తెలంగాణ ముఖ్యమంత్రికి సరైన గౌరవం లభించడంలేదు. ఆయన కూడా గౌరవంగా ఏమీ మాట్లాడటంలేదు. ముఖ్యమంత్రి కదా.. ఆ హోదాకైనా గౌరవం ఇవ్వాలి కదా అనేవాళ్లు ఉండొచ్చు. పెద్ద హోదాతో గౌరవం రాదు.. ఒక్కోసారి చిన్నహోదాలో ఉన్నవారికి కూడా పెద్ద హోదాలో ఉన్నవారు చాలా గౌరవం ఇస్తారు. మరి ఎందుకలా జరుగుతుంది? అంటే మన పెద్ద వాళ్లు ఎప్పుడో చెప్పారు. గౌరవం ఇస్తే.. గౌరవం వస్తుంది. టేక్ రెస్పెక్ట్ అండ్ గీవ్ రెస్పెక్ట్ అని చిన్న పిల్లలు కూడా చెప్పుకోవడం వింటూ ఉంటాం. మరి ఇంత చిన్న విషయం పెద్ద హోదాలో ఉన్న సీఎంకు తెలియదా? ఇక.. సీఎంకు గౌరవం లభించకపోవడం ఏదైతే ఉందో.. ట్రెండింగ్ టాపిక్.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయం ఎదురుగా ఖద్దరు పంచె, నిండైన విగ్రహంతో ఒక వ్యక్తి వచ్చి నిలబడగానే దాదాపు డజను మంది బిలబిలమంటూ అయన ముందు వాలిపోయారు. వీరిలో కనీసం అరడజను మంది శాసనసభ్యులు ఉన్నారు. ఖద్దరు దుస్తుల్లో హుందాగా నడిచి వచ్చిన ఆ పెద్దాయన రెండు చేతులు వెనక్కి పెట్టుకొని ఆ ఏం జరుగుతున్నది? అని పలకరించగానే హెడ్మాస్టర్ ముందు బుద్ధిమంతులైన విద్యార్థుల్లా వారు సమాధానాలు చెప్తున్నారు. మధ్యలో ఖద్దరు పంచెతో హుందాగా నిలిచినవారు ఓడిపోయిన కాంగ్రెస్ శాసన సభ్యుడు పి.రామచంద్రారెడ్డి, ఆయన చుట్టూ మూగినవారు ఎన్నికల్లో గెలిచిన టీడీపీ శాసన సభ్యులు.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రెండు రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. న్యాయమూర్తుల భవన నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం. న్యాయమూర్తులు ఆ డిజైన్లు చూస్తుంటే ముఖ్యమంత్రి మధ్యలో తల పెడుతున్నారు. ఆ భవనాల గురించి వివరించే వారు కూడా ముందు ఉన్న న్యాయమూర్తులకే వివరిస్తున్నారు. సీఎం వెనుకే ఉండిపోయారు. ముఖ్యమంత్రి అంటే మొత్తం రాష్ర్టానికి ప్రతినిధి. గౌరవం అయినా, అవమానం అయినా అది ఆ వ్యక్తికి కాదు మొత్తం రాష్ర్టానికి. అక్కడ కార్యక్రమంలో భవనాల గురించి వివరిస్తున్న వారికి ఈ సంగతి తెలియదా? ఎవరు ముందు ఉన్నారు? ఎవరు వెనుక ఉన్నారు? అని చూసుకునే బాధ్యత న్యాయమూర్తులది కాదు.
ముఖ్యమంత్రి హోదాకు తగిన గౌరవం లభించకపోవడం అనేది ఒకటి రెండు చోట్ల జరిగింది అంటే ఏదో పొరపాటున జరిగింది అనుకోవచ్చు. పొరపాటు కాదు ఇది ఆనవాయితీగా అయిపోయింది. ప్రొటోకాల్‌లో గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి ఉంటారు. గవర్నర్ పేరుతో పాలన జరిగినా వాస్తవ అధికారంలో సీఎంది మొదటి స్థానం. కానీ ఆ సంగతి ఎవరూ ఎందుకు గుర్తించడంలేదో! ఆ విషయమే ఇప్పుడు చర్చిద్దాం.
ఒక సినిమా ఫంక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తుంటే కనీసం ముందు వరుసలో కూర్చున్న వారి నుంచైనా ఒక్కరు కూడా లేచి నిలబడలేదు. చివరకు మెగాస్టార్ చిరంజీవి కూడా అలానే కూర్చున్నారు. వివిధ కార్యక్రమాల్లో వేదిక పైకి సీఎం వస్తుంటే అప్పటికే అక్కడ కూర్చుని ఉన్న మంత్రులు, శాసనసభ్యులు కూడా లేచి నిలబడని వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి.
