జీవో-31 సుప్రీం తీర్పునకు విరుద్ధం!
దశాబ్దకాలం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు మోక్షం లభించనున్నదని ఆశించిన నిరుద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురైంది.
దశాబ్దకాలం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు మోక్షం లభించనున్నదని ఆశించిన నిరుద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురైంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాల్సిన ప్రభుత్వ అధికారులు పారదర్శకతను గాలికొదిలేసి అవినీతికి రాజమార్గం పరిచేలా అసంబద్ధ నిబంధనలను రూపొందించడం విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 21, దానికి కొనసాగింపుగా వచ్చిన సవరణ జీవో 31ను నిశితంగా పరిశీలిస్తే, ఈ నియామక ప్రక్రియ అకడమిక్ ప్రతిభను అపహాస్యం చేస్తూ కేవలం పైరవీకారులకు మాత్రమే అనుకూలంగా ఉన్నదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్న ఈ నిబంధనలు తక్షణమే సమీక్షించాల్సిన అవసరం ఉన్నది.
విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు అత్యంత పారదర్శకంగా ఒకే ప్రామాణిక విధానంలో జరగాలి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద యూజీసీ ఇచ్చిన అధికారిక సమాధానంలో కూడా ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు కచ్చితంగా పాటించాలని స్పష్టంగా పేర్కొన్నది. అయినప్పటికీ అధికారులు ఆ జాతీయ స్థాయి మార్గదర్శకాలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. నియామకాల పరిశీలనకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేయడమే యూజీసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఉన్నత విద్యలో అత్యంత కీలకమైన, కఠినమైన అర్హత డాక్టరేట్ (పీహెచ్డీ). ఏండ్ల తరబడి గ్రంథాలయాల్లో, ప్రయోగశాలల్లో శ్రమించి పీహెచ్డీ సాధించిన అభ్యర్థులకు పాత జీవో 21లో కేవలం 10 మార్కులు మాత్రమే కేటాయించి వారి పరిశోధనా కృషిని రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా అవమానించింది. ఈ విమర్శల వెల్లువ నేపథ్యంలో సర్కార్ దిగివచ్చి జీవో 31 పేరుతో కొన్ని సవరణలు చేసినా, అది కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోయింది.
యూజీసీ 2018 నిబంధనల్లోని టేబుల్ 3-ఏని ఇందులో చేర్చి, పీహెచ్‌డీకి గరిష్ఠంగా 30 మార్కులు, నెట్ లేదా జేఆర్ఎఫ్కు 7 మార్కులు, పరిశోధనలకు 10 మార్కులు కేటాయిస్తూ పార్ట్-ఏని 100 మార్కులకు సవరించారు. ఇక్కడి వరకు అభ్యర్థులకు కొంత న్యాయం జరిగినట్లే అనిపించినా, అసలు దగా అంతా ఇక్కడే మొదలైంది. అభ్యర్థి సాధించిన ఈ 100 మార్కుల అకడమిక్ స్కోర్‌ను టీజీసీహెచ్ఈ స్క్రూటినీ కమిటీ 50 మార్కులకు..అంటే 50 శాతం వెయిటేజీకి నిర్దాక్షిణ్యంగా కుదించడం విచారకరం. ఇది అభ్యర్థుల ప్రతిభను అణగదొక్కే కుట్రలో భాగమే.
మిగిలిన 50 శాతం మార్కులను కేవలం అధికారులు, ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల వ్యక్తిగత విచక్షణకు వదిలేయడమే ఈ ఎంపిక విధానంలో దాగివున్న అతిపెద్ద కుట్ర. డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్ అసెస్మెంట్ పేరిట డెమోకు (పార్ట్-బీ) 30 మార్కులు, ఇంటర్వ్యూకు (పార్ట్-సీ) 20 మార్కులు కేటాయించారు. పార్ట్-బీలో పొందుపరిచిన నిబంధనలు చూస్తే
ఎవరికైనా విస్మయం కలుగకమానదు.
