ఇంటర్ రద్దు..ఎన్నో ప్రశ్నలు!
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యకు సెలవు ప్రకటిస్తున్నది. 1969 నుంచి కొనసాగుతున్న విధానానికి ఇక తెరపడనున్నది. ఇక నుంచి పాఠశాల విద్యలో భాగంగా 11,12 తరగతులు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యకు సెలవు ప్రకటిస్తున్నది. 1969 నుంచి కొనసాగుతున్న విధానానికి ఇక తెరపడనున్నది. ఇక నుంచి పాఠశాల విద్యలో భాగంగా 11,12 తరగతులు నిర్వహించనున్నారు. ఇదంతా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో జరుగుతున్నదని ప్రభుత్వం చెప్తున్నది. మూడేండ్లుగా విద్యా రంగంలో సీఎం ప్రకటనలు ఘనంగా, ఆచరణ శూన్యంగా ఉంటున్నాయి. అధికారంలోకి రాగానే స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్కూల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య వంటి చర్యలను ప్రకటించారు. 26 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా కుదించడం కూడా ప్రకటనల జాబితాలో ఉన్నది.
ప్రభుత్వం విద్యారంగంలో పలు ప్రకటనల తర్వాత ఆకునూరి మురళి చైర్మన్‌గా తెలంగాణ విద్యాకమిషన్ నియామకం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం కేశవరావు కమిటీని ప్రకటించింది. రెండు కమిటీల నివేదికల సిఫార్సులు ఏమయ్యాయో అనే చర్చ జరుగలేదు. ఆ వెంటనే ఇంటర్ విద్య రద్దు ప్రకటన వచ్చింది. నిరుడు విద్యా సంవత్సరం చివరలో ఇంటర్ రద్దు విషయం ప్రకటించినప్పటికీ సాంకేతిక అంశాల ఆటంకాలతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలు కాలేదు. ఇక వచ్చే సంవత్సరం ఇంటర్ విద్య రద్దు కానున్నది. ఆ తర్వాత పాఠశాల విద్యలో జరగనున్న మార్పులు ఏమిటి ? ఆ మార్పులన్నీ ప్రభుత్వ పాఠశాలల్లోనేనా? లేక 65 శాతం మంది విద్యార్థులు చదివే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇదే విధానం అమలవుతుందా అనే విషయంలో స్పష్టతలేదు.
ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు అదనంగా, రెసిడెన్షియల్ పద్ధతిలో ఆరు రకాల గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు (మాడల్ స్కూల్స్), బాలికలకు ప్రత్యేకంగా కేజీబీవీ పాఠశాలలు, గిరిజన సంక్షేమశాఖ నిర్వహణలో గిరిజన పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కొన్నింటిలో ఇప్పటికే ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంటర్ రద్దయితే ఆయా పాఠశాలల్లో 11, 12 తరగతుల కోసం అదనంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతులు కల్పించాల్సి ఉంటుంది. అన్ని పాఠశాలల్లో ఇంటర్ తరగతులు ప్రారంభిస్తే జూనియర్ కళాశాలలోని అధ్యాపకులను ఏ పాఠశాలలకు కేటాయిస్తారు? అక్కడ బోధన సిబ్బందిని ఎలా సర్దుతారు? ప్రతి పాఠశాలలోనూ ఇంటర్ తరగతులు ప్రారంభిస్తే అన్ని గ్రూపులు ప్రారంభిస్తారా? అదనంగా అవసరమయ్యే బోధన సిబ్బందిని ఎలా సమకూరుస్తారు? ఇవన్నీ ప్రశ్నలుగా మిగులుతున్నాయి.
ఇంటర్ విద్య రద్దు ప్రకటనతో యావత్తు విద్యాశాఖ అచేతనంగా మారకుండా జాగ్రత్తపడాలి. కానీ మూడేండ్ల అనుభవం చూస్తే ప్రకటనలు ఘనం, ఆచరణ శూన్యంగానే ఉన్నది. ఈ మార్పులకు నిధుల లభ్యత ఎలా ఉండబోతున్నది? మాడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చడానికి రూ.787 కోట్ల రుణం ఆర్థిక సంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సీఎస్ఆర్ నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూపాయి కూడా లేకపోవడం ప్రభుత్వానికి విద్యారంగంపై చెప్పే మాటలకు, చేతలకు మధ్య తేడాను స్పష్టం చేస్తున్నది.
