అంతర్గత వలస పాలన నుంచి 2014లో విముక్తమైన తెలంగాణ, కేవలం పదవ ఏట అడుగుపెడుతుండిన సమయానికే ఇంతటి సర్వతోముఖాభివృద్ధిని సాధించగలదని ఎవరూ ఊహించి ఉండరు. అధికార కాంక్షతో ప్రతిపక్షాలు, సినిసిజంతో భద్రలోక్ మేధావులు ఏ వాచాలత చూపినా, వారిని సామాన్యులు లెక్కచేయక ఈసడిస్తున్నారని, జరుగుతున్న అభివృద్ధిని గుర్తించి రెండు చేతులా ఆహ్వానిస్తున్నారని, ఇంకా మిగిలిన అరకొర సమస్యలు కూడా తప్పక పరిష్కారం కాగలవన్న పూర్తి విశ్వాసంతో ఉన్నారని, జ్ఞానేంద్రియాలను తెరచుకుని ప్రజలకు వద్దకు వెళ్లి సంభాషించేవారికి స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ విధంగా తెలంగాణ తల్లి ఈ రోజున కళకళలాడే దరహాస వదనంతో తన పిల్లలను పదవ ఏటిలోకి తోడ్కొని పోతున్నది.
ఈ వేళన నాకు అనేకానేకం గుర్తుకువస్తున్నాయి. 1960ల మధ్యకాలంలో అప్పటికింకా రెండవదశ తెలంగాణ ఉద్యమం లేదు. అప్పటికి పదేండ్ల క్రితం ఆంధ్రలో తెలంగాణ విలీనాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారన్నది నలుగురు చెప్పగా విన్నమాట మాత్రమే. తర్వాత 1960ల చివరలో ఉద్యమం మొదలైంది. కానీ, అంతకు కొద్ది సంవత్సరాల క్రితమే వరంగల్ జిల్లాలో గోదావరి ఒడ్డున ఏటూరు నాగారం ప్రాంతమంతటా స్వయంగా కళ్లారా గమనించాను తెలంగాణ ఏ విధంగా వలస దోపిడీకి గురవుతున్నదో. అక్కడి సారవంతమైన భూములు, అనువైన వాతావరణం, కారుచవకగా దొరికే గిరిజన కూలీలు కోస్తా ప్రాంతపు వాణిజ్య పంటల (పొగాకు, మిర్చి) పెట్టుబడిదారులకు దోపిడీ కేంద్రంగా మారాయి. షెడ్యూల్డ్ గిరిజన పంచాయతీ సమితి అయిన ఏటూరు నాగారంలో గిరిజనుల నుంచి భూమి బదలాయింపులు పూర్తిగా నిషిద్ధం కాగా, ధనిక రైతు లు, కోస్తా పెట్టుబడిదారులు రకరకాల మాయోపాయాలతో ఆ భూములను తమ అధీనంలోకి తీసుకున్నారు. గిరిజన రైతులను కూలీలుగా మార్చారు. ఆగ్రహించిన గిరిజన యువకులు 1960ల చివరికి వచ్చేసరికి నక్సలైట్లుగా మా ర టం, కోస్తా మోతుబరుల దర్శకత్వాన ఎన్కౌంటర్లకు గురికావడం మొదలైంది. తెలంగాణ ఏ తీరున దోపిడీ పాలవుతున్నదో, ఇంకా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1969లో మొదలుకాకముందే ఈ రచయిత అనుభవానికి వచ్చింది ఆ విధంగా..
తర్వాత 1968లో ప్రత్యక్షంగా గమనించిన మరొక ఉదంతం నన్ను తెలంగాణ ఉద్యమానికన్న ముందే తెలంగాణ వాదిగా మార్చింది. అవి హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బీఏ చదువుతున్న రోజులు. ఒక ముఖ్యుడైన కాంగ్రెస్ నాయకుడు కోస్తా యువకుల నుంచి డబ్బు తీసుకుని దొంగ ముల్కీ సర్టిఫికెట్లు ఇప్పించటం పలుమార్లు చూశాను. ఆ సర్టిఫికెట్లు తీసుకున్నవారు స్థానిక విద్యాసంస్థల్లో సీట్లు, ఇతరత్రా ఉద్యోగాలు సంపాదించటం వల్ల తెలంగాణ పిల్లలు ఆ మేరకు అవకాశాలు కోల్పోతుండేవారు. ఇవన్నీ మనసులో పేరుకుపోయి 1969-70 ఉద్యమంలోకి ఉధృతంగా వెళ్లాను. తెలంగాణ వస్తే ఇటువంటి అన్యాయాలు ఆగిపోతాయని గట్టిగా అనిపించింది గాని, ఇప్పుడు రాష్ట్రం సిద్ధించిన తర్వాత కండ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్న అద్భుతమైన సర్వతోముఖాభివృద్ధి ఎన్నడూ నా ఊహలోకైనా రాలేదు.
గొప్ప చరిత్ర, సంస్కృతి, సమృద్ధియైన వనరులు, శ్రమించే తత్వంతో పాటు ఉదారమైన ప్రేమాస్పద స్వభావం గల ప్రజలూ గల ఈ తెలంగాణ భూమి, తన సంకెళ్లు తెగిన ఈ వేళ నుంచి ఇక వెనుదిరగని రీతిలో భవిష్యత్తులోకి పురోగమించగలదనటం నిస్సందేహకరమై కనిపించింది.
