ఊరూరా గ్రామసభలు పెట్టి తాను సాధించిన ఘనకార్యాల గురించి ఊదరగొట్టాలని చూస్తున్న రాష్ట్ర సర్కార్ పంచాయతీల నిధుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులకు సమాన మొత్తంలో సమకూర్చాల్సిన ‘మ్యాచింగ్ గ్రాంట్స్’ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. నిప్పు లేకుండా వంట చేయలేనట్టే..నిధులు లేకుండా పనులు చేయించడం అసాధ్యమని వారికి తెలియదనుకోవాలా? రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటంతో పంచాయతీలకు ఇవ్వాల్సిన పైసలను సరార్ తొకిపెట్టింది. మూడేండ్ల గణాంకాలను పరిశీలిస్తే పంచాయతీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. నిధుల కొరత వల్ల పంచాయతీల్లో పనులు ఏమాత్రం సాగని పరిస్థితులు నెలకొన్నాయి.
కేంద్రం రాష్ర్టాలకు విడుదల చేసే నిధుల్లో 85 శాతం గ్రామ పంచాయతీలు, 10 శాతం మండల పరిషత్‌లు, 5 శాతం జిల్లా పరిషత్‌లకు పోతాయి. 2023 ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఓటమి భయంతో సకాలంలో ఎన్నికలు నిర్వహించనందున నిధుల విడుదలలో ప్రతిష్టంభన ఏర్పడింది. రెండేండ్ల జాప్యం తర్వాత పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అదే రెండేండ్ల కాలానికి కేంద్రం నుంచి సుమారు రూ.3,000 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోవడంతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల జోలికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడం లేదు. దీనివల్ల రూ.450 కోట్లు కోత పడుతుంది. అవి మినహా రావాల్సిన నికర నిధులు రూ.2,550 కోట్ల వరకు ఉంటాయి. లెక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,000 కోట్ల వరకు మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇవ్వాల్సి ఉన్నది. కానీ, గడిచిన రెండేండ్లలో కేవలం వేతనాల కోసం ఒకసారి రూ.613 కోట్లు, మరోసారి రూ.411 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులిపేసుకున్నది. ఈలోగా గత ఏడాది కేంద్రం నుంచి మొత్తం రూ.619.85 కోట్లు గ్రాంటు రూపంలో వచ్చాయి. మరో విడత కింద రూ.620 కోట్లు రావాల్సి ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే..జీతాల సొమ్ము ను ఖజానా ఖాళీగా ఉందనే సాకుతో మ్యాచింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నది. అంతకుముందరి మూడేండ్ల గణాంకాలు పరిశీలిస్తే..బీఆర్ఎస్ సర్కార్ తన వాటాకు మించి నిధులు విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణలో జాప్యం, నిధుల లేమి వల్ల పంచాయతీల్లో సమస్యలు తిష్టవేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సకాలంలో విడుదల చేస్తేనే స్థానిక సంస్థల కష్టాలు తీరుతాయి.
మాజీ సర్పంచులు ఖర్చు చేసిన బిల్లులు పెండింగులో ఉండగానే, పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేసిన సొమ్ము తాలూకు బిల్లులు అదనంగా వచ్చి చేరాయి. మరోవైపు కొత్తగా ఎన్నికైన సర్పంచులు పనులు చేపట్టేందుకు నిధులు అందుబాటులో లేవు. వచ్చిన అరకొర కేంద్ర నిధుల కోసం అటు మాజీ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఇటు కొత్త పాలకవర్గాల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. అందుబాటులో ఉన్న నిధులను బకాయిల కింద సర్దుబాటు చేయాలా? కొత్త పనులకు ఇవ్వాలా? అనేది సమస్యగా తయారైంది. అప్పుసప్పు చేసి పనులు జరిపించిన మాజీ సర్పంచులు నిధులు విడుదల కాకపోవడం వల్ల అడకత్తెరలో నలిగిపోతున్నారు. ఎన్ని మహజర్లు సమర్పించినా సర్కార్‌లో చలనం లేకపోవడంతో పోరుబాట పడుతున్నారు. రెండేండ్ల కాలంలో ఖర్చు చేసిన నిధుల కోసం గ్రామ కార్యదర్శులు సైతం నిలదీస్తున్నారు. కొత్తగా గెలిచిన సర్పంచులు వచ్చిన కొద్దిపాటి కేంద్ర నిధులు పాత బకాయిలకే పోతే తాము ఊర్లలో పనులెలా చేయాలి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు వర్గాలను సముదాయించలేక జిల్లా కలెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కలెక్టర్లను ప్రభుత్వ ప్రచారానికి పురమాయించడం విడ్డూరం. ప్రభుత్వం గ్రామస్వరాజ్యం పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ముందుగా మ్యాచింగ్ నిధులను విడుదల చేయాలి. అలా కాకుండా పాలకులు ఎన్ని బాకాలు ఊదుకున్నా ప్రజలకు ఏమి ప్రయోజనం?