విద్యారంగం అభివృద్ధి విషయంలో నిధుల కోసం ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులపై ఆధారపడటమేనా? ఆ క్రమంలోనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణాలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి అనేక రకాల పాఠశాలల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన పాఠశాలలను ఏ రకంగా మార్చబోతున్నారు? సర్కారీ బడుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ సందర్భంలో ప్రభుత్వ తాజా చర్యలు తల్లిదండ్రుల ఆదరణను ఎలా పొందబోతున్నాయి? ఈ విధానాలు ఇలా ఉండగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని వివిధ సర్వేలు చెప్తున్నాయి. అయినప్పటికీ ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ ఆచరణాత్మక చర్యలు శూన్యం.
డిప్యూటీ విద్యాధికారులు, మండల స్థాయిలో మండల విద్యాధికారి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకుండా విద్యారంగ ప్రమాణాలు పెరుగవనే సంగతి ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నదా? జూనియర్ కాలేజీలు పాఠశాల విద్యలో విలీనమైతే ఆ కళాశాలల్లోని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్మెంట్ బెనిఫిట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎం చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల మధ్య సర్వీస్ రూల్స్ న్యాయవివాదాలతో ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో పోస్టుల ఉద్యోగోన్నతులు నిలిచిపోయాయి. ఆ వివాదం పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ఫలితంగా పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది.
ఇప్పుడు కొత్తగా జూనియర్ కాలేజీల అధ్యాపకులు పాఠశాల విద్యలో చేరితే వీరికి సంబంధించిన సర్వీస్ నిబంధనలు ఎలా ఉండబోతాయి? న్యాయవివాదాలు రాకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానం అంశాలే ప్రతిపాదిత విద్యా విధానంలో ఉండడం గమనిస్తాం. రాష్ర్టాల హక్కులను హరిస్తూ కేంద్రీకరణను పెంచే, ప్రైవేటీకరణకు దోహదం చేసే జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా దొడ్డిదారిన అమలు చేయడానికి ప్రయత్నించడం శోచనీయం.
రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన 15 శాతం నిధులను బడ్జెట్లో కేటాయించాలి. నిధుల లభ్యతతో నే పాఠశాలలకు, మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయుల నిరంతర నియామకాల కోసం ఏటా డీఎస్సీని నిర్వహించడం, కొత్త పాఠశాలలను స్థాపించడం వీలవుతుంది. ప్రభుత్వ అజమాయిషీలోనే పాఠశాలలను అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేసి, ప్రతి సబ్జెక్టుకూ, ప్రతి తరగతి కీ ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. పౌష్టికాహారం తో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అంది స్తూ పటిష్టమైన పర్యవేక్షణ కలిగి జవాబుదారీతనం తో కూ డిన, ఉన్నత ప్రమాణాల విద్యను అందించాలి. ఈ మేరకు తల్లిదండ్రులకు గ్యారెంటీ ఇచ్చేలాగా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలి.
ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానాన్ని రూపొందిస్తామని చెప్తే, మన రా ష్ట్రం అవసరాలు ఏంటి? రాష్ర్టానికి అవసరాలు ఉంటాయా? మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తయారు కాకూడదా? విద్య ఎవరి అవసరాలు తీర్చాలి? విద్యా లక్ష్యాలు ఏమి టి? లక్ష్యాలను ముందు నిర్ణయించి, అందుకు అనుగుణంగా విద్యావిధానం రూపొందించాలి. విద్యాసంస్థలను నెలకొల్పాలి. రాష్ట్రంలో లభ్యమయ్యే సహజ వనరులు, ఖనిజ సంపద, జల వనరులను తెలంగాణ సమా జ అభివృద్ధికి ఉపయోగపడేలా చూసే విద్యావిధానాన్ని రూపొందించాలి. అందులో విద్యార్థులను భాగస్వాములుగా చేసి, వారిని ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. ఇందులో జిల్లాల్లోని వి ద్యాలయాలు ఆయా ప్రాంతాల్లోని వనరులను ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించుకునేలా పరిశోధనలు జరిపే విజ్ఞాన కేంద్రాలుగా రూపొందించాలి. అంతేకానీ కార్పొరేట్ సంస్థలకు చవక కార్మికులుగా మన విద్యార్థులను తయారుచేసి, ఎగుమతి చేసే వ్యవస్థగా విద్యావిధానం రూపొందకూడదు.
(వ్యాసకర్త: విద్యారంగ విశ్లేషకుడు)
– కే వేణుగోపాల్ 98665 14577
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