ఎందుకైతేనేమి 1969-70 ఉద్యమం నిరాశపరుస్తూ ముగిసిన వెనుక, 20వ శతాబ్దపు చివరలో తిరిగి ఆందోళనలు మొదలుకావటం, అంతకన్న ముఖ్యంగా అవి సాగుతుండిన తీరు, మరీ ముఖ్యంగా కేసీఆర్ రంగప్రవేశం నుంచి మారిన స్వరూప స్వభావాలు, ఎడతెగక పట్టుదలతో నిరంతరమైన రాజీలేని కొనసాగింపు, 1969-70కి భిన్నంగా ఉద్యమం మారుమూల గ్రామాలకూ సబ్బండ వర్గాలకూ చొచ్చుకుపోయిన వైనం, ఈసారి మన కోర్కె సిద్ధించక తప్పదనే నమ్మకాన్ని కలిగించింది. ఆ కల 2014 జూన్లో సాకారమైనప్పుడు, వెనుదిరిగి దశాబ్దాల అనుభవాలను నెమరువేసుకోగా, ఇక అవి చేదు జ్ఞాపకాల వలె చరిత్ర పుటల్లో మిగిలిపోనున్నాయనటం ఖాయమైంది. గొప్ప చరిత్ర, సంస్కృతి, సమృద్ధియైన వనరులు, శ్రమించే తత్వంతో పాటు ఉదారమైన ప్రేమాస్పద స్వభావం గల ప్రజలూ గల ఈ తెలంగాణ భూమి, తన సంకెళ్లు తెగిన ఈ వేళ నుంచి ఇక వెనుదిరగని రీతిలో భవిష్యత్తులోకి పురోగమించగలదనటం నిస్సందేహకరమై కనిపించింది.
కానీ, ఆ పురోగతి ఇంత స్వల్పకాలంలో ఇం త అపూర్వమైన విధంగా, ఇంత వేగంగా ఉండగలదని గాని, ఇంత సమగ్రంగా సమ్మిళితంగా సాగగలదని గాని, ఒకవైపు తన ప్రజల నుంచి, మరొక వైపు జాతీయ, అంతర్జాతీయ దిశల నుంచి, మనలను ఉక్కిరిబిక్కిరి చేసేంతటి ప్రశంసలను పొందగలదని గాని 2014 జూన్లో ఎంతమాత్రం ఊహించిన విషయం కాదు. ఈ రోజున వెనుదిరిగి చూసుకుంటే అంతా సంభ్రమంగా తోస్తున్నది. 1947లో స్వాతంత్య్రం లభించిన తర్వాత తొమ్మిదేండ్లకు దేశం పరిస్థితి ఏమిటి? దేశంలోని ఏ రాష్ట్రం పురోగతి అయినా ఏమిటి? 2000వ సంవత్సరంలో ప్రత్యేకమైన మూడు రాష్ర్టాలు ఏ విధంగా ఉన్నాయి?
ఇందుకు భిన్నంగా తెలంగాణ అనితర సాధ్యమైన పురోగతి గురించి ఎంతయినా చెప్పవచ్చు. ప్రధానంగా వ్యావసాయికం అయి ఆ రంగంలో ఎంతో వెనుకబడి ఉండిన ఈ రాష్ట్ర గ్రామ సీమలు ఈ రోజున అద్భుతంగా మారాయి.
పంట ఉత్పత్తి మాత్రమే గాక జలసిరులు, పరిశుభ్రత, పచ్చదనం, రహదారులు, విద్యుత్ సరఫరా, మరొకవైపున మెరిసిపోతున్న పట్టణాలు, నమ్మలేనంత వేగంగా వెల్లువెత్తుతున్న పారిశ్రామిక పెట్టుబడులు, అంతటా రూపురేఖలు మారుతున్న పాలనా సౌధాలు, పాలనా వికేంద్రీకరణలు, ఏ ఒక్కరి కంటా కన్నీరొలకని సంక్షేమ పరంపరలు, వైద్య ఆరోగ్య యంత్రాంగాల విస్తరణలు, యావత్ దేశంలోనే అసమానమని పేరు పొందుతున్న శాంతిభద్రతల పరిరక్షణ, రైతులకూ, దళితులకు పేదలకు దేశంలోని మరెక్కడా లేని పథకాలు, గొప్ప ఫలితాలు సాధిస్తున్న గురుకులాలు, సాంస్కృతిక పునరుజ్జీవనాలు, మొత్తంగా మారుతున్న జీవితాలు.. ఈ జాబితా అంతులేనిది.
కేవలం తొమ్మిదేండ్లలో దేశంలోనే మరెవ్వరూ సాధించని ఈ పురోగతి నమ్మలేనిది. నా తరం వారు 1960ల మధ్య నుంచి పడిన మనో వేదన ఈ విధంగా అదృశ్యమవుతున్నది. కన్నకలలు ఈ రీతిన సాకారమవుతున్నాయి. తెలంగాణ యావత్ భవిష్యత్తుకే ఇప్పుడు భరోసా కలుగుతున్నది.
టంకశాల అశోక్