ఇంధన కొరత
ఇరాన్ యుద్ధం మన ఇంట్లోకి, ఇంకా చెప్పాలంటే వంటింట్లోకి వచ్చి అతలాకుతలం చేస్తున్నది. యుద్ధం తీసుకువచ్చిన వంటగ్యాస్ సంక్షోభం ఇంకా వేధిస్తూనే ఉన్నది. వాణిజ్యపరమైన వంటగ్యాస్ కొరత కారణంగా హాస్టళ్లు మూతపడటమో, మెనూను తగ్గించటమో చేశాయి.
ఇరాన్ యుద్ధం మన ఇంట్లోకి, ఇంకా చెప్పాలంటే వంటింట్లోకి వచ్చి అతలాకుతలం చేస్తున్నది. యుద్ధం తీసుకువచ్చిన వంటగ్యాస్ సంక్షోభం ఇంకా వేధిస్తూనే ఉన్నది. వాణిజ్యపరమైన వంటగ్యాస్ కొరత కారణంగా హాస్టళ్లు మూతపడటమో, మెనూను తగ్గించటమో చేశాయి. ఇప్పుడు వాహనాల ఇంధనం సమస్య వీధికెక్కి వీరంగం వేస్తున్నది. నెలరోజుల క్రితం భయాందోళనలతో ప్రజలు అతికొనుగోలుకు పాల్పడటంతో బంకుల వద్ద రద్దీ, నోస్టాక్ బోర్డులు వెలిశాయి. కాలక్రమంగా యుద్ధ తీవ్రతతో పాటు ఇది కూడా కొంత నెమ్మదించింది. కానీ గత మూడు, నాలుగు రోజులుగా మండేఎండలో బంకుల వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతుండటం కనిపిస్తున్నది. అత్యవసర సేవలందించే అంబులెన్సులు కూడా క్యూలైన్లలో నిలుస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇలా వాహనాలు పోటెత్తడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతున్నది.
క్యాబ్ బుకింగుల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన కొరత వల్ల సాధారణ రవాణాతోపాటు వ్యవసాయం రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. డీజిల్ అందుబాటులో లేకపోవటంతో హార్వెస్టర్ యంత్రాలు పనిచేయటంలేదు. దిగుబడి అయిన ధాన్యాన్ని కాంటాల వద్దకు తరలించటమూ వీలుకావటం లేదు. ఈ పరిస్థితికి యుద్ధం ప్రత్యక్షంగా కారణమా? లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణాలోపం కారణమా? అనేది ప్రశ్న.
వాహనదారులు బంకులకు పరుగులు తీయటానికి ఇంధనం కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో పోటెత్తుతున్న వదంతులు కారణమవుతున్నాయనేది తెలిసిందే. నిల్వలున్నాయని, సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని ఇటు రాష్ట్ర పౌర సరఫరా విభాగం గానీ, అటు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని చమురు కంపెనీలు ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి. అయితే, వీరి ప్రకటనలకు భిన్నంగా అనేక బంకులు దగ్గర నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా తెరచి ఉన్న బంకుల వద్ద విపరీతమైన రద్దీ ఉండటం చూస్తే పరిస్థితి అంత సవ్యంగా ఏమీ లేదని సూచిస్తున్నది.
చమురు కంపెనీలు అనుసరిస్తున్న క్రెడిట్ విధానం ఇంధన సరఫరాతో చెలగాటమాడుతున్నదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. దాంతో మనదేశంలోనూ వాహన ఇంధనాల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఎదురవుతున్నది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రస్తుతానికి ఆ జోలికి వెళ్లటం లేదు. కానీ, ఈ రాష్ర్టాల ఎన్నికల ఫలితాల తర్వాత ధరలు పెరుగడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది. ఈలోగా కంపెనీలు ఎంత చమురు అమ్మితే అంత నష్టం అనే ధోరణిలో సరఫరాను కృత్రిమంగా నియంత్రిస్తున్నాయి. ముందస్తుగా డబ్బు చెల్లిస్తేనే ట్యాంకర్ కదులుతుంది అనే విధానం అమలు చేస్తున్నాయి. కొన్ని బంకుల యాజమాన్యాలు రెండేసి ట్యాంకర్ల కోసం డబ్బులు కట్టినా కేవలం ఒక్క ట్యాంకర్‌నే పంపడం వంటివి కృత్రిమ నియంత్రణవైపే వేలెత్తి చూపిస్తున్నది. అటు ధరల విషయంలో కేంద్రం, ఇటు సరఫరా విషయంలో చమురు కంపెనీలు ఆడుతున్న నాటకం సామాన్యులకు సంకటంగా మారింది.
2016లో పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద ప్రజలు క్యూలు కట్టాల్సి వచ్చింది. వారాల తరబడి నగదు లేని పరిస్థితి. 2017లో జీఎస్టీ తిప్పలు మొదలయ్యాయి. ఇంధన ధరలు తగ్గించవచ్చని అధికారంలో లేనప్పుడు హంగామా చేసిన బీజేపీ పాలనలో 2018-23 మధ్యకాలంలో ఇంధన ధరలు తారస్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా కేంద్రం మనసు కరుగలేదు. 2020-21 మధ్యకాలంలో మోదీ సర్కార్ వ్యవసాయరంగంలో నల్లచట్టాలను ప్రవేశపెట్టింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలతో దేశం దద్దరిల్లింది. 2022లో రైల్వే రిక్రూట్మెంట్ నిరసనలతో బీహార్, యూపీ రాష్ర్టాలు అట్టుడికాయి.
అదే ఏడాది ఆర్మీ రిక్రూట్మెంట్లో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు నిరసనగా యువజనులు చేపట్టిన పోరు హింసాత్మకంగా మారింది. ఇక కరోనా కల్లోలంలో ప్రజలను సిద్ధం చేయకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా రాత్రికిరాత్రే ప్రకటించిన లాక్‌డౌన్‌తో, ప్రజలు..ముఖ్యంగా వలస కూలీలు అనుభవించిన నరకం ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఇక వ్యాక్సిన్ కొరత వల్ల ఎదుర్కొన్న సమస్యలది వేరే కథ. ఇప్పుడు చమురు సరఫరాలో అసమర్థత, అవతకతవకలు వచ్చిచేరాయి. అమెరికా హుకూంలన్నిటికీ తలొగ్గుతున్న మోదీ సర్కార్ దేశానికి సరిపడా ఇంధనం ఎందుకు తేలేకపోయింది? తానే టాంటాం వేసినట్టుగా తగ్గింపు ధరలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నది? ఇవీ ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలు.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