ఆనాడు మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న రామచంద్రారెడ్డికి ఎందుకు గౌరవం లభించింది? ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎందుకు గౌరవం లభించడంలేదు? ఓడిపోయిన ఒక మాజీ శాసన సభ్యునికి అంత గౌరవం లభించడం, సీఎం వచ్చినా లేవకపోవడం ఎందుకు అంటే విషయ పరిజ్ఞానంతో పాటు హుందాతనానికి లభించే గౌరవం. రామచంద్రారెడ్డి న్యాయవాది కూడా. మంత్రిగా, స్పీకర్‌గా పని చేశారు. దాదాపు అన్ని పత్రికల యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. జూనియర్ రిపోర్టర్లతో కూడా మర్యాదగా మాట్లాడేవారు. అదే మర్యాదను తిరిగి కోరుకొనేవారు. ఒకసారి ఆర్డీవో రామచంద్రారెడ్డి అని పేరు మాత్రమే రాసి ఆహ్వాన పత్రం అందజేస్తే ‘గారు’ అని రాయనందుకు హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసి, వివాదం ముదిరి ఆర్డీవోకు అరెస్ట్ వారెంట్ వచ్చేటట్టు చేశారు. ఎదుటి వారికి గౌరవం ఇచ్చేవారు, గౌరవం ఇవ్వకపోతే తాడోపేడో తేల్చుకొనేవారు. అది విషయ పరిజ్ఞానంతో వచ్చిన ఆత్మగౌరవం. చెన్నారెడ్డిని మార్చాలి అని హైకమాండ్ నిర్ణయించుకున్నప్పడు ఆ స్థానంలో రామచంద్రారెడ్డిని సీఎం చేయాలి అనుకున్నట్టు పత్రికల్లో వచ్చింది. చెన్నారెడ్డి దిగిపోవడం ఖరారు అయింది. రామచంద్రారెడ్డి పేరు పట్ల చెన్నారెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారు. చెన్నారెడ్డి దిగిపోయే సమయంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల పేర్లు ఖరారు చేశారు. కొత్తగా వచ్చే సీఎం ఈ నియామకాలు చేస్తారు. మీరెలా చేస్తారు అని ప్రశ్నించే సరికి చెన్నారెడ్డికి కోపం వచ్చింది. రామచంరారెడ్డి ప్రశ్న నైతికంగా సరైనదే కానీ రాజకీయాల్లో అలా ఉండదు. చెన్నారెడ్డి అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో రామచంద్రారెడ్డికి సీఎం పోస్ట్ దక్కలేదు. ఆ పదవి నేదురుమల్లిని వరించింది.
సినిమా వాళ్ల మీటింగ్‌లో అయినా, ఏ మీటింగ్‌లో అయినా చాలామంది ప్రస్తుత సీఎం పేరును కూడా సరిగా పలకడం లేదు. పేరు మర్చిపోయిన కారణంగానే ఓ స్టార్ హీరోను ఓ కేసులో అరెస్ట్ వరకు తీసుకెళ్లారని చర్చ జరిగింది. ఏది ఏమైనా సీఎం వ్యవహారమే హుందాగా లేదు, అయన పట్ల మిగిలిన వారు వ్యవహరిస్తున్న తీరూ బాగాలేదు. ఒకనాడు మాజీ శాసనసభ్యునికి లభించిన గౌరవం ఇప్పటి సీఎంకు ఎందుకు లభించడం లేదు అంటే అది స్వీయ లోపమే కానీ ఇతరుల లోపం కాదు. ఇంకా రెండున్నరేండ్ల గడువు మాత్రమే మిగిలి ఉన్నది ఇప్పటికిప్పుడు విషయ పరిజ్ఙానంతో గౌరవం పొందాలి అంటే కష్టమే. ఇక మిగిలింది హుందాగా ఉండడం. చివరకు విద్యార్థులతో మాట్లాడినా బూతులతో ఉపన్యాసాలు సాగిస్తే గౌరవించేది ఎవరు? గతంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఏ పాలకులను కూడా ఇంత భయంకరంగా బూతులు తిట్టలేదు. సీఎం స్థాయి వారే బూతులు మాట్లాడితే బాధిత ప్రజలు, కడుపు మండినప్పుడు, ఆవేదనతో అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. గౌరవం పొందాలి అంటే ముందు గౌరవించడం నేర్చుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడిన కొత్తలో ఒకరోజు శాసనసభలో మంత్రి జగదీశ్‌రెడ్డి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డిని ఉద్దేశించి పరుషమైన ఓ మాట మాట్లాడారు. అది జగదీశ్‌రెడ్డి ఊతపదం. తిట్టాలి అని కాదు.. జానారెడ్డి ఏమీ అనకపోయినా అప్పటి సీఎం కేసీఆర్ సభలోకి రాగానే ఈ అంశాన్ని ప్రస్తావించి జగదీశ్‌రెడ్డితో జానారెడ్డికి క్షమాపణ చెప్పించారు. ఇప్పుడు లాగుల్లో తొండలు వదులుతాను అని సీఎం అంటుంటే, అవినీతిని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా అని మంత్రులు అంటున్నారు. రాహుల్‌గాంధీ ఏమో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలను గాలికి వదిలి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మొహబ్బత్ కీ దుకాణ్లు తెరుస్తామని వెళ్తున్నారు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. హుందాతనం, గౌరవం హోదాతో రావు.