స్కూళ్లను గాలికొదిలి పేరు మార్పులా?
తెలంగాణ స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో విద్యాశాఖకు అనుబంధంగా మాడల్ స్కూళ్లు నడుస్తున్నాయి. వీటిని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చుతామంటూ ప్రభుత్వం రూ.787 కోట్లతో ప్రణాళికను రూపొందించింది.
తెలంగాణ స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో విద్యాశాఖకు అనుబంధంగా మాడల్ స్కూళ్లు నడుస్తున్నాయి. వీటిని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చుతామంటూ ప్రభుత్వం రూ.787 కోట్లతో ప్రణాళికను రూపొందించింది. మాడల్ స్కూళ్లలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నది. కానీ కొత్తగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశపెడుతామని ప్రభుత్వం చెప్తున్నది. ఒక్కో పాఠశాలకు రూ.3 కోట్ల చొప్పున రూ.582 కోట్లు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. ఏఐఐబీ నుంచి తీసుకునే రుణంలో కొంత మాడల్ స్కూళ్లకు కేటాయిస్తామని పేర్కొన్నది.
మాడల్ స్కూళ్ల కోసం మొత్తం రూ.787.54 కోట్లు కావాలని పేర్కొన్నది. అందులో ఏఐఐబీ రుణం నుంచి 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులేవైనా వస్తే.. వాటిని సర్కార్ తన వాటాగా కేటాయించే యోచనలో ఉన్నది. సీఎస్ఆర్ నిధుల కోసం ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పబ్లిక్ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఒకవేళ సీఎస్ఆర్ నిధులు రాకుంటే ఈ ప్రతిపాదన చెట్టెక్కుతుందా? ప్రభుత్వం నుంచి స్పష్టతలేదు.
మరోవైపు మాడల్ స్కూల్ టీచర్లు తమ 12 రకాల డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పాఠశాల విద్యాశాఖలో మాడల్ స్కూళ్ల విలీనం, 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాల చెల్లింపు, జీవోల అమలు, టీజీటీలకు నోషనల్ సర్వీస్, ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వంటివి ప్రధానమైన డిమాండ్లు. తుది ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడం, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయడం కూడా ఉన్నాయి. ఇవన్నీ టీచర్ల దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించిన అంశాలే తప్ప, తక్షణ ఆర్థిక భారంగా పరిగణించాల్సిన అవసరం లేదు.
194 మాడల్ స్కూళ్లలో మొత్తం 3,880 పోస్టులకు గాను 1,080 ఖాళీగా ఉన్నాయి. ఇందులో సుమారు 97 ప్రిన్సిపాల్, 560 పీజీపీ, 423 టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల భర్తీ జరగాలి. డీఏ బకాయిల పెండింగ్, సీపీఎస్ నిధుల సెటిల్మెంట్ చేయాలి. విద్యార్థులకు హాస్టల్ వసతి, రవాణా సౌకర్యం లేదు. బాలికలకు హాస్టల్ వసతులు అరకొరగా ఉన్నాయి. తాగునీరు, టాయిలెట్స్, ల్యాబ్, లైబ్రరీ సరిగా లేవు. కొన్ని స్కూల్స్ పక్కనే డంపింగ్ యార్డులు ఉండటం వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రభుత్వం రూ.787 కోట్లతో చేపడుతామని చెప్తున్న ప్రణాళికలో ప్రధానమైన సమస్యలేవీ పేర్కొనలేదు.
రాష్ట్రంలో బాలికలకు ప్రత్యేకంగా 495 కేజీబీవీ విద్యాలయాలు, వివిధ గురుకులాలు రెసిడెన్షియల్ విధానంలో ఉన్నాయి. మాడల్ స్కూళ్లు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో ఉండగా, కేజీబీవీలు సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో, గురుకులాలు ఐదు రకాల సొసైటీల నిర్వహణలో ఉన్నాయి. గురుకులాలు నేరుగా విద్యాశాఖతో సంబంధం లేకుండా ఉండగా, మాడల్ స్కూళ్లు, కేజీబీవీలు విద్యాశాఖకు అనుబంధంగా ఉన్నాయి. అయినప్పటికీ విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ లేదు. వీటిపై రాష్ట్ర విద్యాశాఖ, విద్య శిక్షణ పరిశోధనా సంస్థ అకడమిక్ వ్యవహారాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏమీ లేదు. అకడమిక్ పర్యవేక్షణ లేకపోవడంతో విద్యాప్రమాణాల పరిశీలన, మూల్యాంకనం విద్యాశాఖతో సంబంధంలేని అధికారుల చేతుల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వరంగంలోని పాఠశాలలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. అన్ని స్కూళ్లలో ఒకే సర్వీస్ నిబంధనలు లేకపోవడం చాలా సమస్యలకు దారి తీస్తున్నది.
ప్రభుత్వం నిధుల కొరత సాకుతో మౌలిక వసతుల కల్పన కోసం సీఎస్ఆర్ నిధులను, అప్పుల ద్వారా పాఠశాలలను నిర్వహిస్తాననే మైండ్ సెట్ నుంచి బయటపడాలి. కొఠారి కమిషన్ సూచించినట్టుగా రాష్ట్ర బడ్జెట్లో 10% నిధులను విద్యకు కేటాయించి, పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి, విద్యావ్యవస్థను పటిష్టం చేయాలి. ఉపాధ్యాయుల సర్వీసు సంబంధమైన సమస్యలతో పాటు, ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. పాఠశాల విద్యాశాఖను కాపాడడంతోపాటు, మాడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసి, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి.
-కె.వేణుగోపాల్, 98665 14577
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