ఇందులో ఆహ్వానిత ఉపన్యాసాలకు అంటే ఇన్వైటెడ్ లెక్చర్స్ లేదా కీ-నోట్ స్పీకర్‌గా వ్యవహరించినందుకు 5 మార్కులు కేటాయించడం ఎంత అసంబద్ధంగా ఉన్నదో విధాన నిర్ణేతలు ఆలోచించాలి. కొత్తగా పీహెచ్డీ పూర్తి చేసి, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న పార్ట్‌టైమ్ లెక్చరర్ లేదా కాంట్రాక్ట్ అకడమిక్ కో-ఆర్డినేటర్‌ను ఎవరైనా జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ఆహ్వానిస్తారా? విశ్వవిద్యాలయాల్లోని రెగ్యులర్ ప్రొఫెసర్లకే దక్కని ఈ అవకాశం నిరుద్యోగులకు ఎలా దక్కుతుంది? అంతేకాకుండా మూక్ (MOOC) కోర్సులు, స్వయం (SWAYAM) కంటెంట్ డెవలప్ చేయడానికి, ఇన్నోవేటివ్ పెడగాజీకి అదనపు మార్కులు కేటాయించారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్, నిరుద్యోగ అభ్యర్థులు అసలు ఇలాంటి మూక్స్ కోర్సులు రూపొందించడానికే అర్హులు కారు. అలాంటివారు విశ్వవిద్యాలయ స్థాయి కరిక్యులం ఎలా డిజైన్ చేస్తారు? ఇలాంటి అసాధ్యమైన అంశాలకు ఏకంగా 5 మార్కులు ఎలా కేటాయిస్తారు? ఇవన్నీ గమనిస్తే తమ అనుయాయులకు అక్రమంగా లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశపూర్వకంగా చొప్పించిన నిబంధనలే అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పార్ట్-బీలో డెమో అని ఒకసారి, పార్ట్-సీలో రీసెర్చ్ ప్రజెంటేషన్ అని మరోసారి…ఇలా ఒకే స్కిల్‌ను రెండుసార్లు ఎందుకు పరీక్షిస్తున్నారో అర్థం కావడం లేదు. ఒకే నైపుణ్యాన్ని రెండు పర్యాయాలు మూల్యాంకనం చేయడం వెనుక ఉన్న మర్మమేమిటో ఆ అధికారులకే తెలియాలి.
నియామకాల్లో ఇంటర్వ్యూల పాత్రపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1985లో ‘అశోక్ కుమార్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా’ కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇంటర్వ్యూ లేదా వైవావోసీకి కేటాయించే మార్కులు ఎట్టిపరిస్థితుల్లోనూ మొత్తం మార్కుల్లో 12.2 శాతానికి మించకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టంగా తేల్చిచెప్పింది. ఇంటర్వ్యూలకు అధిక మార్కులు కేటాయిస్తే, అది ఎంపిక ప్రక్రియను అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుందని, అత్యుత్తమ అకడమిక్ ప్రతిభ ఉన్న అభ్యర్థిని సైతం ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసి ఎంపిక కాకుండా కుట్ర చేయవచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొఠారి కమిషన్ సైతం ఇంటర్వ్యూ అనేది అభ్యర్థి ప్రతిభను అంచనా వేసే ఒక అదనపు పరీక్షగా మాత్రమే ఉండాలని సూచించింది. ఈ జాతీయ స్థాయి మార్గదర్శకాలను గాలికొదిలేసి తెలంగాణ ప్రభుత్వం డెమో, ఇంటర్వ్యూలకు కలిపి సగానికి సగం అంటే 50 శాతం వెయిటేజీ ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే కాదు, పరోక్షంగా ఆశ్రిత పక్షపాతానికి, రాజకీయ పైరవీలకు రాజమార్గం వేయడమే అవుతుంది.
ఈ 50 మార్కులను కేవలం ఒక కమిటీ చేతిలో పెట్టడం రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల హక్కును కాలరాయడమే. ఒక అభ్యర్థి తన జీవితకాలంలో రాత్రింబవళ్లు చదివి సాధించిన అకడమిక్ రికార్డుకు 50 మార్కులైతే, కేవలం అరగంటలో ముగిసే డెమో, ఇంటర్వ్యూలకు మరో 50 మార్కులు ఇవ్వడం విద్యాప్రమాణాల పాలిట మరణశాసనమే అవుతుంది.
ప్రభుత్వం జీవో 31లోని 30+20 మార్కుల ఫార్ములాను, పార్ట్-బీలోని అసంబద్ధమైన నిబంధనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. డెమో, ఇంటర్వ్యూల వెయిటేజీని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గరిష్ఠంగా 12 నుంచి 15 శాతానికి మాత్రమే పరిమితం చేయాలి. మిగిలిన 85 శాతం మార్కులను నేరుగా అభ్యర్థి అకడమిక్ మెరిట్ ఆధారంగానే కేటాయించాలి.
(వ్యాసకర్త: న్యాయ నిపుణుడు)
ఇంటర్వ్యూలకు అధిక మార్కులు కేటాయిస్తే, అది ఎంపిక ప్రక్రియను అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుందని, అత్యుత్తమ అకడమిక్ ప్రతిభ ఉన్న అభ్యర్థిని సైతం ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసి ఎంపిక కాకుండా కుట్ర చేయవచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
-కట్కూరి శ్రీనివాస్,94909 34520
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జీవో-31 సుప్రీం తీర్పునకు విరుద్ధం!
Revanth Reddy | పర్సంటేజీల వేట పాలమూరుపై ఊగిసలాట.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు శాపంగా రేవంత్ సర్కార్
కరువు వేళ చేతులెత్తేసిన సర్కార్
Drought Relief | రైతన్నకు రేవంత్ సర్కార్ మరోసారి మొండిచెయ్యి.. కరువు సాయం ఎగవేతే!
Kodangal Lift Irrigation | మరో టెండరూ ఆ మంత్రి కంపెనీకే!.. కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సొంతానికి వాడుకుంటున్న నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

