షానికి చెందినవారా, సాధారణ పౌరులా అనే విషయాన్ని పట్టించుకోకూడదు. సదరు వ్యక్తి చట్టాన్ని అనుసరిస్తున్నారా? ఉల్లంఘిస్తున్నారా అనేది మాత్రమే చూడాలి. ఎవరైనా నిరసన పేరుతో హింస, ప్రజా ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి, ఇతర పౌరుల హక్కులకు భంగం కలిగించడాన్ని ఎవరూ సమర్థించరు. కానీ ధర్నా చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, నినాదాలు చేయడం, నిరసన తెలుపడం ప్రజాస్వామ్య రాజకీయ జీవితంలో సహజమైన ప్రక్రియ. వీటి పట్ల కూడా ఆంక్షలు విధిస్తే ఎలా? తెలంగాణలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తే పోలీసులు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారు? ప్రజలకు రక్షకులుగా ఉంటున్నారా? పాలకులకు రక్షణ కవచాలుగా వ్యవహరిస్తున్నారా అనే ఆందోళన కలుగుతున్నది. ఇటీవల ఢిల్లీలో, వివిధ రాష్ర్టాల్లో నీట్ పేపర్ లీకేజీ, ఈసీలో అక్రమాలపై ఆందోళనలు వెల్లువెత్తాయి. నిరసనకారులపై పోలీసులు సాగించిన దమనకాండ, భావప్రకటనా స్వేచ్ఛ, నిరసన హక్కులను కాలరాసింది.
ఇటు రాష్ట్రంలోనూ వరుసగా జరుగుతున్న పరిణామాలు పోలీసుల విధులు, బాధ్యలపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపణలను ఖండిస్తూ ప్రెస్మీట్లో బాలరాజ్ యాదవ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో బాలరాజ్‌పై బల్మూరి వెంకట్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఆరోపణలను ఖండిస్తే అరెస్టు చేయడమేంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శల ద్వారా సమాధానం చెప్పాలి కానీ, పోలీసు కేసుల ద్వారా వేధింపులేంటని ప్రశ్నించారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసుల తీరుపైనా విమర్శలు రావడాన్ని మనం గమనించవచ్చు. అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలరాజ్‌ను నగరమంతా తిప్పుతూ ఇబ్బందులు గురిచేయడంతో ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదొక్కటే కాదు, ఇటీవల జరిగిన చాలా పరిణామాలు ఇదే విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ చివరిలో వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగులను పరామర్శించేందుకు, సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలో బీఆర్ఎస్ సీనియర్‌నేత, ప్రభుత్వ మాజీ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ గాయపడ్డారు. ఇది చాలదన్నట్టు తమ విధులకు దాస్యం ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు పెట్టడం విడ్డూరం. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రవేశద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్న ఘటన మరింత తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కూడా పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలోకి ఎన్నికైన సభ్యులను అడ్డుకునే అధికారం పోలీసులకు ఉన్నదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన పట్ల విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులపైనా ప్రభుత్వం కేసుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నది. ప్రతి రాజకీయ విమర్శను, నిరసనను పోలీసు శాంతిభద్రతల సమస్యగా మార్చడం సముచితం కాదు.
దేశంలో పోలీసు సంస్కరణల గురించి ఇప్పుడు మాత్రమే మాట్లాడటం లేదు. 1861లో రూపొందిన పోలీసు చట్టం కాలానుగుణంగా మారలేదనే విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1977 నవంబర్ 15న జాతీయ పోలీసు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అప్పటి మాజీ గవర్నర్ ధర్మవీర అధ్యక్షత వహించారు. కమిషన్ 1979 నుంచి 1981 మధ్య ఎనిమిది నివేదికలను సమర్పించింది. జాతీయ పోలీసు కమిషన్ పోలీసుల పాత్రను కేవలం నేర నియంత్రణకు పరిమితం చేయలేదు. రాజ్యాంగం కల్పించిన పౌరుల హక్కులను రక్షించడం, బలహీన వర్గాల ఫిర్యాదులపై తక్షణ చర్య, పోలీసు అధికార దుర్వినియోగాన్ని నిరోధించడం, రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు అతీతంగా నిష్పాక్షికంగా పనిచేయడం వంటి అంశాలను కూడా తన పరిశీలనలోకి తీసుకున్నది.
పోలీసులు ప్రజలకు స్నేహపూర్వకంగా ఉండాలి అనే భావన కొత్తది కాదు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే దీనిపై అధికారికంగా సూచనలు వచ్చాయి. పోలీసు సంస్కరణల అమలు మందగించడంతో సుప్రీంకోర్టు ప్రక్రియలో భాగంగా 1998లో జేఎఫ్ రిబీరో కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత 2000లో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య అధ్యక్షతన పోలీసు సంస్కరణల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ దాదాపు 240 సిఫారసులు చేసింది. ఇన్ని కమిటీలు వచ్చినప్పటికీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉన్నది. పోలీసు ప్రజలకు చేరువయ్యారా? లేక రాజకీయ అధికారానికి మరింత చేరువయ్యారా? పరిపాలనా పరంగా పోలీసులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే. కానీ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి వ్యక్తిగత రక్షకులుగా వారు మారకూడదు. అధికారంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని, నాయకుడిని, రాజకీయ ప్రతిష్టను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత కాదు. చట్టాన్ని అమలు చేయడం, ప్రజల ప్రాణాలను కాపాడటం, పౌరుల హక్కులను రక్షించడమే వారి మొదటి బాధ్యత. ప్రభుత్వం మారిన ప్రతిసారీ పోలీసులు కూడా తమ యజమానిని మార్చుకున్నట్టు కనిపిస్తే అది ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పోలీసు లాఠీ అధికార పార్టీకి వ్యక్తిగత ఆయుధం కాదు. అరెస్టు అధికారం ప్రతీకారం తీర్చుకునే సాధనం కాదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు ,9391533339
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy| రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు.. కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకొన్న మంత్రి ఉత్తమ్
ప్రజల రక్షకులా? ప్రభుత్వ కవచాలా?
Revanth Reddy | సీఎం బర్త్‌డే ప్రచార ఖర్చు 150 కోట్లు?.. పత్రికల్లో ప్రకటనలు, సోషల్‌మీడియా, హోర్డింగ్‌ల కోసం భారీగా వెచ్చింపు
జీవో-31 సుప్రీం తీర్పునకు విరుద్ధం!
Mahesh Kumar Goud| నా మాట ఎవరూ వినట్లే .. నేనేం చేయాలి.. ఏఐసీసీకి మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

